రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యం

రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యం

Written By ysrcongress on Wednesday, March 21, 2012 | 3/21/2012

రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యం
ఈ ఏడాదికి కావాల్సింది రూ.3,600 కోట్లు
జీవోలిచ్చింది రూ.1,000 కోట్లకు మాత్రమే
ఇప్పటివరకు బ్యాంకులకు చేరింది ఇందులో సగమే
మరో 10 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
ఈ ఏడాదికి వెయ్యి కోట్లతోనే సరి!

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పేదవారి ఉన్నత చదువుకు భరోసా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో సర్కారు వ్యవహరిస్తున్న తీరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఫీజుల పథకానికి మొత్తం రూ. 3,600 కోట్లు అవసరం కాగా, ఆర్థిక సంవత్సరం మరో 10 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు రూ. 500 కోట్లకు మించి ట్రెజరీలను దాటి బ్యాంకులకు చేరలేదంటే నిధుల విడుదలలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. ఏడాది చివర్లో రూ.1,000.99 కోట్లకు జీవోలిచ్చిన ప్రభుత్వం ఆ మేరకు విద్యార్థులకు చేర్చడంలో కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. 

గత నెల రెండో తేదీన ఈ నిధులకు గాను బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (బీఆర్వోలు) రాగా, ఇప్పటివరకు అందులో సుమారుగా సగం మాత్రమే ట్రెజరీలను దాటి బ్యాంకులను చేరింది. మార్చి 20వ తేదీ తర్వాత నాలుగైదు రోజులు గడిస్తే వేతనాలు, పింఛన్లు మినహా మరే బిల్లులను ఆర్థిక శాఖ అంగీకరించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన బీఆర్వోల మేరకు మరో రూ.500 కోట్లు విడుదలవుతాయనుకున్నా.. ఇంతకుమించి అదనంగా ఒక్క రూపాయి కూడా ఈ ఏడాదిలో విద్యార్థులకందేలా లేదు. మరోవైపు పరీక్షలు సమీపిస్తున్నందున ఫీజులు కట్టాలంటూ కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు. 

మిగతావి ఎప్పుడో.. ఎలాగో!

ప్రస్తుతం విడుదల చేసిన నిధులు పోను ఇంకా రూ.2,600 కోట్లు విడుదల చేస్తేనే కానీ ఈ ఏడాదికి సరిపోవు. అయితే గత నెలలో జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అనంతరం సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాదికి కావాల్సిన నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో కొంత చెల్లించి, మిగిలింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 6న రూ.1,000 కోట్లకు బీఆర్‌వోలిచ్చారు. మార్చి 31లోపు మరోవిడత చెల్లిస్తామన్నా.. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ ఏడాది రూ. 2,250 కోట్లు చెల్లిస్తామని, మిగిలిన వాటి సంగతి తర్వాత చూస్తామని ప్రభుత్వవర్గాలు మొదటి నుంచీ చెపుతున్నాయి. ఈ లెక్కన అయినా మరో రూ.1,250 కోట్లకు ఈపాటికే బీఆర్‌వోలు వచ్చి ఉండాలి. కానీ ఇప్పటివరకు ఆ నిధుల విడుదల ఊసే లేదు సరికదా... ఇటీవల శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పితాని చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారి తీసింది. ఇప్పటివరకు రూ.1,200 కోట్లిచ్చామని, మరో రూ. 600 కోట్లను మార్చి నెలలో విడుదల చేసే ప్రతిపాదనలున్నాయని ఆయన చెప్పడం గమనార్హం. 

దీంతో అసలు రెండోవిడత నిధులు ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదని విద్యార్థి, సంక్షేమ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెండోవిడత నిధులకు గాను బీఆర్‌వోలు ఇప్పుడు ఇచ్చినా సకాలంలో వాటి బిల్లులు పంపడం సాధ్యం కాదని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మొదట్నుంచీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు ఇక్కట్ల పాలు కావలసి వస్తోందని సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫైనలియర్ విద్యార్థులకు పూర్తిస్థాయి ట్యూషన్ ఫీజు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ ఫైనలియర్ విద్యార్థులకు మాత్రం 100 శాతం ట్యూషన్ ఫీజు ఇస్తుండగా, బీసీ ఫైనలియర్ విద్యార్థులకు ఇప్పటివరకు మంజూరు చేసింది కేవలం 25 శాతమే కావడం గమనార్హం.
Share this article :

0 comments: