పత్తి నిషేధం తొలగింపుపై సర్కారు దగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పత్తి నిషేధం తొలగింపుపై సర్కారు దగా

పత్తి నిషేధం తొలగింపుపై సర్కారు దగా

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్
కొత్త ఎగుమతులకు అవకాశం లేదని అందులో మెలిక
ఇప్పటికే తమ వద్ద రిజిస్టర్ అయ్యి ఎగుమతికాని పత్తి బేళ్లకే ‘ఎత్తివేత’ వర్తిస్తుందని వెల్లడి
దీనికితోడు ఆ బేళ్లపై శోధన చేస్తామని కొత్త ప్రకటన
ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త ఎగుమతులకు నో చాన్స్

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: పత్తి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా కోట్లాది రైతుల్లో ఆశలు చిగురింపజేసినకేంద్ర ప్రభుత్వం.. రోజు తిరక్కుండానే వాటిని తుంచేసింది. ‘ఎత్తివేత’లో మెలికలు పెట్టి నిషేధాన్ని పరోక్షంగా కొనసాగిస్తూ.. రైతుల్ని ‘అధికారికంగా’ మోసం చేసింది. నిషేధం ఎత్తివేస్తున్నట్లు విదేశీ వాణిజ్య డెరైక్టరేట్ జనరల్(డీజీఎఫ్‌టీ) సోమవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో సర్కారు వంచన తేటతెల్లమైంది. ఈ నెల 5న ప్రభుత్వం నిషేధం విధించడానికి ముందు తమ వద్ద రిజిస్టర్ అయ్యి ఎగుమతికాకుండా పెండింగ్‌లో ఉన్నపత్తి బేళ్లకు మాత్రమే ‘ఎత్తివేత’ వర్తిస్తుందని, కొత్తగా ఎలాంటి పత్తి బేళ్లకూ ఎగుమతి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వబోమని ఆ ఉత్తర్వుల్లో సర్కారు తేల్చి చెప్పింది. అంటే కొత్త ఎగుమతులకు ఎలాంటి అవకాశమూ లేదని చెప్పకనే చెప్పింది. ప్రభుత్వం ఇలా పిల్లిమొగ్గలు వేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఇలా మాటిచ్చి మోసం చేస్తుందా? అంటూ పత్తి రైతులు మండిపడుతున్నారు.

పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి: వర్తక సంఘాలు

పత్తి ఎగుమతిపై నిషేధాన్ని విధిస్తూ ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో.. అప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న పత్తి బేళ్ల కంటైనర్లు, షిప్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అప్పటికే ఎగుమతి లెసైన్స్‌లు తీసుకున్న వారు కూడా.. వాటిని నిర్ణీత కాల పరిమితిలో తరలించలేక తమ వద్దనున్న నిల్వల్ని గోడౌన్‌లకు తరలించుకున్నారు. వ్యవసాయ మంత్రి శరద్‌పవార్, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులు నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ నెల 9న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై దీనిపై సమీక్షించింది. ఈ నేపథ్యంలోనే నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆదివారం ప్రకటన చేసింది. నిషేధాన్ని ఎత్తేస్తున్నామంటూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరుకైతే ఎత్తివేతగాని, అందులో నిషేధం యథాప్రకారం కొనసాగుతుందని తేలడంతో కేంద్రంపై వర్తక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పిల్లిమొగ్గల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని విమర్శిస్తున్నాయి. ఈ షరతులకు, నిషేధానికి తేడా లేదని సౌరాష్ట్ర జిన్నర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అరవింద్ పటేల్ విమర్శించారు. పత్తి ఎగుమతిపై స్థిరమైన విధానాన్ని కేంద్రం అమలు చేయాలని, ఎగుమతులపై నియంత్రణ లేదా నిషేధం విధించరాదని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ధీరేన్ ఎన్. శేఠ్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలో లక్షలాది పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం వంచించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.

నిషేధం తొలగించేది ఎప్పుడో!

కొత్త రిజిస్ట్రేషన్లను మళ్లీ ఎప్పుడు అనుమతిస్తామన్నది కూడా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటికే రిజిస్టర్ అయిన పత్తి బేళ్లలో చాలావరకు చైనాకు వెళ్లేవేనని, ఈ వ్యవహారాన్ని శోధించాల్సి ఉందని, ఆ తర్వాతే వాటిని ఎగుమతికి అనుమతిస్తామని, ఇది ఎప్పటికి పూర్తి చేయాలన్న దానిపై కాలపరిమితి పెట్టుకోలేదని తాజా నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయితేగాని కొత్త రిజిస్ట్రేషన్లను అనుమతించబోమని వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ స్పష్టంచేశారు. ‘నిషేధానికి ముందే 1.3 కోట్ల బేళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వాటిలో 35 లక్షల బేళ్ల కన్‌సైన్‌మెంట్లు ఇప్పటికే కస్టమ్స్ విభాగం పరిధిలోకి చేరాయి. అందువల్ల ముందుగా వాటిని పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త రిజిస్ట్రేషన్లను అనుమతించబోం’ అని ఆయన చెప్పారు. కాల పరిమితి పెట్టకపోవడంతో నిషేధం చాలా కాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Share this article :

0 comments: