‘ఉపాధి’ ఉద్యోగుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఉపాధి’ ఉద్యోగుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు

‘ఉపాధి’ ఉద్యోగుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు

Written By ysrcongress on Thursday, March 29, 2012 | 3/29/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ ఉద్యోగుల సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 30 వేల మంది ఉద్యోగుల సమ్మె కారణంగా.. ఉపాధి హామీ వల్ల లబ్ధిపొందుతున్న 30 లక్షల మందికి పనిలేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి పథకానికి తూట్లు పొడిచి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దుచేసి, తద్వారా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేతను తొలగించాలనే దుర్బుద్ధితో కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ, 104, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల మాదిరిగానే ఉపాధిని కూడా నిర్విర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. యువ కిరణాల ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటున్న సీఎం, పనిచేస్తున్న 30 వేల మంది ఉపాధి ఉద్యోగులను తొలగించాలనుకోవటం చూస్తే ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. ఉపాధి హామీ పథకానికి ఊపిరిపోసింది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. గ్రామాల్లో సభల ద్వారా పనిని గుర్తించి పేద కూలీలకు ఉఫాధి కల్పించారని ఆయన పేర్కొన్నారు. 

ఒకానొక దశలో సుప్రీంకోర్టు కూడా ఉపాధి పథకంపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినట్లు గుర్తుచేశారు. వైఎస్ హయాంలో ఉపాధి అమలులో దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించిన రాష్ట్రం.. ప్రస్తుతం ముఖ్య నేతల వ్యవహారశైలితో పూర్తిగా వెనకబడిందన్నారు. పథకానికి కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా ఖర్చుపెట్టలేని దయనీయ స్థితిలో ఉందని, ఫలితంగా కేంద్రం విడుదల చేసే ఉపాధి నిధులకు దాదాపు రూ.2 వేల కోట్ల మేర కోత విధించిందన్నారు.

కాంగ్రెస్ వారికి దోచిపెడుతున్నారు..
ముఖ్యమంత్రి కిరణ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను కాంగ్రెస్ నేతలకు దోచిపెడుతున్నారని గట్టు దుయ్యబట్టారు. రానున్న 18 ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు వంద కోట్లు పంచిపెడుతున్నారని మండిపడ్డారు.
Share this article :

0 comments: