ఉప ఎన్నికల్లో పరస్పరం డమ్మీ అభ్యర్థులు నిలపాలని అవగాహన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల్లో పరస్పరం డమ్మీ అభ్యర్థులు నిలపాలని అవగాహన

ఉప ఎన్నికల్లో పరస్పరం డమ్మీ అభ్యర్థులు నిలపాలని అవగాహన

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

* ఉప ఎన్నికల్లో పరస్పరం డమ్మీ అభ్యర్థులు నిలపాలని అవగాహన 
* వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించటమే లక్ష్యం 
* టీడీపీ నరసన్నపేట అభ్యర్థి ప్రకటన మతలబు ఇదే 
* కాంగ్రెస్ కోసం డమ్మీ అభ్యర్థిని నిలిపేందుకు టీడీపీ ఒప్పందం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రాజకీయ మనుగడ కోసం గత రెండున్నరేళ్లుగా అనేక అంశాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకుంటూ నెట్టుకొస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు.. రాబోయే ఉప ఎన్నికల్లోనూ అదే తంతును కొనసాగిస్తున్నాయి. ఇటీవల ముగిసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకోవటం కోసమో రెండు, మూడు, నాలుగు స్థానాల కోసమో పోటీపడిన ఈ రెండు ప్రధాన పార్టీలూ.. రాబోయే 18 నియోజకవర్గాల ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకునేందుకు పరస్పరం ‘డమ్మీ’ అభ్యర్థులతో సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 17 అసెంబ్లీ స్థానాలతో పాటు చిరంజీవి రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయ్యే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కలుపుకుంటే మొత్తం 18 స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా నియోజక వర్గాల్లో తమ తమ పార్టీల తరఫున ఎవరెవరిని బరిలో నిలపాలన్న అంశంపై.. సదరు జిల్లాలకు చెందిన ఇరు పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో సంప్రదింపులు జరిపినట్లు రెండు పార్టీల నాయకులే వెల్లడిస్తున్నారు. 

నరసన్నపేటలో అదే కార్డు... 
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ను ఢీకొట్టేందుకు.. ఒకరు బలమైన అభ్యర్థిని, మరొకరు డమ్మీ అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్, టీడీపీల నేతలు చర్చలు జరిపి నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకే తెలుగుదేశం పార్టీ మంగళవారం అకస్మాత్తుగా నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థి పేరును ప్రకటించింది. ఈ స్థానం నుంచి 2009లో టీడీపీ తరఫున బొగ్గు లక్ష్మణరావు పోటీ చేయగా 42,837 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన నేపథ్యంలో ఈ స్థానంలో టీడీపీ తరఫున బొగ్గు లక్ష్మణరావు బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఆయనే అభ్యర్థి అని పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే జిల్లా నేతలకు చెప్పారు కూడా. కానీ మంగళవారం అకస్మాత్తుగా ఆయన పేరును తప్పించి శిమ్మా స్వామిబాబు పేరును తెరపైకి తెచ్చారు. 

ఇప్పటివరకు స్వామిబాబు పేరు అసలు పార్టీలో ప్రస్తావనకే రాలేదు. ఆ పేరుపై చర్చ కూడా లేదు. స్వామిబాబు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం అధికారికంగా ప్రకటించటంతో జిల్లా నేతలు సైతం విస్తుపోయారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచిందని టీడీపీ నేతలే చెప్తున్నారు. ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణదాస్‌ను ఎలాగైనా ఓడించేందుకు.. ఈ రెండు పార్టీల నేతలు పరస్పరం ఒక అవగాహనకు వచ్చిన మీదటే టీడీపీ నాయకత్వం బొగ్గు లక్ష్మణరావును కాదని స్వామిబాబును అభ్యర్థిగా ప్రకటించినట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రాందాస్ పోటీ చేయనున్నారు. ఇరు పార్టీల్లో ఒకరు బలహీనమైన డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించాలన్న అవగాహన మేరకు టీడీపీ కొత్త పేరును తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. 

గుంటూరు జిల్లాలోనూ అదే తంతు... 
గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కూడా ఈ విధమైన అవ గాహనతో అభ్యర్థులను రంగంలోకి దించాలని కాంగ్రెస్, టీడీపీల నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఒకటికి రెండుసార్లు ఇరు పార్టీల నేతలు అసెంబ్లీ లాబీల్లోనే సమాలోచనలు జరిపారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ నేతలు కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లకా్ష్మరెడ్డిలు చర్చించుకున్న విషయం విదితమే. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఉమ్మడి శత్రువు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కనుక తామంతా ఏకతాటిపై నడిచి ఆ పార్టీని ఓడించాలని పుల్లారావు ప్రతిపాదించగా.. కాంగ్రెస్ నేతలిద్దరూ అందుకు అంగీకారం తెలిపారు. 

తమ పార్టీ తరఫున గట్టి అభ్యర్థి కనిపించటం లేదని, ఇక్కడ టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిని నిలబెడితే తాము సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారని టీడీపీ నాయకుడొకరు తెలిపారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ నాయకులు ఎవరెవరు ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారో తెలియదని, అయితే మొత్తంగా 18 స్థానాల విషయంలోనూ అవగాహన కుదురుతుందా? లేక కొన్ని స్థానాలకు మాత్రమే పరస్పర అవగాహన పరిమితమవుతుందా అన్నది ఇంకా తేలలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.
Share this article :

0 comments: