ఉప ఎన్నికలకు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికలకు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్

ఉప ఎన్నికలకు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య గత రెండేళ్లుగా తెరవెనుక సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో మరో ఎపిసోడ్! రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న 7 స్థానాల ఉప ఎన్నికలు, త్వరలో రాబోయే 17 స్థానాల ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం ఒక అవగాహనకు వస్తున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్న ఈ పార్టీలు రెండూ ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సిద్ధాంతంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను తమ ప్రధాన ఉమ్మడి శత్రువుగా నిర్ణయించుకుని.. ఆ పార్టీని దెబ్బతీయటానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలతో పాటు రానున్న ఉప ఎన్నికల్లో దీన్ని అమలు చేయటానికి ఇప్పటికే ఉభయులూ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 

మాచర్లలో టీడీపీని గెలిపిస్తామన్న కాంగ్రెస్!
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించాలంటే.. పరస్పరం అవగాహనకు రావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇరు పార్టీల జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ మేరకు తమ తమ పార్టీల అధినేతలకు వివరించారు. ‘మాచర్ల నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి. అలా చేస్తే కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లకా్ష్మరెడ్డిల్లో ఒకరికి టికెట్టు ఇవ్వాలి. అలా చేయటం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీ తరఫున బరిలో ఉన్న వ్యక్తికి సహకరిస్తారు. అలా అవగాహనకు వస్తే తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించలేం...’ అంటూ జిల్లాకు చెందిన ఇరు పార్టీల నేతలు ప్రతిపాదించటం, దానికి నాయకులు అంగీకరించటం జరిగిపోయినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదన చేశారని తమ అధినేత చంద్రబాబు స్వయంగా మంగళవారం రాత్రి పార్టీ నాయకుల సమావేశంలో చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంపై కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లకా్ష్మరెడ్డిలు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావుతో అసెంబ్లీ లాబీల్లో ఇదివరకే చర్చించారు. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో ఈ అంశంపై బుధవారం చర్చించారు. మాచర్ల నుంచి చలమారెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న జిల్లా నేతల ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించారు’ అని ఆ వర్గాలు వివరించాయి. 


నర్సాపురంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తామన్న టీడీపీ
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజును ఓడించటానికి పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీడీపీ ఈ స్థానం నుంచి పురపాలక సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణను బరిలోకి దించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా కాంగ్రెస్‌తో అవగాహన మేరకు అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించటానికి టీడీపీ మరో బలహీనమైన అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో పడింది. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు నిర్ధారించారు. 


కోవూరులో టీడీపీకి కాంగ్రెస్ సహకారం! 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య ఈ రకంగా నియోజకవర్గాల వారీగా ‘సమన్వయం’ చేయటంలో ఒక వ్యాపారవేత్త కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18న జరగనున్న కోవూరు ఉపఎన్నిక విషయంలో మొదట ఎవరి దారి వారన్నట్లు వ్యవహరించినప్పటికీ గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఇక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గాలన్న చర్చలు మొదలైనట్లు చెప్తున్నారు. కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి అంతగా పోటీ ఇచ్చే పరిస్థితి లేనందున ఇక్కడ టీడీపీ అభ్యర్థికి లాభించేలా వ్యవహరించాలన్నది పరస్పర అంగీకారం. అందుకు ప్రతిఫలంగా త్వరలో రాబోయే నెల్లూరు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ బలహీనమైన అభ్యర్థిని నిలుపుతుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక మంత్రి ప్రతిపాదించగా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యాపారవేత్త టీడీపీ నేతకు వివరించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. 

కాంగ్రెస్ మునిగిపోయే పడవే
పార్టీ సీనియర్ల అంతర్మథనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ మునిగిపోయే పడవేనని, నడిసంద్రంలో ఉన్న ఈ తరుణంలో అందులోనుంచి దూకినా, దాన్లోనే ఉన్నా ఫలితం ఒక్కటేననే భావన పార్టీ సీనియర్ నేతల అంతర్మథనంలో వ్యక్తమైంది. బుధవారం కె.జానారెడ్డి చాంబర్లో మంత్రులు టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు భేటీఅయ్యారు. యూపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణ సాగింది. సమైక్యవాదానికి అనుగుణంగా సమాజ్‌వాది పార్టీకి యూపీ ప్రజలు ఓట్లు వేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఏపీని కూడా సమైక్యంగా ఉంచితేనే భవిష్యత్తులో పార్టీ నిలదొక్కుకుంటుందని జేసీ అభిప్రాయపడ్డారు. మరో నేత కల్పించుకుంటూ తెలంగాణపై ఇచ్చిన హామీకి కట్టుబడకుంటే ప్రజల ముందుకు పార్టీ వెళ్లలేదన్నారు. పార్టీ పరిస్థితి మునిగిపోయే పడవలా ఉందని, ఈ సమయంలో ప్రాంతాలవారీగా మనం ఒకరిపై ఒకరం పోరాడుతూ కూర్చుంటే పడవ ముందే మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: