కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వమేదీ..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వమేదీ..?

కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వమేదీ..?

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012



* జాతీయ నాయకత్వంపై సన్నగిల్లుతున్న ఆశలు
* రాహుల్ చరిష్మా పనిచేయదని తేల్చిన యూపీ
* రాష్ట్రంలోనూ పార్టీకి గడ్డుకాలమేనని విశ్లేషణ
* కాంగ్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వమేదీ..?
* వైఎస్ వంటి చరిష్మా ఉన్న నేతలు కరువైన రాష్ట్ర కాంగ్రెస్
* ఉప ఎన్నికల అనంతరం భారీగా వలసలుంటాయని అంచనా
ప్రస్తుత ఫలితాలు స్వయంకృతాపరాధమేనంటున్న నేతలు
* అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నందుకే 
* ఈ గుణపాఠమని సీనియర్ నాయకుల విశ్లేషణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కంగుతినిపించాయి! యూపీ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మణిపూర్ మినహా తక్కిన నాలుగు చోట్లా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడం పార్టీ నేతల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో పార్టీ భవితవ్యంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పార్టీ అధినేత సోనియాగాంధీ కుటుంబంపై ముఖ్యంగా రాహుల్‌గాంధీపైన ఇంతకాలం పెట్టుకున్న ఆశలు వమ్ముకావడంతో నేతలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితి రావడానికి బాధ్యులెవరన్న కోణంలో అనేక విశ్లేషణలు సాగాయి. రాహుల్‌కు సెమీ ఫైనల్‌గా భావించి సొంత రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయించినప్పటికీ యూపీలో కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితం కావడంతో ఆ ప్రభావం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉంటుందనిపార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలతో పాటు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవన్న నిర్ధారణకు వచ్చారు. మంగళవారం యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు వాటిపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చర్చల్లో మునిగిపోయారు. సభ జరుగుతున్నా.. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లోని తమ చాంబర్లలోనే ఉండి ఫలితాలపై విశ్లేషణలు సాగించారు. 

సోనియా, రాహుల్, ప్రియాంకలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విసృ్తతంగా ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. సోనియా, రాహుల్ సొంత నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలవ్వడాన్ని... ఆ కుటుంబం చరిష్మా తగ్గిపోయిందనడానికి నిదర్శనంగా నేతలు విశ్లేషిస్తున్నారు. పైగా రాహుల్‌గాంధీని భావి ప్రధానిగా ఫోకస్ చేసినా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ప్రజలు ఆమోదించలేదు. బుందేల్‌ఖండ్‌కు రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఆ రాష్ర్టంలోని రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించినా కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించలేదు. 

రాహుల్ చరిష్మాతో వచ్చే ఎన్నికల్లో బయటపడతామని, ఆయన ప్రధాని అవుతారంటూ చెప్పుకొస్తున్న పార్టీ నేతలకు ఈ ఫలితాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో ఇదివరకు రాహుల్ తిరిగిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదన్న సంగతిని నేతలు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం, పార్టీలపై విపరీత ప్రభావాన్ని చూపేవేనని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్టాల్లో.. పెద్ద రాష్ట్రాలు కాంగ్రెస్ చేతినుంచి క్రమేపీ చేజారిపోతున్నాయి. కాంగ్రెస్ చేతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మినహా పెద్ద రాష్ట్రాలేమీ లేవు. మహారాష్ట్రలో ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తక్కినవన్నీ చిన్న రాష్ట్రాలే. బీహార్ వంటి రాష్ట్రాల్లో రాహుల్‌ను ప్రధాన ప్రచారకర్తగా బరిలోకి దించినా కాంగ్రెస్ బోల్తా పడిన విషయాన్ని నేతలు గుర్తుచేస్తున్నారు.

అధిష్టానం నిర్ణయాలే ఈ దుస్థితికి కారణం..
సోనియాతో పాటు ఇంతకాలం పార్టీకి బ్రహ్మాస్త్రాలుగా ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ, ప్రియాంకల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలిపోవడంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కోటరీ అభిప్రాయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, కిందిస్థాయిలో వాస్తవాలను గమనించకుండా ఏకపక్షంగా వెళ్లడం వంటి పొరపాట్ల వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని వారు పేర్కొంటున్నారు. 

125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవడానికే తప్ప గడిచిన దశాబ్దకాలంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ అనుసరించిన విధానాల వల్లే తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న నేతలు ఎక్కువగా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్‌గా కోస్తాకు చెందిన కాంగ్రెస్ నాయకుడొకరు విశ్లేషించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపుగా తెరమరుగవుతున్న దశలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని విజయపథాన నడిపించిన విషయాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు.

వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే...
యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి అనేక కారణాలను పార్టీ నేతలు విశ్లేషించారు. ప్రధానంగా స్థానికంగా ఉండే నాయకులెవరికీ జనాదరణ లేకపోవడ ంతో అధిష్టానం ఎంతసేపూ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని, వారిని దెబ్బతీయాలన్న ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్లడం వల్ల పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోయిదని అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అటు యూపీలో సమాజ్‌వాది పార్టీ నేతలను, ఇటు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతల విషయంలో ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరింపులకు పాల్పడటం, రాజకీయంగా లొంగదీసుకోవడం వంటి చర్యలకు కాంగ్రెస్ నాయకత్వం పాల్పడిందని, ఆ విషయం ప్రజలకు బాగా అర్థమైందని అంటున్నారు. 

ఈ రెండు రాష్ట్రాల్లో జనాదరణ కలిగిన నాయకులెవరూ లేకపోగా రాహుల్, ప్రియాంకల ప్రభావం ఉంటుందని తప్పుడు అంచనాకు రావడం వల్ల గట్టి దెబ్బ తగిలిందంటున్నారు. బెదిరిస్తూ లొంగదీసుకోవడం, తమకు అనుకూలంగా మలుచుకోవడం లేదా తమ దారిలోకి తెచ్చుకోవడమన్న ఎత్తుగడలతో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకున్న కారణంగా.. యూపీ, పంజాబ్‌లే కాకుండా గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కోలుకోని స్థితికి దిగజారిందంటున్నారు.

నడిపించే నాయకుడేడి..?
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పూర్తిగా తెరమరుగైన దశలో 2004 ముందు వైఎస్ పాదయాత్ర కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కొత్త జవసత్వాలను నింపింది. ఆ ఫలితంగా సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత 2009 లో కూడా గెలుపోటములకు బాధ్యత వహించి వైఎస్ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అత్యధిక ఎంపీ సీట్లు (33) కైవసం చేసుకుని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడ్డారు. అయితే ఆయన మరణం తర్వాత రాష్ట్రంలో పార్టీని మోయగలిగే ప్రజాదరణ కలిగిన నాయకులెవరూ లేకపోగా గ్రూపులు పెరిగిపోయి అస్తవ్యస్తంగా మారింది. అయినా ఇంతకాలం రాహుల్, ప్రియాంకలపై విశ్వాసంతో కాంగ్రెస్ నిలదొక్కుకుంటుందన్న ఆశల్లో ఆ పార్టీ నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారు. పైగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణం సోనియా, రాహుల్‌గాంధీలే తప్ప వైఎస్ కాదని విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పుడు యూపీ తదితర రాష్ట్ర అసెంబ్లీల ఫలితాల్లో సోనియా, రాహుల్, ప్రియాంకలు రాత్రింబవళ్లూ తిరిగినా కాంగ్రెస్‌కు పరాజయం తప్పకపోవడం గమనార్హం!

ప్రజాదరణ ఉన్న నాయకుడికే పట్టం..
స్థానికంగా జనాదరణ కలిగిన నాయకుడు లేకపోతే పార్టీ నెట్టుకురావడం కష్టతరమన్న విషయం అయిదు రాష్ట్రాల ఎన్నికలతో ప్రస్ఫుటమైందని, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గడ్డుకాలం తప్పదని పీసీసీలోని ముఖ్య నాయకుడు ఒకరు విశ్లేషించారు. ప్రజల కష్టసుఖాలను ప్రతినిత్యం తెలుసుకుంటూ వారితో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్న వారికే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప.. జాతీయ నాయకులను తీసుకువచ్చి బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన ఫలితముండదని ఈ ఎన్నికలతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి భారీ సభలు నిర్వహించినా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా రానున్న కాలంలో ఇదే జరగబోతోందన్న అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్‌ను రక్షించే చరిష్మా ఉన్న నాయకుడెవరూ కనిపించడం లేదని మరో నేత వివరించారు. 

త్వరలో జరగబోయే ఉప ఎన్నికల తరువాత పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో? ఎవరెటు పోతారో..? అన్న చర్చ కూడా పార్టీలో ప్రారంభమైంది. మంత్రులు సైతం తమ సొంత నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితులు ఉండడంతో సురక్షిత స్థానాలకోసం వెతుకులాటలో పడ్డారు. కొందరు మంత్రులు అసెంబ్లీకి ఈసారి లాభం లేదనుకుంటూ పార్లమెంటుకు పోటీచేద్దామన్న ఆలోచన చేస్తుండటాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో తెలంగాణకు చెందిన ఒక మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సమీప భవిష్యత్తులో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లినట్టేనని ప్రస్తుత వాతావరణాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ పరిస్థితిని అధిష్టానం ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఈ పార్టీని ఎవ్వరూ బాగు చేయలేరు...’’ అని నిర్వేదం వ్యక్తం చేశారు.

* సంకీర్ణ సారథిగా కాంగ్రెస్ పలుకుబడికి దెబ్బ
* భాగస్వాముల్లో విశ్వసనీయతను కోల్పోతున్న పార్టీ
* కాంగ్రెస్‌ను మునుగుతున్న నావగా చూస్తున్న మిత్రులు?
* రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై కాంగ్రెస్‌లోనే సందేహాలు!
* ప్రియాంకపైనా ఆశలు పెట్టుకోలేమంటున్న పార్టీ శ్రేణులు
* 2014లో దేశవ్యాప్తంగా ప్రతికూలత తప్పదన్న వ్యాఖ్యలు
* స్థానిక నాయకత్వాన్ని అణచేయడమే కారణమంటున్న నేతలు
* మధ్యంతరం తప్పకపోవచ్చంటూ అంచనాలు

న్యూఢిల్లీ నుంచి డబ్ల్యూ చంద్రకాంత్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిలిన ఎదురుదెబ్బలు యూపీఏ సర్కారుపై పెను ప్రభావమే చూపనున్నాయి. సంకీర్ణ సారథిగా కూటమిలో కాంగ్రెస్ పలుకుబడిని, భాగస్వాముల్లో ఆ పార్టీకున్న విశ్వసనీయతను ఇవి బాగా దెబ్బతీశాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీని ముందుండి నడిపించిన నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ నాయకత్వ సామర్థ్యంపై ఇప్పటికే ఉన్న సందేహాలను ఎన్నికల ఫలితాలు మరింతగా పెంచాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఫలితాలను ఆయన వైఫల్యంగానే కాంగ్రెస్ శ్రేణులు పరిగణిస్తున్నాయి. ప్రధానిగా దేశంపైనా, సారథిగా పార్టీపైనా తమ కుటుంబ పెత్తనాన్ని కొనసాగించాలన్న ఆయన ఆకాంక్షలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనంటున్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పెద్దల్లో ఇప్పటికే అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్‌పై యూపీఏ మిత్రుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చివరికి మధ్యంతర ఎన్నికలకు దారితీసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

వారసుల ప్రభావమేదీ..!?
యూపీలో రాహుల్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా, ఆయన సోదరి ప్రియాంక తన పిల్లలతో పాటుగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. వారసత్వ రాజకీయాలను ప్రజలు ఆమోదించడం లేదనేందుకు ఈ ఫలితాలు పూర్తిగా అద్దం పట్టాయంటున్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఆమెకు జనాదరణ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే విన్పిస్తుండటం విశేషం! కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లోనే ఏ ప్రభావమూ చూపని వ్యక్తి దేశవ్యాప్తంగా ఏదో అద్భుతం చేస్తారని ఎలా ఆశిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలకు రెండేళ్ల వ్యవధే ఉన్నందున యూపీలో పరిస్థితిలోనూ, ప్రజాభిప్రాయంలోనూ పెద్దగా మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆ లెక్కన 2009లో యూపీలో నెగ్గిన 22 లోక్‌సభ స్థానాలను నిలుపుకోవడం కూడా కాంగ్రెస్‌కు శక్తికి మించిన పనే! దీనికి తోడు బీఎస్పీ నుంచి పాలనా పగ్గాలను చేజిక్కించుకున్న సమాజ్‌వాదీ తన ఎన్నికల వాగ్దానాలను ఏమాత్రం నెరవేర్చగలిగినా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయం కాక తప్పదంటున్నారు. నిరుద్యోగ యువత కోసం అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించిన సామాజిక భద్రత పథకం ఏమాత్రం విజయవంతమైనా యూపీపై కాంగ్రెస్ పూర్తిగా ఆశలు వదులుకోక తప్పని పరిస్థితి! ఇక మైనింగ్ కుంభకోణాలు, అంతర్గత పోరు వంటి కారణాలతో గోవాలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్‌లో ఈసారైనా అధికారంలోకి రావాలన్న ఆశలు అడియాసలుగానే మిగిలాయి. 

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ మెజారిటీకి చేరువగా రాగలిగినా, అధికార బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరే అందుకు ప్రధాన కారణం. నాలుగు రాష్ట్రాల్లోనూ పట్టణ, గ్రామీణ ఓటర్లంతా మూకుమ్మడిగా పార్టీని తిరస్కరించిన వైనం కాంగ్రెస్ పెద్దల్లో గుబులు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్‌కు ఇప్పటికే ఆశలు పూర్తిగా అడుగంటిన విషయం తెలిసిందే. యూపీ, ఏపీలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాలన్నింట్లోనూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఖాయమంటున్నారు.

కాంగ్రెస్‌లో విభేదాలు?
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే విభేదాలు నెలకొన్నాయా? అవి నానాటికీ తీవ్రతరమవుతున్నాయా? పార్టీలోనూ, యూపీఏ సర్కారులోనూ కీలక పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్లకు.. సోనియా-రాహుల్ బృందానికి మధ్య పలు అంశాల్లో పలు కారణాలతో విభేదాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయని చెబుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ విఫలమవ్వాలని కాంగ్రెస్ సీనియర్లలో పలువురు గట్టిగా కోరుకున్నారని కూడా అంటున్నారు! ప్రధాని కార్యాలయం కూడా పార్టీ నాయకత్వంపై ఆధారపడకుండా పలు ప్రభుత్వ పథకాలను సొంతంగానే ప్రచారం చేసుకునేందుకు నడుం బిగించడమూ లోతుగా ఆలోచించాల్సిన విషయమేనని ఏఐసీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

పార్టీపై సోనియా కుటుంబానికి ఉన్న నియంత్రణపై ఇవి ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ సహా విపక్షాలన్నీ కాంగ్రెస్‌పై విమర్శలకు మరింతగా పదును పెడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ ఆ పార్టీ విఫలమవుతున్న తీరుకు, దానిపై జనాగ్రహానికి ఫలితాలు అద్దం పట్టాయంటున్నాయి. లోక్‌సభకు త్వరలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తదితరులు అభిప్రాయపడుతున్నారు.

పునరాలోచనలో మిత్రులు...?
తృణమూల్ కాంగ్రెస్ సహా యూపీఏ మిత్రపక్షాలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఈ ‘సెమీఫైనల్స్’లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసిందని అవి అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాన్ని తమకు ఓ హెచ్చరికగా కూడా ఆ పార్టీలు పరిగణిస్తున్నాయి. నానాటికీ నీట మునుగుతున్న ఓడలో అవి ఎంతకాలం ఉంటాయన్న ప్రశ్న ఇటు పరిశీలకుల్లో ఆసక్తిని, అటు కాంగ్రెస్‌లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. స్థానిక, ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కడుతున్న వైనం కూడా పార్టీ ఆందోళనలను మరింతగా పెంచుతోంది. లేనిపోని భయాలతో ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక నాయకత్వాన్ని పద్ధతి ప్రకారం అణచివేస్తూ వచ్చిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇప్పుడు యూపీలో జరిగిందే ఇకపై ఏపీతో సహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జరగనుందని వారు జోస్యం చెబుతున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో కూడా విపక్షాల దాడిని ఎదుర్కోవడం ఇకపై యూపీఏకు శక్తికి మించిన పనేనంటున్నారు. లోక్‌పాల్, ఆహార భద్రత వంటి పలు కీలక బిల్లుల ఆమోదం తదితరాలు పాలక సంకీర్ణానికి పెను సవాలుగా నిలిచే ఆస్కారముంది. దాంతోపాటు ఇప్పటికే మధ్యతరగతి ఆగ్రహాగ్నిని చవిచూస్తున్న నేపథ్యంలో.. ప్రతిపాదిత పెట్రో ధరల పెంపు, ద్రవ్యోల్బణ అదుపు వంటి చర్యలకు కూడా స్వేచ్ఛగా సాహసించలేని ఇబ్బందికర పరిస్థితిని యూపీఏ ఎదుర్కోనుంది.
Share this article :

0 comments: