విలువలకు నీరాజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విలువలకు నీరాజనం

విలువలకు నీరాజనం

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు, గెలుపోటములు సర్వసాధారణం. కానీ, ఈ నెల 18న ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలపై బుధవారం వెలువడిన ఫలితాల తీరే వేరు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అటు అధికారపక్షంపైనా, ఇటు ప్రధాన ప్రతిపక్షంపైనా తమకు విశ్వాసం లేదని ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు ముక్త కంఠంతో చెప్పారు. ఈ రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల నుంచి శాసిస్తూ వస్తున్న బలమైన రెండు ప్రధాన పక్షాలనూ పక్కకు ఈడ్చేశారు. విలువలకే తాము పట్టంకడతామని స్పష్టంచేశారు. ప్రజల్లో బలంగా వేళ్లూనుకున్న మనోభావాలను దెబ్బతీయడానికి, వారి మనసుల్లో గూడుకట్టుకున్న అభిమాన నేత జ్ఞాపకాలను చెరిపేయడానికీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్నో కుట్రలకు పూనుకున్నాయి. డబ్బులు వెదజల్లడంలోనూ, మద్యం పారించడంలోనూ పోటీపడ్డాయి. 

రాజకీయ జీవన్మరణ సమస్యగా భావించి సర్వశక్తులూ ఒడ్డాయి. కనీస విలువలను, విధానాలను విస్మరించి చవకబారు ఆరోపణలకు తెగించాయి. ఏం చేసినా, ఏం చెప్పినా ఈ రెండు పక్షాలకూ ప్రజలు గట్టిగా జవాబిచ్చారు. మమ్మల్ని పాలించే అర్హత మీకిద్దరికీ లేదని ముఖంమీద గుద్ది చెప్పారు. నమ్మిన విలువల కోసం, సిద్ధాంతాల కోసం పోరాడేవారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ప్రజలు నిరూపించారు. రెండున్నరేళ్ల క్రితం కోవూరులో ఏడువేలకు పైగా మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఈసారి అంతకు మూడురెట్ల కంటే ఎక్కువ ఆధిక్యతను కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ఇటు నాగర్‌కర్నూలులో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా, మహాకూటమి తరఫున పోటీ పడినప్పుడు 6,593 ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఇప్పుడు ఇండిపెండెంట్‌గా వచ్చిన ఆయనకు 27,000కు పైగా ఆధిక్యతను అందించారు. మహబూబ్‌నగర్ స్థానంలో గత ఎన్నికల్లో కేవలం 1977 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన బీజేపీకి ఈసారి 1879 ఓట్ల మెజారిటీతో ప్రజలు పట్టంగట్టారు.

టీడీపీ అధినేత ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అలవిమాలిన అహంకారంతో కనీస విలువలను మరిచి మాట్లాడిన మాటలు అందరినీ దిగ్భ్రమపరిచాయి. ఒకపక్క చేవెళ్ల-ప్రాణహిత నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకూ వైఎస్ చెప్పిన, చేసిన పథకాల గురించే మాట్లాడుతూ, తాను వస్తే అవన్నీ చేస్తానని చెబుతూ ఆ దివంగత నేతపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం అందరూ గమనించారు. ఏ అంశంపైనైనా తనకంటూ ఎజెండాగానీ, విధానంగానీ లేవని బాబు పదే పదే నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎప్పటిలాగే తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో పలచన చేయడానికి చూశారు. కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఆ పార్టీ నాయకుల ఇంట్లోనూ, వాహనాల్లోనూ పట్టుబడిన నోట్ల కట్టలే బాబు కపటత్వాన్ని బదాబదలుచేశాయి. ఎనిమిదేళ్లనుంచి ప్రతిపక్ష హోదాకే పరిమితమై బతుకీడుస్తున్న తెలుగుదేశానికి భవిష్యత్తులో అది సైతం దక్కబోదన్న చేదు వాస్తవాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉందని, అటు టీఆర్‌ఎస్‌పైనా అందరికీ నమ్మకం పోయిందని విశ్లేషించుకుని గెలుపు నల్లేరుమీద బండి నడక అనుకుని తెలంగాణలో చెలరేగిపోయిన బాబు పార్టీకి మూడుచోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా చేసి ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ కూడా వైఎస్ నామం జపిస్తూనే ఆయననూ, ఆయన కుటుంబాన్నీ ప్రజల్లో అభాసుపాలుచేయడానికి ఎన్నో కుట్రలకు దిగింది. తన జేబు సంస్థ సీబీఐ ద్వారా మాయోపాయాలు పన్నడమే కాదు, ప్రధాన ప్రతిపక్షంతో పూర్తిగా కుమ్మక్కై వైఎస్ ప్రభుత్వ హయాంలోని భూ కేటాయింపులపై విచారణకు సభాసంఘం నియమించి ఆయనపై అపోహలు రేకెత్తేవిధంగా ప్రవర్తించింది. అవిశ్వాస తీర్మానం విషయంలో రెండు పార్టీలూ కుమ్మక్కైన తీరు జగద్విదితమే. ఎన్నడూ చూడని, ఎప్పుడూ వినని అధికార, విపక్షాల కుమ్మక్కు రాజకీయాలను చూసి రాష్ట్ర ప్రజలు విస్తుబోయారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు.

ఒక్కసారి ఈ రాష్ట్రంలో వైఎస్ కనుమరుగైన తర్వాత జరిగిన ఉప ఎన్నికలను సింహావలోకనం చేసుకుంటే అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు ఎదురవుతున్న పరాభవ పరంపర కళ్లకు కడుతుంది. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగాయని పరిగణిస్తే మొత్తం 29 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలొచ్చినట్టు లెక్క. అందులో కాంగ్రెస్ 16 నియోజకవర్గాల్లోనూ, తెలుగుదేశం 21 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు కోల్పోయాయి. తెలుగుదేశం అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ వరస ఓటములను చవిచూస్తోంది. అధికారపక్షం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ప్రధాన ప్రతిపక్షమూ... ప్రధాన ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు అధికారపక్షమూ సొమ్ము చేసుకోవాలని చూస్తాయి. ప్రయోజనాన్ని పొంది బలపడాలని ఆశిస్తాయి. కానీ, ఈ రెండు పక్షాలూ దయనీయమైన స్థితిలో పడిపోయాయి. రెండు, మూడు స్థానాలకోసం పోటీపడే స్థాయికి దిగజారాయి. ఇక కాంగ్రెస్‌కు ఇక్కడే కాదు... దేశవ్యాప్తంగా కూడా ఆదరణ నానాటికీ క్షీణిస్తోంది. 

2009 తర్వాత అక్కడక్కడా జరిగిన ఉప ఎన్నికల్లోనే మాత్రమే కాదు..ఈమధ్యే జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీకి నిరాశే కలిగించాయి. 10 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సొంతంగా దక్కింది చిన్న రాష్ట్రమైన మణిపూర్ అయితే, ఒక్క స్థానం ఆధిక్యత మాత్రమే సంపాదించి మరో చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ చేజిక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ పరాభవం ఆ పార్టీకి పెద్ద షాక్. విలువలను విడిచిపెట్టి, విశ్వసనీయతను కోల్పోయి..వంచనతో విజయం సాధిద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో అలాంటి వేషాలు చెల్లుబాటు కావని జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు, రాష్ట్రంలో ఆ పార్టీతోపాటు తెలుగుదేశానికి ప్రజలు గట్టిగా తెలియజెప్పారు. ఆ పార్టీల అధినేతలు వినే స్థితిలో ఉన్నారా?!
Share this article :

0 comments: