పదవి కోసం వైఎస్‌పై విమర్శలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పదవి కోసం వైఎస్‌పై విమర్శలు

పదవి కోసం వైఎస్‌పై విమర్శలు

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మపై శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేవిలా ఉన్నాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలకమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం దయాదాక్షిణ్యాలు, మెప్పుకోసం గౌరవప్రదమైన వ్యక్తిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శిస్తే ఉన్నత పదవులు వస్తాయనే దుగ్ధతో సంస్కారంలేని విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 

మంత్రి ఆనం దిగజారుడు రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, త్వరలో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. గురువారం ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్‌తో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.‘బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వై.ఎస్.విజయమ్మ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. 

పజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 గంటల కరెంట్, 30 కేజీల బియ్యం హామీలను నిలబెట్టుకోవాలని చెబుతూనే.. దివంగత వైఎస్‌ఆర్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఒక్కరూపాయి కూడా అదనంగా చార్జీలు పెంచకపోగా పైగా పన్నులు తగ్గించడం ద్వారా ఆదాయం పెరుగుతుందని వైఎస్‌ చేసి చూపించారన్నారు. వైఎస్‌తో పాటు ఆయన కేబినెట్ సమర్థంగా పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింద న్న విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 20 శాతం పెరుగుతున్న కొద్దీ ప్రజలపై పన్నులు ఎందుకు వేస్తున్నారని నిలదీశారు.

ప్రజలను పన్నుపోటు పీల్చిపిప్పి చేస్తున్నా సంక్షేమ పథకాలు ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం మీద కక్షతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైందికాదన్నారు. కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపిన వ్యక్తిని నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నారన్నారు. వైఎస్ హయాంలో వెలువడిన 26 జీవోలపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. విజయమ్మ అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా మంత్రి ఆనం పుత్రవాత్సల్యం, సహజీవనం అంటూ సభ్యసమాజం తలదించుకునేలా సంస్కారంలేని వ్యాఖ్యలు చేశారు’ అని దుయ్యబట్టారు.

వైఎస్ కుటుంబాన్ని నాశనం చేసేందుకే..

మహానేత కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే దుష్ట ఆలోచనతో కాంగ్రెస్ నేతలు విపక్ష టీడీపీతో చేతులు కలిపారని కొణతాల ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చాక ఆ పార్టీ నేతలు చంద్రబాబుతో కుమ్మక్కై అనేక రకాల కేసులతో వేధిస్తున్నారన్నారు. శంకర్రావు లేఖతో టీడీపీ నేతలు కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏదో విధంగా జగన్‌ను జైలుకు పంపాలనే దుష్ట ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. పుత్రవాత్సల్యంతో వైఎస్‌ను బజారుకీడుస్తున్నారని ఆనం చేసిన వ్యాఖ్యలను కొణతాల ఖండించారు. వైఎస్ పరువు ప్రతిష్టలను ఎవరు తీస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైకోర్టు వైఎస్ హయాంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి 26 జీవోలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసుపై కోర్టులో ఎనిమిది నెలలుగా విచారణ జరుగుతున్నా అడ్వొకేట్ జనరల్ కూడా కన్నెత్తి చూడకపోవడంలోని ఉద్దేశమేంటని కొణతాల నిలదీశారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి దమ్ముంటే నెల్లూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనక్‌ప్రసాద్ సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆనం పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: