రామోజీకి హైకోర్టులో మరోసారి చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీకి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

రామోజీకి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Written By ysrcongress on Friday, March 30, 2012 | 3/30/2012

* వ్యక్తిగత హాజరునుంచి మినహాయించాలన్న వినతికి నో
* ఓ కేసులో కింది కోర్టుముందు హాజరు కావాల్సిందేనని స్పష్టీకరణ
* పిటిషన్‌ను కొట్టివేసేందుకు సిద్ధమైన న్యాయమూర్తి.. దీంతో ఉపసంహరించుకున్న రామోజీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఓ పరువు నష్టం కేసులో స్వయంగా హాజరు కావాలన్న కిందికోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలన్న రామోజీ విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన స్వయంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసేందుకు సిద్ధమవడంతో.. విధిలేని పరిస్థితుల్లో రామోజీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

ఈనాడు దినపత్రిక తనపై తప్పుడు కథనం ప్రచురించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ టీఆర్‌ఎస్ నేత బత్తుల సోమయ్య ఖమ్మం జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిని విచారించిన కిందికోర్టు... స్వయంగా హాజరు కావాలంటూ రామోజీరావు తదితరులను ఆదేశించింది. ఈ ఆదేశాలను రామోజీరావు హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను గురువారం విచారించారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి రామోజీరావుకు మినహాయింపునివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత హాజరుకు కింది కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 

రామోజీ వయస్సు 76 సంవత్సరాలని, దీనిని పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. ఈ వాదనతో న్యాయమూర్తి విభేదిస్తూ.. రామోజీరావు కిందికోర్టు ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మేరకు రామోజీ పిటిషన్‌ను కొట్టివేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న రామోజీ తరఫు న్యాయవాది తాము దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయవద్దని, దానిని ఉపసంహరించుకుంటామని కోర్టును వేడుకున్నారు. దీంతో పిటిషన్ ఉపసంహరణకు న్యాయమూర్తి అనుమతినిచ్చారు.
Share this article :

0 comments: