బాబే ‘విల్లా’ దొంగ. ఎమ్మార్ నోట్ ఫైళ్ల సాక్షిగా బయటపడ్డ బండారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబే ‘విల్లా’ దొంగ. ఎమ్మార్ నోట్ ఫైళ్ల సాక్షిగా బయటపడ్డ బండారం

బాబే ‘విల్లా’ దొంగ. ఎమ్మార్ నోట్ ఫైళ్ల సాక్షిగా బయటపడ్డ బండారం

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

* ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు ప్రతిపాదించింది 250 ఎకరాలే
* తొలుత అనుకున్నది హోటల్, కన్వెన్షన్ సెంటర్, గోల్ఫ్ కోర్సు
* ముందుకొచ్చి వెనక్కెళ్లిపోయిన ఐటీసీ, ఈఐహెచ్ లిమిటెడ్
* మళ్లీ ప్రకటనలిచ్చేటపుడూ 250 ఎకరాలకే పరిమితం
* స్పందించి బిడ్లు వేసిన కంపెనీల్లో దుబాయ్ ఎమ్మార్
* వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని మరో 250 ఎకరాలిచ్చిన బాబు
* విల్లాలకిచ్చిన ఆ 250 ఎకరాలనూ ఏ అధికారీ ప్రతిపాదించలేదు
* కనీసం ముందుకొచ్చిన కంపెనీలు కూడా అదనపు భూమి అడగలేదు
* అయినా బాబు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని అధికారులకు ఆదేశాలు
* తరవాత స్క్రూటినీలో అంతా తానై నడిపించిన టీడీపీ అధినేత
* చివరకు సింగిల్ టెండర్ మిగిలేలా చక్రం తిప్పి.. ఎమ్మార్‌కు కేటాయింపు
* ఇవన్నీ ఎమ్మార్ నోట్ ఫైల్స్ సహితంగా కనిపిస్తున్న ఆధారాలే
* అయినా వీటివైపు దృష్టిపెట్టకుండా... విల్లాల్ని శోధిస్తున్న సీబీఐ
* బాబును విచారిస్తేనే అంతా దొరుకుతారంటున్న న్యాయ వర్గాలు

మంథా రమణమూర్తి: 
విల్లాల దొంగ దొరికాడు. కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు రావాల్సిన ప్రాజెక్టులోకి విల్లాల్ని కూడా చొప్పించి, 250 ఎకరాలు మాత్రమే కేటాయించిన ప్రాజెక్టుకు మరో 250 ఎకరాలు జోడించింది సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని సాక్ష్యాలతో సహా బయటపడింది. ‘ముఖ్యమంత్రి మరో 250 ఎకరాల్ని కేటాయించాలనుకుంటున్నారు’ అంటూ నాటి అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ఎమ్మార్ వ్యవహారంలో చంద్రబాబు రాసిన ‘విల్లానామా’ కాస్తా.. ఇలా అడ్డంగా బయటపడింది. ఎమ్మార్ రంగంలోకి దిగాక... దానికి కేటాయించిన భూమిని బాబు 250 ఎకరాల నుంచి హఠాత్తుగా 535 ఎకరాలకు పెంచి, ప్రాజెక్టులోకి విల్లాల్ని కూడా చొప్పించిన తీరు కావాలంటే మీరే చూడండి...

హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, గోల్ఫ్ కోర్స్ నిర్మించాలనుకున్న ఏపీఐఐసీ.. 2000 మార్చిలో పత్రికల్లో ప్రకటనలిచ్చింది. అందుకు స్పందించి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. వాటిలోంచి ఐటీసీ, ఈఐహెచ్ లిమిటెడ్‌లను షార్ట్ లిస్ట్ చేశారు. వాటికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పత్రాలు పంపారు. అయితే ఐటీ సీ ఒక్కటే స్పందించింది. మణికొండ, హుస్సేన్‌సాగర్ రెండు చోట్ల ఉన్న భూములపై అది ఆసక్తి చూపగా.. సాగర్ భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి గనుక మణికొండ భూముల్లో మాత్రమే మొత్తం ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం 2001 మే 14న నిర్ణయించింది. ఐటీసీ దీనికి ఒప్పుకోకుంటే మళ్లీ నోటిఫై చెయ్యాలని సైతం ఏపీఐఐసీని ఆదేశించింది. ఏపీఐఐసీ ఇదే విషయాన్ని ఐటీసీకి లేఖ ద్వారా తెలియజేసింది. కానీ దానికి ఐటీసీ స్పందించలేదు!!!.

మళ్లీ పత్రికా ప్రకటనలు...
తర్వాత మళ్లీ పత్రికా ప్రకటనలిచ్చారు. దాన్లో ప్రతిపాదించింది మణికొండలోని 250 ఎకరాల్నే! అయితే ఆ భూములపై కూడా నాటికి హైకోర్టు స్టే కొనసాగుతోంది. అదే విషయాన్ని ఏపీఐఐసీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. ‘‘ఇప్పటికి ఇలా కొనసాగించండి. స్టే తొలగిపోయాక మరో ప్రకటన ఇద్దాం’’ అన్నారాయన. 2001 జూలై 11న స్టే తొలగింది. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కోసం ప్రకటనలివ్వాలంటూ మరుసటి రోజునే.. అంటే జూలై 12నే నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ది హిందూ, ఎకనమిక్ టైమ్స్ పత్రికల్లో ప్రకటనలు జారీ అయ్యాయి. ఆసక్తి ఉన్న పార్టీలు 2001 ఆగస్టు 25లోగా దాన్ని తెలియజెయ్యాలని వాటిలో పేర్కొన్నారు.

మరో 250 ఎకరాలివ్వాలని సీఎం చెప్పారు...
ఏపీఐఐసీ అధికారులు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన ప్రకటనల్ని జతపరుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి 2001 ఆగస్టు 2, 3 తేదీల్లో నోట్‌లు పంపించారు. కానీ అంతలో భూమికి సంబంధించి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నుంచి ఏపీఐఐసీకి ఆదేశాలందాయి. ముందు ప్రతిపాదించినట్టుగా 250 ఎకరాలు కాకుండా.. మరో 250 ఎకరాల్ని జోడించి మొత్తం 500 ఎకరాల్ని కేటాయించాలని పేర్కొన్నారు! నిబంధనల ప్రకారం పోతున్న అధికారులకు అనుమానం వచ్చింది. నోట్ ఫైళ్లలో దీనిపై వివరణ అడిగారు. దీంతో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పంపిన నోట్‌ను... ఏపీఐఐసీ అధికారులకు చీఫ్ సెక్రటరీ పంపారు. అందులో ఏముందంటే... ‘‘చీఫ్ సెక్రటరీగారూ! ఈ విషయాన్ని పరిశీలించండి. ఈ విషయాన్ని ఇవ్వాళ ఉదయం ముఖ్యమంత్రి నాతో మాట్లాడారు. దానికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని. ఇక చేసేదేమీ లేక.. భూమిని పెంచుతూ 2001, ఆగస్టు 26న మరో ‘సవరణ’ ప్రకటన జారీ చేసింది ఏపీఐఐసీ. చివరికి కేటాయించేనాటికి ఆ భూమి 535 ఎకరాలకు చేరింది.

ఎవరడిగారని పెంచినట్లు?
ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అధికారులేమీ ఆ ప్రాజెక్టుకు 250 ఎకరాలు చాలదు కనక మరో 250 ఎకరాలివ్వాలని ఎక్కడా ప్రతిపాదించలేదు. పోనీ ప్రకటనలకు స్పందించి వచ్చిన కంపెనీలేమైనా ఆ భూమి సరిపోదని, మరింత భూమి కేటాయించాలని అడిగాయా అంటే... అదీ లేదు. పోనీ కేబినెట్ ఏమైనా ఆ మేరకు నిర్ణయం తీసుకుందా అంటే... అదీ లేదు. ఏ ప్రతిపాదనా లేకుండా, ఎవ్వరూ అడ క్కుండా... ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు ఒక్కరే కథ నడిపించారు. తాను మరో 250 ఎకరాలు ఇవ్వాలనుకున్నారు. అందులో విల్లాలకు కూడా చోటు కల్పించాలనుకున్నారు. అంతే! అదే విషయాన్ని అధికారులకు చెప్పి... వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా వారిచేత ఆ పని చేయించారు. 

ప్రభుత్వం ఓకే చేశాకే ఆర్‌ఎఫ్‌పీలు..?
ఇక్కడ మరో చిత్రాన్ని కూడా గమనించాలి. ఈ ప్రాజెక్టుపై బాబు ఆసక్తిని మరో కోణంలో కూడా చూసి తీరాలి. ఎందుకంటే సవరించిన పత్రికా ప్రకటనల్ని అనుసరించి ఈ ప్రాజెక్టు కోసం ఐదు కంపెనీలు బిడ్లు వేశాయి. వీటిలో హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏషియాను, ముంబైకి చెందిన షాపుర్జీ పల్లోంజీని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఎమ్మార్, ఐఓఐ కార్పొరేషన్, ఎల్ అండ్ టీలను షార్ట్ లిస్ట్ చేసింది. ‘‘ఈ మూడు కంపెనీలకూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ లేఖలు పంపండి. కానీ పంపేముందు వాటిని ప్రభుత్వానికి చూపి అనుమతి తీసుకోండి’’ అంటూ ఏపీఐఐసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే ఆ ఆర్‌ఎఫ్‌పీల్ని సీఎం చూసి ఓకే చేయాలన్నమాట. అదీ... ఈ ప్రాజెక్టుపై బాబుకున్న ఆసక్తి. 

అన్నట్టుగానే ఆయన చూసి ఓకే చేశాకే ఆర్‌ఎఫ్‌పీల్ని పంపారు. తర్వాత ఆ మూడు కంపెనీల్నీ ప్రీ బిడ్ మీటింగ్‌కు పిలిచారు. మూడూ హాజరయ్యాయి. తమ ప్రతినిధుల్ని పంపాయి. మరి అక్కడ ఎవరు ఏ చక్రం తిప్పారో కానీ.. టెండర్ల దాఖలుకు ఆఖరి తేదీ అయిన డిసెంబర్ 15 నాటికి ఆ మూడింట్లో ఒకే ఒక కంపెనీ నుంచి ఏపీఐఐసీకి ప్రతిపాదన వచ్చింది. నిజానికి ఒక్కటే బిడ్ వచ్చినపుడు ఎవరైనా దాన్ని రద్దు చేసి తాజాగా మళ్లీ పిలిచే ప్రయత్నాలు చేస్తారు. కారణం.. పోటీ ఉంటేనే న్యాయం జరుగుతుందని. కానీ ఇక్కడ చంద్రబాబునాయుడి సర్కారు ఏం చేసిందో తెలుసా? ‘‘చివరి తేదీ అయిన డిసెంబర్ 15 నాటికి ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది. సీనియర్ అధికారుల సమక్షంలో దాన్ని తెరిచాం. అది దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ కంపెనీదని తేలింది. వారి ప్రతిపాదనను ఓకే చేశాం’’ అంటూ చావుకబురు చల్లగా చెప్పింది!

ఇదీ.. బాబు పాత్ర
ఇదండీ... ఎమ్మార్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప్రాజెక్టులో విల్లాల కోసం చంద్రబాబు తిప్పిన చక్రం. అసలు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది హోటల్, గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్ల కోసం. అది కూడా 250 ఎకరాల్లోనే. కానీ స్వయంగా జోక్యం చేసుకుని మరీ దాన్ని 535 ఎకరాలకు పెంచింది చంద్రబాబు! విల్లాల ప్రాజెక్టును కూడా దాన్లోకి చేర్చింది చంద్రబాబు!! టెండర్ల దశ నుంచి చివరిదాకా ఏ కంపెనీ వస్తోందో, ఎవరు రావాలో, ఎవరికివ్వాలో నిర్దేశిస్తూ చక్రం తిప్పింది చంద్రబాబు!!! 

ఎమ్మార్ ప్రతినిధిగా రంగంలోకి దిగిన కోనేరు ప్రసాద్.. అప్పటికే చంద్రబాబు చలవతో విశాఖలో బాక్సైట్ గనుల్ని కొల్లగొట్టడానికి పెద్ద పథకం వేసుకుని ఉన్నారు. అప్పటికే ప్రభుత్వం తరఫున బాబు చేసిన రాచమర్యాదల్ని అనుభవిస్తూ.. దుబాయ్ ప్రతినిధిగా విశాఖను సందర్శించి వెళ్లారు. అలాంటి ఎమ్మార్‌కు ప్రాజెక్టును కట్టబెట్టిన బాబు.. ఆ తరవాత అధికారం నుంచి దిగిపోయే ముందు హడావుడిగా కొలాబరేషన్ ఒప్పందానికి కూడా తెరతీశారు. ఆ ఒప్పందం ద్వారా పుట్టిన స్టైలిష్ హోమ్స్.. ఆ తరవాత విల్లాల్ని కొల్లగొట్టి ఎలా డబ్బులు దిగమింగిందీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ సాక్ష్యాలతో సహా ఇలా కనిపిస్తున్నాయి. 

ఎమ్మార్ కుంభకోణంపై ‘కూలంకషంగా’ దర్యాప్తు చేస్తున్న సీబీఐకి, గతంలోనే ‘ఆమూలాగ్రం’ విచారణ జరిపిన విజిలెన్స్ విభాగానికి ఈ సాక్ష్యాలేవీ దొరకలేదని, అందుబాటులో లేవని అనుకోలేం. ఈ విషయాలన్నీ వారి దృష్టికి రాలేదనీ అనుకోలేం. అయినా సరే, 2004 తరవాతి పరిణామాల్నే దర్యాప్తు చేస్తామని తనకు తాను గిరిగీసుకున్న సీబీఐ... సుప్రీంకోర్టు అడిగినపుడు మాత్రం ‘‘2000వ సంవత్సరం నుంచి కూడా దర్యాప్తు చేశాం’’ అని చెప్పేసింది. మరి దర్యాప్తు చేసినపుడు ఈ విషయాలేవీ బయటకు రాలేదా? దాని దృష్టిలో ఇవన్నీ అనుమానించదగ్గ అంశాలుగా అనిపించలేదా? ఈ ప్రశ్నలన్నింటికీ ఎప్పటికైనా సీబీఐ బదులిచ్చి తీరాల్సిందే. అలా కాకుండా తన ప్రస్తుత ధోరణినే కొనసాగిస్తూ పోతే సీబీఐ ఉద్దేశమేంటో, దాని లక్ష్యమేంటో మరోసారి నిస్సిగ్గుగా బయటపడుతుంది తప్ప మరొకటి కాదనేది సుస్పష్టం.
Share this article :

0 comments: