ప్యాకేజ్డ్ పాలల్లో ప్రమాదకర బ్యాక్టీరియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్యాకేజ్డ్ పాలల్లో ప్రమాదకర బ్యాక్టీరియా

ప్యాకేజ్డ్ పాలల్లో ప్రమాదకర బ్యాక్టీరియా

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

 ప్యాకెట్ పాలు వాడుతున్నారా? బహుపరాక్.. ఇందులో విషం ఉందని తేలింది. ప్యాకెట్ పాలను పూర్తిగా మరగబెట్టి తాగకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పలు డెయిరీలు రోజూ విక్రయిస్తున్న ప్యాకేజ్డ్ పాలల్లో ఇ-కోలి, కోలిఫాం వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లను ప్రభుత్వ ఫుడ్ ల్యాబొరేటరీ గుర్తించింది. నగరంలో నిత్యం 12కి పైగా ప్రముఖ డెయిరీలు దాదాపు 20 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నాయి. ఇందులో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఆరు డెయిరీ ఉత్పత్తుల శాంపిళ్లను ‘సాక్షి’ సేకరించి నాచారంలోని ప్రభుత్వ ఆహార పరిశోధనశాలలో పరీక్షలు చేయించింది. ఇందులో పరీక్షించిన ఉత్పత్తులన్నీ నిర్ణీత ప్రమాణంలో లేవని తేలింది. 

అమెరికా, యూరప్ దేశాల్లో విక్రయించే ప్యాకెట్ పాలల్లో ఇ-కోలి, కోలిఫాం వంటి బ్యాక్టీరియా ఉండటానికి వీల్లేకపోగా, మన దేశంలో మాత్రం అర లీటరు పాలల్లో 10 గ్రాముల వరకు ఉండొచ్చని నిర్ణయించారు (ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ఆడిటివ్ రెగ్యులేషన్ యాక్ట్-2011 ప్రమాణాల మేరకు). కానీ మార్కెట్‌లో 20 శాతానికి పైగా అమ్ముడవుతున్న ఓ డెయిరీ ప్యాకెట్ పాలల్లో 100 గ్రాములకుపైగా కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండగా, 13 శాతం మార్కెట్ వాటా కలిగిన మరో డెయిరీ పాలల్లో ఏకంగా 2000 గ్రాముల వరకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. నాలుగు శాతం వాటా కలిగిన మరో ప్రైవేటు డెయిరీ ప్యాకెట్ పాలల్లో 1060 గ్రాముల కోలిఫాంతో పాటు, ప్రమాదకరమైన ఇ-కోలి బ్యాక్టీరియాను సైతం గుర్తించారు. ‘సాక్షి’ పరీక్షలు చేయించిన ఆరు శాంపిళ్లలోనూ బ్యాక్టీరియాను నిర్ధారించి అవి యథావిధిగా తాగేందుకు శ్రేయస్కరం కాదని నిపుణులు తేల్చారు. పాల సేకరణ, నిల్వ, పంపిణీలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటమే బ్యాక్టీరియా వృద్ధికి కారణమని వారంటున్నారు.

పచ్చిపాలు ప్రమాదం..
గేదె పొదుగును మల, మూత్రాలు అంటిపెట్టుకుని ఉంటాయి. దీంతో పాటు పా లు పితికేటపుడు చేతుల ద్వారా, కలుషిత నీళ్లు కలపడం వల్ల పాలలోకి ఇ-కోలి బ్యాక్టీరియా చేరుతుంది. 161 డిగ్రీలపై 15 సెకన్ల పాటు పాలను వేడి చేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ నగరంలో తీరిక లేని వేళల వల్ల చాలామంది తమ పిల్లలకు పచ్చిపాలనే పట్టిస్తున్నారు. వీటిని తాగడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, కిడ్నీల పని తీరుపై ప్రభావం చూపుతుంది. వాం తులు, విరేచనాలు కలిగి బ్లడ్, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. టైపాయిడ్, తద్వారా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. 
- డాక్టర్ సుజాతస్టీఫెన్, 
న్యూట్రిషనిస్టు, అవేర్ గ్లోబల్ ఆస్పత్రి 

100 డిగ్రీల వరకు మరగబెట్టాల్సిందే..
ప్యాకెట్ పాలల్లో (పచ్చివి) విషపూరిత బ్యాక్టీరియా ఆనవాళ్లు పుష్కలంగా ఉండటంతో వాటిని 100 డిగ్రీల సెల్సియస్ వరకు కాచి వినియోగించాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన బ్యాక్టీరియా కూడా 90 నుంచి 100 డిగ్రీల వరకు వేడిచేస్తే తప్ప నాశనం కాదని, అందువల్లే బాగా మరగబెట్టిన తర్వాతే ప్యాకెట్ పాలను వినియోగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్యాకెట్ పాలను పైపైనే మరగబెట్టి తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
Share this article :

0 comments: