సీబీఐ దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు..?.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందిందెవరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు..?.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందిందెవరు?

సీబీఐ దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు..?.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందిందెవరు?

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

* కోట్ల విలువైన భూమిని ఎకరా రూ. 29 లక్షలకే ఎలా ఇచ్చారు?
* సీబీఐ దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు..?.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందిందెవరు?
* అసలు ఎమ్మార్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏపీఐఐసీని ప్రోత్సహించిందెవరు?
* భూ కేటాయింపులపై అప్పటి కేబినెట్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు సమీక్షించలేదు..?
* తుపాకీని మరొకరి భుజం మీద పెట్టి కాల్చలేరని జస్టిస్ నర్సింహారెడ్డి వ్యాఖ్య
* చేయాల్సినదంతా చేసి ఇప్పుడు ఇతరులను తప్పుపడతారా..? అని ప్రశ్న
* ప్రభుత్వాన్ని నమ్మి విల్లాలు కొన్న వారిని ఇబ్బంది పెట్టొద్దని న్యాయమూర్తి హితవు
* బి.ఆర్.మీనా, శివసుబ్రహ్మణ్యంలు చెరో రూ.35 కోట్లు అడిగారు: ఎమ్మార్

హైదరాబాద్, న్యూస్‌లైన్:కోట్ల విలువ చేసే భూములను ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరా రూ.29 లక్షలకే ఎలా కేటాయించారని, ఇంత తక్కువ ధరకు భూములు కేటాయించడంలో ఆంతర్యమేమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి అప్పటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఎందుకు సమీక్షించలేదని నిలదీసింది. హైదరాబాద్ నగరంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇరుకు గదుల్లో నివసిస్తుంటే.. విలాసవంతమైన విల్లాల కోసం వందల ఎకరాలు ఎలా కట్టబెట్టారని అడిగింది. ఎమ్మార్ వ్యవహారంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న సీబీఐ... తక్కువ ధరకు భూములు కేటాయించడంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించింది. తుపాకీని మరొకరి భుజం మీద పెట్టి కాల్చలేరని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

తమ ప్లాట్లను రిజిస్టర్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. ఎమ్మార్, బౌల్డర్‌హిల్స్ ప్లాట్ల కొనుగోలుదారుల సంఘాలతో పాటు భరత్ అనే కొనుగోలుదారుడు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి బుధవారం మరోసారి విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి.. ప్రభుత్వం, ఏపీఐఐసీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బి.పి.మోహన్‌లు వాదనలు వినిపించారు. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, పిటిషనర్లు విల్లాను చదరపు గజం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారని సుదర్శన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఐఐసీ దారుణంగా నష్టపోయిందన్నారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేశామని చెప్పారు. 

ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘‘చదరపు గజం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారని చెబుతున్నారు. బాగానే ఉంది. మరి మీరు చేసిందేమిటి..? కోట్లు విలువ చేసే భూములను నామమాత్రపు రేటుకు ఎకరా రూ.29 లక్షలకే ఇవ్వలేదా! ఇదంతా పారదర్శకంగా జరిగిందా? ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందిందెవరు? అసలు ఎమ్మార్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ఏపీఐఐసీని ప్రోత్సహించిందెవరు? విల్లాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి ప్రభుత్వం రుచి మరగలేదా? చేయాల్సినదంతా చేసి ఇప్పుడు మిగిలిన వారిని తప్పుపడతారా? మిమ్మల్ని నమ్ముకుని వారు (విల్లా యజమానులు) విల్లాలు కొన్నారు. తీరా కొన్నాక చివరి నిమిషంలో విల్లాలను రిజిస్టర్ చేయబోమని అంటే ఎలా..? వారి పరిస్థితి ఏమిటి..? వారు ఎక్కడికెళ్లాలి..? విల్లాలు కొన్నవారికి సమస్యలు సృష్టించకండి.’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మీనా, శివసుబ్రహ్మణ్యంలు బెదిరించారు...
వాదనల చివరి దశలో ఎమ్మార్ ఎంజీఎఫ్ తరఫు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లువాలియా జోక్యం చేసుకుని.. ఏపీఐఐసీ ఎండీ బి.ఆర్.మీనా, మాజీ చైర్మన్ శివ సుబ్రహ్మణ్యంలపై సంచలన ఆరోపణలు చేశారు. మీనా తమను అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే తమకు చెరో రూ.35 కోట్లు ఇవ్వాలని మీనాతో పాటు శివ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారని తెలిపారు. 

‘‘2005 నుంచి 2010 వరకు ఎమ్మార్ ఎంజీఎఫ్ ఈ ప్రాజెక్టు కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఏపీఐఐసీ ఎండీగా బీఆర్ మీనా, చైర్మన్‌గా శివ సుబ్రహ్మణ్యం వచ్చిన తరువాత మా తిరోగమనం ప్రారంభమైంది. దుబాయ్‌లో రూ.35 కోట్లు విలువ చేసే రెండు విల్లాలు ఇవ్వాలని ఎంజీఎఫ్ సీఎఫ్‌ఓ విజయ్ రాఘవను అడిగారు. ఇది సాధ్యం కాదని చెప్పడంతో.. బీపీ ఆచార్య, పార్థసారథిరావులకు ఇచ్చారు కదా అంటూ ఆరోపించారు. కోరింది ఇవ్వకుంటే ప్రాజెక్టు ఎలా ముందుకెళుతుందో చూస్తామంటూ బెదిరించారు. ఈ రూ.70 కోట్ల గురించి ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు చెప్పాలని, లేనిపక్షంలో రూ.5వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేసే విషయంలో కొందరు బిల్డర్లతో మీనా చర్చలు జరిపినట్లు మాకు విశ్వసనీయంగా తెలిసింది. వారి రూ.70 కోట్ల విషయమై రూ.10 వేల కోట్ల ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది. ఈ ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 26 శాతం నుంచి 6 శాతానికి తగ్గించామన్నది ప్రధాన ఆరోపణ. మరి రహేజా విషయంలో ఏపీఐఐసీ చేసింది ఏమిటి..? రహేజా ఏపీఐఐసీ వాటాను 11% నుంచి 1 శాతానికి తగ్గించింది. కాని రహేజాపై క్రిమినల్ కేసులు లేవు. ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఎటువంటి ప్రొసీడింగ్స్ జారీ కాలేదు. 11 % వాటాను పునరుద్దరిస్తామని రహేజా చెప్పగానే ఒప్పేసుకున్నారు. మరి మేము 26 శాతం వాటాను తగ్గించలేదని, ఆధారాలతో చూపిస్తే ఎందుకు పట్టించుకోలేదు’’ అని ప్రశ్నించారు. 

ఎమ్మార్ కుంభకోణం విలువ రూ.2,500 కోట్లని పత్రికల్లో కథనాలు వచ్చాయని, పలుమార్లు ఈ విషయం కోర్టుల్లో సైతం ప్రస్తావనకు వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ఎమ్మార్ కుంభకోణం విలువ రూ.43.5 కోట్లు మాత్రమేనని తేల్చిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ ఆరోపణలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుం చితే పరిశీలిస్తామని చెప్పారు. ఇందుకు దల్జీత్‌సింగ్ అంగీకరించారు. అనంతరం న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఎమ్మార్ వివాదం ఇదీ ...
2002లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్‌కు చెందిన ఎమ్మార్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చారు. హైదరాబాద్ నానక్‌రాంగూడ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన వందల ఎకరాల భూములను నామమాత్రపు ధరకే ఆ సంస్థకు కేటాయించారు. ఇందులో ఎమ్మార్ విల్లాలను నిర్మించగా పలువురు ప్రముఖులు ఈ విల్లాలను కొనుగోలు చేశారు. ఇదిలావుండగా ఎమ్మార్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే డాక్టర్ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు విచారణ ప్రారంభించింది. 

తొలుత సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది. ఆ మేరకు నివేదిక అందిన తర్వాత పూర్తి స్థాయి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మార్ ప్రాజెక్టులో భాగమైన విల్లాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ జీవో జారీ చేసింది. అప్పటికే పలువురు కొనుగోలుదారులు పూర్తిమొత్తాలు చెల్లించి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్‌తో పాటు బౌల్డర్ హిల్స్ ప్లాట్ల కొనుగోలుదారుల సంఘాలు, భరత్ అనే కొనుగోలుదారుడు హైకోర్టును ఆశ్రయించారు.
Share this article :

0 comments: