చిన్నతరహా పరిశ్రమలకు కరెంటు కోతలతో తీవ్ర నష్టం. నాడు వైఎస్ ఇచ్చినట్టు ఇవ్వండి. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిన్నతరహా పరిశ్రమలకు కరెంటు కోతలతో తీవ్ర నష్టం. నాడు వైఎస్ ఇచ్చినట్టు ఇవ్వండి.

చిన్నతరహా పరిశ్రమలకు కరెంటు కోతలతో తీవ్ర నష్టం. నాడు వైఎస్ ఇచ్చినట్టు ఇవ్వండి.

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012

సర్కారుకు నివేదించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ
కార్మికులు ఒక నెలకు కోల్పోయే ఆదాయం రూ.1,300 కోట్లు
ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.980 కోట్ల గండి
కోతలు ఇలాగే ఉంటే పరిశ్రమల మూత తప్పదు
రాష్ట్ర ఆర్థిక రంగానికి కీలకమైన ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
అదనపు విద్యుత్ కొనుగోలు చేసి అయినా పరిశ్రమలకు కరె ంటు సరఫరా చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 2011 నాటికి 1.80 లక్షలకు పైగా పరిశ్రమలు
వీటి ఉత్పత్తుల విలువ రూ.1.20 లక్షల కోట్లు
ఇందులో మన రాష్ట్రంలోనే రూ.56 వేల కోట్ల ఉత్పత్తుల అమ్మకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వందలు.. వేలు.. కాదు.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడతారు! రూ.1,300 కోట్ల వేతనాలు కోల్పోతారు!! వారి కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నమవుతాయి. ప్రభుత్వ ఖజానాకూ నెలకు రూ.80 కోట్ల చొప్పున గండి!! సర్కారు నిర్లక్ష్యంతోనే రాష్ట్రానికి ఈ సంక్షోభం.. ఈ దురవస్థ..! సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే ఇవే పరిస్థితులు తలెత్తనున్నాయి. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ పరిశ్రమల శాఖ. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు అడ్డగోలు కరెంటు కోతలతో తలెత్తబోయే విపత్కర పరిణామాలను వివరిస్తూ తాజాగా ఆ శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. విద్యుత్ కోతలు ఇదే విధంగా కొనసాగితే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడతాయని స్పష్టంచేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ రంగం ఎంతో కీలకమైనదని, వాటిపై ఆధారపడి 20 లక్షల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని తెలిపింది. ఎంఎస్‌ఎంఈలను విద్యుత్ కోతల నుంచి మినహాయించాలని సూచించింది. అధిక ధర వెచ్చించి అయినా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొనుగోలు చేసి అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని, ఆ అదనపు విద్యుత్‌ను ఎంఎస్‌ఎంఈలకు రెగ్యులర్ విద్యుత్ చార్జీలకే సరఫరా చేయాలని తెలిపింది. లేదంటే 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉందని.. తద్వారా ఆ కార్మికులు నెలకు కోల్పోయే వేతనం రూ.1300 కోట్లని అంచనా వేసింది. అలాగే ఎంఎస్‌ఎంఈల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ.980 కోట్ల ఆదాయం సమకూరుతున్న విషయాన్ని ప్రస్తావించింది. పరిశ్రమల శాఖ నివేదికలోని వివరాల ప్రకారం...

ఉత్పత్తి విలువ రూ.1.20 లక్షల కోట్లు...

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 2011 నాటికి మొత్తం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 1,88,685 ఉన్నాయి. వీటి ద్వారా 20,36,517 మందికి ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్ల స్థాపనకు అయిన పెట్టుబడి మొత్తం రూ.33,811.22 కోట్లు. ఒక ఏడాదికి వీటి ఉత్పత్తుల విలువ 1.20 లక్షల కోట్లు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఆదుకునేందుకు విద్యుత్ సరఫరాలో ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలి. విద్యుత్ కోతల దెబ్బకు ఈ పరిశ్రమలు మూతపడితే వీటిపై ఆధారపడిన లక్షల కార్మికుల కుటుంబాలు జీవనోపాధికి దూరమై, రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే... సగటున ఒక్కో కార్మికుడికి నెలకు రూ.6,500 చొప్పున మొత్తం నెలకు రూ.1,300 కోట్ల వేతనాలను ఆ కుటుంబాలు కోల్పోతాయి.

మూతపడితే ఏటా రూ.980 కోట్ల నష్టం..

రాష్ట్రంలోని 1.88 లక్షలకుపైగా ఉన్న ఎంఎస్‌ఎంఈల ద్వారా ఏడాదికి రూ.1.20 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుండగా.. అందులో రూ.40 వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన రూ.80 వేల కోట్ల ఉత్పత్తుల అమ్మకాలు మన దేశంలోనే జరుగుతున్నాయి. ఇందులోనూ రూ.56 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల మార్కెట్ మన రాష్ట్రంలోనే ఉంది. అంటే నెలకు రూ.4,666.67 కోట్లు. ఈ ఉత్పత్తులపై ఏడాదికి 10.5 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏటా రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ. 980 కోట్ల మేరకు ఆదాయం వస్తోంది. విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే ఖజానాకు సమకూరే ఈ ఆదాయానికి కూడా గండిపడే ప్రమాదం ఉంది. ఈ నష్టం నెలకు రూ.81.6 కోట్ల దాకా ఉంటుంది. ఈ పరిశ్రమలకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలంటే ప్రభుత్వానికి నెలకు అయ్యే అదనపు వ్యవయం కేవలం రూ.120 కోట్లు! అది కేవలం మార్చి, ఏప్రిల్, మే నెలలకు మాత్రమే. అంటే ఏడాదికి రూ.360 కోట్లు.

నాడు వైఎస్ ఇచ్చినట్టు ఇవ్వండి..: పారిశ్రామికవేత్తలు

పరిశ్రమలశాఖ నివేదిక చూసిన తర్వాత అయినా ప్రభుత్వం కళ్తు తెరిస్తే మంచిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు వారానికి మూడ్రోజులపాటు కోతలు అమలవుతున్నాయి. నెలకు 12 రోజులన్నమాట. కోతలు లేకుండా ఎంఎస్‌ఎంఈలకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమయ్యే అదనపు విద్యుత్ కేవలం 400 మెగావాట్లు. అంటే రమారమీ 10 మిలియన్ యూనిట్లు (కోటి యూనిట్లు). ఈ మొత్తం అదనపు విద్యుత్‌ను రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ)ను దిగుమతి చేసుకోవడం ద్వారా పొందే వీలుంది. అందుకు యూనిట్‌కు రూ.10 ఖర్చు చేయాలి. యూనిట్‌కు రూ.10 చొప్పున.. 10 మిలియన్ యూనిట్లకు నెలలో 12 రోజుల పాటు కొనుగోలు చేస్తే అయ్యే మొత్తం రూ.120 కోట్లు మాత్రమే. మూడు నెలలకు ఖర్చు చేస్తే అయ్యే వ్యయం రూ.360 కోట్లు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. అధిక ధరను చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేసుకొమ్మంటూ పరిశ్రమలకు ఉచిత సలహా ఇస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై పరిశ్రమలు మండిపడుతున్నాయి. 2008-09లో విద్యుత్ కోతలను నివారించేందుకు ఏకంగా రూ.6 వేల కోట్ల మేరకు ఖర్చు చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ఆర్-ఎల్‌ఎన్‌జీతో పాటు నాఫ్తాను కూడా ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌కు రూ.12 నుంచి రూ.16 వరకు ఖర్చు చేసి విద్యుత్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కనీసం ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా అదనపు విద్యుత్‌ను పొందే ప్రయత్నం కూడా చేయడం లేదని పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు.

ఉన్న ఉద్యోగాలకే దిక్కులేదు.. కొత్త కొలువులు ఎట్లా?: వారంలో మూడ్రోజుల కోతలను నిరసిస్తూ ఈ నెల 12 నుంచి పరిశ్రమలను మూసేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో 20 లక్షల మందికిపైగా కార్మికుల కుటుంబాల పరిస్థితి డోలాయమానంగా ఉంది. పరిశ్రమలు మూతపడితే వీరందరికీ వేతనాలు లభించవు. ఇందులో ఉన్న కొద్దిపాటి రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే వేతనంలో 50 శాతం లభిస్తుంది. అయితే వీరి శాతం చాలా తక్కువ. మిగిలిన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలే అందవు. ఇలా ఓవైపు లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి ఉంటే.. ప్రభుత్వం మాత్రం రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోంది. అలాగే ఉన్న పరిశ్రమలకే విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయలేకపోతున్న ప్రభుత్వం.. అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ద్వారా అనేక కొత్త పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల విలువ రూ.6 లక్షల కోట్లు. ఈ అడ్డగోలు కరెంటు కోతల నేపథ్యంలో ఆ పరిశ్రమలన్నీ వాస్తవంగా పెట్టుబడులు పెట్టేది అనుమానమేనని పారిశ్రామికవేత్తలు అంటున్నారు.
Share this article :

0 comments: