ప్రభుత్వం, యురేనియం ప్రాజెక్టు యాజమాన్యంపై వైఎస్ జగన్‌ నిప్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం, యురేనియం ప్రాజెక్టు యాజమాన్యంపై వైఎస్ జగన్‌ నిప్పులు

ప్రభుత్వం, యురేనియం ప్రాజెక్టు యాజమాన్యంపై వైఎస్ జగన్‌ నిప్పులు

Written By ysrcongress on Sunday, March 18, 2012 | 3/18/2012


కడప, న్యూస్‌లైన్: ‘ఆర్నెళ్ల కిందట ఇదే కమిటీ సమావేశం అయింది.యాజమాన్యం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని గుర్తు చేశాం. మళ్లీ రాత పూర్వకంగా ఇచ్చాం. ఇంత వరకూ వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంగానీ, యాజమాన్యం గానీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. దీనికి నిరసనగా ధర్నాలు చేస్తామంటే...అరెస్టులు చేయిస్తారా?ప్రజా సమస్యలంటే తమాషాగా ఉందా..చూస్తుంటే ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నట్లుంది.’ 

అంటూ ప్రభుత్వం, యురేనియం ప్రాజెక్టు యాజమాన్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. యురేనియం ప్రాజెక్టు రెండో దశ పనులపై కమిటీతో చర్చించేందుకు పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు చదిపిరాళ్ల నారాయణరెడ్డి, సతీష్‌రెడ్డి, యూసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బెహల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలను ఎంత వరకు పరిష్కరించారు? వాటి పురోగతి ఏంటి? అని బెహల్‌ను జగన్ ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇచ్చిన హామీలను కూడా విస్మరించారని భూములు కోల్పోయిన ప్రజలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి యాజమాన్యంపై మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని నమ్మి పొలాలను కోల్పోయిన రైతుల విషయంలో స్పందించే తీరు ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనపుడు సమావేశానికి ఎందుకు పిలిచారని ప్రశ్నించారు? హామీలను నెరవేర్చేందుకు యాజమాన్యం ఎప్పుడు ముందుకు వస్తుందో అప్పుడే ప్లాంటు రెండో దశ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వస్తామని అంత వరకూ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా హాజరుకామని తేల్చిచెప్పారు. జగన్ ప్రశ్నలకు యాజమాన్యంగాని, ప్రభుత్వ యంత్రాంగం గాని సమాధానాలు చెప్పలేకపోయారు. కంపెనీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా సమావేశాన్ని జగన్ బాయ్‌కాట్ చేశారు. జగన్‌కు మద్దతుగా భూములు కోల్పోయిన రైతులు కూడా బయటకు వచ్చేశారు. తర్వాత జగన్ విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది:
‘ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని నమ్మి ప్రజలు భూములు అప్పగించారు. ఇప్పటిదాకా కొంతమందికి పరిహారం ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే డీకేటీ అంటూ కుంటిసాకులు చెబుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులు చనిపోతే పెన్షన్ ఇవ్వడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పరాయి రాష్ట్రాలు, జిల్లాల వారికి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. తాగునీరు కలుషితం కావడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. ఆ సమస్యకూ ఇప్పటిదాకా పరిష్కారం లేదు.

యురేనియం తవ్వకాల కారణంగా వ్యవసాయ బావుల్లో నీరు అడుగింటిపోయింది. వీటిలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రాలేదు. ప్రజా సమస్యలపై ఇలాగేనా స్పందించేదని యాజమాన్యాన్ని మందలించడంలో ప్రభుత్వం విఫలమైంది. 

పభుత్వం ఓ ప్రైవేటు కంపెనీగా ప్రవర్తిస్తోంది.’ అని జగన్ నిప్పులు చెరిగారు. గతంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, సర్పంచ్, కలెక్టర్‌తో కలిపి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 42మందితో కమిటీ ఏర్పాటు చేశారని, అందులో సభ్యులుగాా ఎవరెవరో ఉన్నారని అభ్యంతరం తెలిపారు. ఇలాంటి కమిటీలతో ఏం చర్చించాలి? అని ప్రశ్నించారు. కొత్త కమిటీని రద్దు చేసి పాత కమిటీనే పునరుద్ధరించాలన్నారు. 

మన ప్రభుత్వం వస్తుంది? ఓపిక పట్టండి:
యురేనియం ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలు జగన్ వద్దకు వచ్చి భోరున విలపించాయి. యాజమాన్యం నమ్మించి తమ భూములు తీసుకుని మోసం చేసిందని ఆరోపించారు. దీంతో ‘కొద్ది రోజులు ఆగండి. మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని జగన్ భరోసా ఇచ్చారు. కాగా సమావేశంలో ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు.

మోసం చేశారు
ఫ్యాక్టరీ కోసం మేం పదెకరాల భూములు కోల్పోయాం. మా ఆయన అక్కడే ఉద్యోగం చేసేవారు. మూడేళ్ల కిందట చనిపోయాడు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాకు న్యాయం చేయాలని అధికారులకు జగన్ సార్ గతంలోనే చెప్పారు. వారి వద్దకు వెళితే జగన్‌నే అడుగుపో! అంటున్నారు. - వరలక్ష్మి, తుమ్మలపల్లి

మేమూ యురేనియం
ప్రాజెక్టుకు వ్యతిరేకమే:
యురేనియం ప్రాజెక్టును టీడీపీ కూడా వ్యతిరేకిస్తోంది. ప్రజా సమస్యల కోసం ప్రజాప్రతినిధిగా నేను కూడా పోరాడతా? ప్రజల డిమాండ్లును కంపెనీ పరిష్కరించాలి.
- సతీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ

భూములు తీసుకుని డబ్బులు ఇవ్వలేదు
మా భూములు లాక్కున్నారు. పరిహారం ఇచ్చామన్నారు. ఇప్పుడేమో అవి డీకేటీ భూములని దొంగ మాటలు సెప్తాండారు. మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి. లేకుంటే పరిహారమైనా చెల్లించాలి. 
- అచ్చమ్మ, రాజుకుంటపల్లి

ప్రజల డిమాండ్లు ఇవే
యురేనియం ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన తుమ్మలపల్లి పరిసర ఐదు గ్రామాల ప్రజలకు 156 ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత 90 అడుగుల్లో ఉండే నీళ్లు 900-1000 అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. దీన్ని వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలి.
భూములు కోల్పోయిన కొంతమంది రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. వెంటనే వారికి పరిహారం చెల్లించాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
కొత్త కమిటీని రద్దు చేయాలి. పాత కమిటీని పునరుద్ధరించాలి.
Share this article :

0 comments: