‘వై.ఎస్.జగన్ పేరు చెప్పకుంటే.. అరెస్టు చేసి.. నిన్ను జైల్లో పెడతాం..’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘వై.ఎస్.జగన్ పేరు చెప్పకుంటే.. అరెస్టు చేసి.. నిన్ను జైల్లో పెడతాం..’

‘వై.ఎస్.జగన్ పేరు చెప్పకుంటే.. అరెస్టు చేసి.. నిన్ను జైల్లో పెడతాం..’

Written By ysrcongress on Sunday, March 18, 2012 | 3/18/2012

రాజకీయ బాసుల చేతిలో కీలుబొమ్మలా ఆడుతున్న తీరు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఏదోలా కేసుల్లో ఇరికించడమే సీబీఐ లక్ష్యం
కేసులతో సంబంధం లేని వ్యక్తులను విచారణ పేరిట పిలుపు
జగన్ పేరు చెప్పాలంటూ ఒత్తిడులు.. లేదంటే అరె స్టు చేస్తామంటూ బెదిరింపులు
వేధింపులు భరించలేక హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారవేత్త ఐఏఎస్‌లపైనా ఒత్తిడులు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘ఆ డబ్బంతా జగన్‌కు ఇచ్చానని చెప్పు.. జగన్ పేరు చెప్పకపోతే.. నీ భార్యనూ అరెస్టు చేస్తాం’..
‘ఆ కంపెనీ యజమాని జగన్‌మోహన్‌రెడ్డే అని చెప్పు.. లేదంటే నీకు ఇబ్బందులు తప్పవు..’
‘వై.ఎస్.జగన్ పేరు చెప్పకుంటే.. అరెస్టు చేసి.. నిన్ను జైల్లో పెడతాం..’

- కేసుల పరిశోధనలో సీబీఐ విచారణ తీరిదీ..

ఎందుకిలా? ఎందుకంటే దానికి నిజానిజాలతో పనిలేదు. అబద్ధాలను నిజమని నమ్మించడమే దాని పని. తాను టార్గెట్ చేసుకున్న వ్యక్తులను ఈ కేసుల్లో ఇరికించడమే దాని అసలు లక్ష్యం. ఇందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తోంది.. బెదిరింపులకూ దిగుతోంది.. తన రాజకీయ బాసుల చేతిలో కీలుబొమ్మలా వారు ఆడిస్తున్నట్లు ఆడుతూ.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించడమే లక్ష్యంగా సీబీఐ అవాంఛనీయ చర్యలకు దిగింది. కేసులతోనూ రాజకీయాలతోనూ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను, వ్యాపారవేత్తలను విచారణల పేరుతో పిలిచి బెదిరింపులకు పాల్పడుతోంది. వై.ఎస్.జగన్ పేరు చెప్పకపోతే అరెస్టు చేసి జైల్లో పెడతామని బెదిరించడంతో.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఎస్.మనోహర్‌రెడ్డి గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించడమే సీబీఐ దర్యాప్తు తీరునకు ప్రత్యక్ష నిదర్శనం. 

ఐఏఎస్‌లతోనూ అదే తీరు: గడచిన కొంత కాలంగా రాష్ట్రంలో సీబీఐ ప్రతి విచారణ వెనుకా ఇదే తంతు సాగుతోంది. వేధింపులను భరించలేక కొందరు హైకోర్టును ఆశ్రయిస్తుంటే.. మరికొందరు మౌనంగా కుమిలిపోతున్నారు. చివరికి విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారులతోనూ జగన్ పేరు చెప్పించాలని సీబీఐ విశ్వప్రయత్నం చేస్తోంది. జగన్ ఫోన్ చేస్తేనే ఫలానా ఫైల్ క్లియర్ చేశామని చెప్పాలని సీబీఐ తమపై ఒత్తిడి తెస్తోందని సీబీఐ ముందు విచారణకు హాజరైన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. సచి వాలయ నిబంధనలు, బిజినెస్ రూల్స్ వంటివేమీ పట్టించుకోకుండా.. అంతా జగన్‌పై నెట్టేయాలని సీబీఐ అధికారులు చూస్తున్నారని వారు పేర్కొంటున్నారు. జగన్ ఫలానా పని చేస్తామని చెబితేనే.. తాము పెట్టుబడులు పెట్టామని చెప్పాలంటూ పారిశ్రామికవేత్తలను సీబీఐ వేధించిందనేందుకూ ఆధారాలున్నాయి. సీబీఐ వేధింపులపై హైకోర్టును ఆశ్రయిం చిన పలువురు వ్యాపారవేత్తలు.. కేంద్ర దర్యాప్తు సంస్థ తమతో వ్యవహరించిన తీరును పూసగుచ్చినట్లు హైకోర్టుకు నివేదించారు. 

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో క్విడ్‌ప్రోకో ఉందా లేదా అన్న విషయం తెలుసుకునే దిశగా ఇప్పటికీ సీబీఐ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదన్న విష యం.. దాని దర్యాప్తు తీరును చూసినవారికెవరికైనా ఇట్టే అర్థమవుతోంది. కాంగ్రెస్-టీడీపీలు కలిసి హైకోర్టులో కేసు వేయ డం దగ్గరి నుంచీ.. సీబీఐ విచారణ సాగుతున్న తీరు వరకూ జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది ఒక్కటే. ఎలాగైనా సరే వై.ఎస్.జగన్‌ను కేసుల్లో ఇరికించాలి! ఇదే ఆ పార్టీలు, సీబీఐ లక్ష్యం. జగన్‌ను రాజకీయంగా ఎలాగూ ఎదుర్కోలేమని తెలుసుకుని.. ఆ రెండు పార్టీలు సాగిస్తున్న అనైతిక చర్యలకు సీబీఐ అడుగడుగునా సహకరిస్తోంది. ఎమ్మార్ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన తుమ్మల రంగారావును అప్రూవర్‌గా మార్చడమే ఇందుకు ఓ ఉదాహరణ.

‘తుమ్మల’ అప్రూవర్‌గా మారడం వెనుక టీడీపీ: ఎమ్మార్ కేసులో స్టైలిష్ హోమ్ డెరైక్టర్ తుమ్మల రంగారావు కీలక నిందితుడు. మరో నిందితుడు కోనేరు ప్రసాద్‌తో కలిసి కుట్రపన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. మామూలుగా అయితే ఆయనిప్పుడు కోనేరుతో పాటు జైలులో ఉండాలి. కానీ, తుమ్మల రంగారావును అప్రూవర్‌గా మార్చుకునేందుకు సీబీఐ పెద్ద ప్లానే వేసింది. ఆయనను అప్రూవర్‌గా మార్చేందుకు టీడీపీ పూర్తి సహకారం అందించింది. ‘ఓ రాజకీయ పార్టీ, ప్రత్యేకించి తుమ్మల రంగారావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ నేత ఒకరు ఆయనను అప్రూవర్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషించారు. తుమ్మల అప్రూవర్‌గా మారి కొన్ని విషయాలు చెప్పదలచుకున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు మధ్యవర్తిత్వం నెరిపారు’ అని దర్యాప్తులో పాలు పంచుకుంటున్న ఓ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే జగన్‌కు దూరపు బంధువైన సునీల్‌రెడ్డి పేరు చెప్పించడానికి తుమ్మలను సీబీఐ ఉపయోగించుకుంది. ఇందుకు ప్రతిఫలంగా తుమ్మలకు ముందస్తు బెయిల్ వచ్చేందుకు సహకరించింది. ఎమ్మార్‌తోనూ.. ఆ సంస్థ లావాదేవీలతోనూ ఎలాంటి సంబంధం లేని సునీల్‌రెడ్డిని సీబీఐ ఇరికించడంపై న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

పాలనలో జగన్ జోక్యం చేసుకోకున్నా..

‘నాకు తెలిసి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో జగన్ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఆయన ఎప్పుడూ సచివాలయం దరిదాపుల్లోకి రాలేదు. కీలకమైన శాఖలో సుదీర్ఘకాలం పని చేసినా నాకు ఏనాడు ఫోన్ కూడా చేయలేదు. కానీ, కొన్ని జీవోల జారీకి సంబంధించి నన్ను విచారించడానికి పిలిచినప్పుడు వారు పదేపదే నన్ను అడిగింది ఒక్కటే.. జగన్ ఫోన్ చేశాడా అని.. లేదని నేను ఎన్ని సార్లు చెప్పినా.. మరి ఈ జీవో ఎలా వచ్చిందంటూ గుచ్చి గుచ్చి అడిగారు. నిబంధనల మేరకు వ్యవహరించానని చెబితే.. జగన్ సిఫారసు చేశాడని ఫలానా కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారా అంటూ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. వారు విచారించిన తీరు చూస్తే.. మామూలు కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నట్లు అనిపించింది. సీబీఐ అంటే ఇదా అని ఆశ్చర్యపోయా’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వివరించారు. ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడానికి ఎంత తతంగం ఉంటుందన్న విషయం తాను చెప్పడానికి ప్రయత్నిస్తే వారు వినిపించుకోలేదని, దానిని బట్టి చూస్తే వారి విచారణ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన హోదాలో పని చేసిన ఓ అధికారిని విచారించిన సందర్భంలోనూ సీబీఐ వ్యవహరించిన తీరు ఇలాగే ఉంది. ‘నేను ఉన్నత హోదాలో పని చేశాను. నన్ను ఏదైనా ప్రశ్న అడగాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటిది జగన్ తెలుసా? ఆయనెప్పుడైనా ఫోన్ చేశారా అంటూ ఆరా తీశారు. అది నా మనసును బాధించింది. అదే విషయం వారికి స్పష్టంగా చెప్పా...మళ్లీ అడగలేదు’ అని ఆయన వివరించారు.

జగన్ పేరు చెప్పకపోతే.. భార్యను అరెస్టు చేస్తాం

సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ ఆయన నోటితో జగన్ పేరు చెప్పించడానికి సామ, దాన, దండోపాయాలను ప్రయోగించింది. విల్లాల అమ్మకంలో వచ్చిన డబ్బును జగన్‌కు ఇచ్చానని చెప్పాలంటూ బెదిరించింది. లేదంటే ఇబ్బందులపాలవుతావని హెచ్చరించింది. విచారణ పేరుతో మానసిక వేధింపులకు గురి చేసింది. చివరకు ఆయన భార్యనూ అరెస్ట్ చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తుమ్మల రంగారావును తానెప్పుడూ కలవలేదని సునీల్‌రెడ్డి పదేపదే చెప్పినా.. కోనేరుతో కలిసి ఆయన కుట్ర చేశారంటూ సీబీఐ అసత్య ఆరోపణలకు దిగింది. ఏ చిన్న ఆధారం లేకుండానే ఆయన్ను జైలులో పెట్టింది. ఇంతటితో ఆగలేదు. ఎప్పుడో 2009లో సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తన వాటాలను సునీల్.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మనోహర్‌రెడ్డికి విక్రయించినట్లు తాజాగా హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఓ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. దీన్ని సాకుగా చేసుకుని.. రెండు దశాబ్దాలకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మనోహర్‌రెడ్డిని టార్గెట్ చేసింది. సునీల్‌రెడ్డి నుంచి వాటాలు కొనుగోలు చేయడం పెద్ద నేరమన్నట్లు ఆయన్ను విచారణల పేరిట తరచూ పిలిచి వేధిస్తోంది. ‘సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని వైఎస్ జగన్ అని చెప్పాలంటూ బెదిరిస్తోంది. జగన్‌కు ఏ సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. పైగా అలా చెప్పకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసింది’ అని మనోహర్‌రెడ్డి తన ఆందోళనను రాష్ట్ర హైకోర్టు ముందుంచారు. మనోహర్‌రెడ్డి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది.
Share this article :

0 comments: