గవర్నమెంటు బడులు పక్కనే ఉన్నా.. వీరెందుకు దూరంగా చదివిస్తున్నారో సర్కారు ఆలోచించట్లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నమెంటు బడులు పక్కనే ఉన్నా.. వీరెందుకు దూరంగా చదివిస్తున్నారో సర్కారు ఆలోచించట్లేదు

గవర్నమెంటు బడులు పక్కనే ఉన్నా.. వీరెందుకు దూరంగా చదివిస్తున్నారో సర్కారు ఆలోచించట్లేదు

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

 స్కూలు బస్సుల్ని ఆర్టీసీ నడపాలి

*నిర్వహణ ఫీజును యాజమాన్యాలు ఆర్టీసీకి కట్టేలా ఆదేశించాలి
* అప్పుడే ఈ ప్రమాదాలను నివారించగలం.. పిల్లలకు భద్రత ఉంటుంది
* ఖమ్మం జిల్లా పెద్దవాగు బస్సు దుర్ఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు పరామర్శ.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులను ఓదార్చిన జగన్
* అన్ని రోగాలకూ ఆకుపసరే అన్నట్లు సర్కారు రూ.50 వేలిచ్చి చేతులు 
దులుపుకొంటోంది.. గవర్నమెంటు బడులు పక్కనే ఉన్నా.. వీరెందుకు దూరంగా చదివిస్తున్నారో సర్కారు ఆలోచించట్లేదు
* ఇంగ్లిష్ మీడియం చదివించాలన్న కోరికతో ప్రైవేటు బడుల్లో చదివిస్తున్నారు.. ఈ దృష్ట్యా సర్కారీ బడుల్లో ఇంగ్లిష్ మీడియం కూడా పెట్టాలి 

చండ్రుగొండ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: నెల కూడా తిరక్కముందే రెండు వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఒకే రకమైన ప్రమాదాల్లో ఇంత మంది చిన్నారులు చనిపోవడం తన గుండెను కలచివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పక్కనే ఉన్నప్పటికీ.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలన్న కోరికతో తల్లిదండ్రులు పిల్లలను బస్సుల్లో ఎక్కడెక్కడికో పంపిస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంను కూడా పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలకు చెందిన బస్సులను ఆర్టీసీ నిర్వహణలోకి తేవాలని, తద్వారా కండిషన్‌లో ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. 

ఈ నెల 20న ఖమ్మం జిల్లా పెద్దవాగులో పడి చనిపోయిన ఎనిమిది మంది విద్యార్థుల కుటుంబాలను గురువారం జగన్ పరామర్శించారు. ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన జగన్ రోడ్డు మార్గం ద్వారా చండ్రుగొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బాధిత విద్యార్థుల గ్రామాలకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు. శ్రీరాంపురంలో ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..


మొన్న తూర్పుగోదావరిలో..

సరిగ్గా ఒక నెల కూడా కాలేదనుకుంటా.. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఇటువంటి పరిస్థితుల మధ్యే నలుగురు పిల్లలు చనిపోతే అక్కడికి పోయి పరామర్శించి వచ్చాను. అది జరిగి నెల కూడా తిరక్కముందే ఇక్కడ మరో బస్సు నీటిలో పడి ఎని మిది మంది చిన్నారులు చనిపోయారు. నేను అడిగా.. గవర్నమెంటు స్కూళ్లు పక్కనే ఉన్నాయి కదమ్మా! ఎందుకమ్మా.. వాళ్లను గవర్నమెంటు స్కూళ్లకు పంపలేదూ అని ఆ తల్లిదండ్రులను అడిగా. ‘అన్నా..! గవర్నమెంటు స్కూళ్లలో తెలుగు మీడియమే ఉంది. ఈ స్కూళ్లలో పిల్లలు చదివితే ఇంగ్లిష్ రాదు. మా పిల్లలను మాలాగా కాకుండా గొప్పగా చదివించాలని అనుకుంటున్నాం’ అని చెప్పారు. అయితే ప్రైవేటు స్కూల్లో చేర్చిన తరువాత ఆ పిల్లలు బస్సుల్లో ప్రయాణం చేయడం, బస్సుల కండిషన్ దయనీయంగా ఉండటం, బ్రిడ్జ్‌లైతే రైలింగులు లేకపోవడం.. ఇదీ పరిస్థితి.

ఎవరు బాధ్యులు?

ఈ ప్రమాదానికి రోడ్లను, బ్రిడ్జిలను తప్పుపట్టాలా? బస్సులు నడిపిస్తున్న స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలను తప్పు పట్టాలా? లేదా వరుసగా ఒక నెల తిరక్కముందే రెండు వేర్వేరు జిల్లాల్లో ఒక చోట నలుగురు, మరో చోట ఎనిమిది మంది ఇలా ఇంత మందిని బలి తీసుకుంటున్నా కూడా కనీసం ముందుకు వచ్చి ఒక గట్టి ప్రకటన కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా? సర్కారువారు ఏం సహాయం చేశారమ్మా? అని ఆ అక్కాచెల్లెళ్లను నేను అడిగా. వాళ్లు చెప్పారూ.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చారు.. కుటుంబానికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పారు. పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పెద్దలకు మానవత్వం ఉందా? లేదా? అనే ప్రశ్న కూడా వస్తోంది.

చేతులు దులుపుకొంటున్నారా?

నేను అడుగుతున్నాను.. వాళ్ల పరిస్థితులు బాగా లేకనో.. లేదా మరో కారణంతో వాళ్లేమైనా చనిపోయారా? చనిపోయినందుకు మీరు రూ. 50 వేలు ఇస్తున్నారా? ఇక్కడ వీళ్లు అడిగేది డబ్బు కాదు. అయినా ఆదుకోవడానికి ముందుకొచ్చి డబ్బిచ్చినందుకు సంతోషం. పండించిన పంటకు గిట్టుబాటులేక అప్పులపాలై రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్లారు. వాళ్లకు డబ్బుసాయం చేస్తే అంతో ఇంతో మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ అన్ని రోగాలకూ ఆకుపసరే అన్నట్లుగా చావుకు ఖరీదు కట్టి ఎంతో కొంత డబ్బులిచ్చి చేతులు దులుపుకొందామని చూస్తున్నారా?

వెంటనే బ్రిడ్జి రిపేరు చేయించాలి

ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది వెంటనే రాఘవాపురం బ్రిడ్జిని రిపేరు చేయించాలి. అటువంటి బ్రిడ్జిలు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఆ ప్రతి బ్రిడ్జిని రిపేరు చేయాలి. ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు నడుపుతున్న బస్సులకు నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేయించాలి. బస్సులు కండీషన్‌తో లేకుంటే వాటిని రోడ్లమీద తిప్పే పరిస్థితి రానే రాకూడదు. అసలు ఈ బస్సులన్నింటిని కూడా ఆర్టీసీ హ్యాండోవర్‌లోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఈ బస్సులను నడపాలి. బస్సు ఫీజులను ఆర్టీసీకి కట్టమని చెప్పి నేరుగా ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాల, కళాశాలల యాజమాన్యానికి చెప్పవచ్చు. అప్పుడైతే బస్సులు చక్కగా నడుస్తాయి. కాలేజీ యాజమాన్యాలకు భద్రత ఉంటుంది. ఆ బస్సుల్లో ఎక్కే విద్యార్థులకు భద్రత కల్పించవచ్చు.

ఇంగ్లిష్ మీడియమూ పెట్టాలి..

ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ఇంకో గొప్పపని ఆలస్యమవుతూ వస్తోంది. ఆ గొప్పపని ఏమిటంటే ప్రతి గవర్నమెంటు స్కూలులో తెలుగుమీడియంతోపాటుగా ఇంగ్లిష్ మీడియం కూడా పెట్టాలి. అలా చేస్తేనే పిల్లలు ఎక్కడెక్కడికో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంగ్లిష్ మీడియం పెట్టినప్పటికీ పిల్లలు దూరంగా వెళ్లి చదువుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో ప్రయాణం చేయగలిగేటట్లు చేస్తే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతవరకు ఎటువంటి పరిష్కారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరవాలి. పాలకులు కాస్త ముందుకొచ్చి ఈ పరిస్థితులకు ఒక శాశ్వత పరిష్కారం వెతక్కపోతే వాళ్లను దేవుడుకూడా కాపాడలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారనే సంగతి ఇవాళ నేను గట్టిగా చెప్తున్నా.
Share this article :

0 comments: