బాబుపై, కాంగ్రెస్ సీఎంలపై విచారణలు ఉండవట.. ఒక్క మహానేత వైఎస్‌పైనే చేయిస్తారట! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుపై, కాంగ్రెస్ సీఎంలపై విచారణలు ఉండవట.. ఒక్క మహానేత వైఎస్‌పైనే చేయిస్తారట!

బాబుపై, కాంగ్రెస్ సీఎంలపై విచారణలు ఉండవట.. ఒక్క మహానేత వైఎస్‌పైనే చేయిస్తారట!

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

* కాంగ్రెస్, టీడీపీలకు ఆ ఆలోచనే తప్ప ప్రజల గోడు పట్టడం లేదు 
* పరస్పర ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బాబు కుమ్మక్కు
* బాబుపై, కాంగ్రెస్ సీఎంలపై విచారణలు ఉండవట.. ఒక్క మహానేత వైఎస్‌పైనే చేయిస్తారట!

విడవలూరు నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విచారణ ఉండదట.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై అసలు విచారణే జరుపరట.. ఒక్క దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైనే విచారణ చేయిస్తారట.. ఇదీ! కాంగ్రెస్, టీడీపీ కలిసి చేస్తున్న కుట్ర. మహానేతను అప్రతిష్టపాలు చేయడానికి ఇద్దరూ ఒక్కటై ఆడుతున్న నాటకం’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికార, ప్రతిపక్షాల మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మండిపడ్డారు. కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం మూడో రోజున బుధవారం విడవలూరు మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలో పలుచోట్ల జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

రాష్ట్రంలో పరస్పర ప్రయోజనాల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి కోర్టుల్లో కేసులు వేయడం, వైఎస్‌పై ఎలా బురదజల్లాలా అని ఆలోచించడం తప్ప ప్రజల గోడు పట్టించుకోవడంలేదు. ఇద్దరూ కలిసి కుమ్మక్కై శాసనసభా సంఘాలు వేయిస్తున్నారు. అందులో కాంగ్రెస్, టీడీపీ సభ్యులను నియమించుకుని ఒక్క వైఎస్‌నే లక్ష్యంగా చేసుకుని విచారణలకు ఉపక్రమిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక ప్రజల గురించి ఆలోచించే నాయకులే కరువయ్యారు. ప్రతిపక్షం కూడా ప్రజల తరఫున పోరాడుతుందనుకుంటే అధికారపక్షంతో కుమ్మక్కయిపోయింది.

రెండే పార్టీలు ఉండాలట..
కాంగ్రెస్, టీడీపీ ఎలా ఆలోచిస్తున్నాయంటే.. రాష్ట్రం లో రెండే రెండు పార్టీలు ఉండాలట.. కాంగ్రెస్‌పై ప్రజలకు విసుగు కలిగితే టీడీపీని గెలిపించాలట.. టీడీపీపై విసుగు కలిగితే కాంగ్రెస్‌ను గెలిపించాలట.. రాష్ట్రంలో మూడో పార్టీ గానీ, మూడో వ్యక్తి గానీ ఉండనే ఉండొద్దు అని వీరిద్దరూ కుతంత్రాలు చేస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే అధికారపక్షం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసి కూడా నిన్నటి వరకూ మీ ఎంపీగా ఉన్న రాజమోహనన్న, మీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నన్న పదవులు వదులుకున్నారు. 

అధికారపక్షం తరఫున మంత్రులు డబ్బు మూటలతో దిగి ఆత్మీయానురాగాలను కూడా వేలం వేసి కొనే ప్రయత్నం చేస్తారు. పోలీసులతో కేసులు పెట్టిస్తారు, వేధిస్తారని తెలిసి కూడా విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి వారు పదవులను వదిలి వేసి ఎన్నికలకు సిద్ధమయ్యా రు. ఈ పోటీ ఇద్దరు వ్యక్తులకు మధ్య జరగడం లేదు. రైతు, రైతు కూలీలు ఓ పక్క ఉంటే కుళ్లు, కుతంత్రాలు మరో పక్క ఉండి పోటీపడుతున్నాయి. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. గ్రామాల్లో పేదవాడు ఎలా బతుకుతున్నాడో ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు కూడా అర్థం అయ్యేలా ఓట్లు వేయాలి.

జగన్ పర్యటన మరో రోజు పొడిగింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు పర్యటనను మరో రోజు పొడిగించారు. వాస్తవానికి సోమవారం ఇక్కడ జగన్ ప్రారంభించిన ప్రచారం బుధవారంతో ముగియాల్సి ఉంది. అయితే రోడ్‌షోకు అడుగడుగునా పార్టీ అభిమానులు భారీగా హాజరవడం, కరచాలనం చేసేందుకు పోటీపడడంతో పర్యటనషెడ్యూల్ కన్నా ఆలస్యంగా జరి గింది. దీంతో తొలిరోజు కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించలేకపోయారు. ఆ గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసేందుకుగాను ఇప్పటికే ఒక రోజు పర్యటన పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారం గురువారంతో ప్రచారం పూర్తి కావాల్సి ఉంది. అయితే.. జన తాకిడి దృష్ట్యా రెండు, మూడో రోజు షెడ్యూల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించడం వీలుకాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం విడవలూరు మండలం చౌకచెర్ల, దంపూరు, వావిళ్ల, దిన్నె గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, గంగవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

మూడోరోజూ అదే జోరు..
జగన్ మూడోరోజు బుధవారం విడవలూరు మండలంలో పర్యటించారు. ప్రచారం ఆద్యంతం జనహోరు మధ్య సాగింది. ఉదయం 9.30 గంటలకు ముదివర్తిలో ప్రారంభమైన జగన్ పర్యటన రాత్రి 9.30 గంటలకు దండిగుంటలో ముగిసింది. 12 గంటలపాటు ఏకబిగిన సాగిన ఈ పర్యటనలో విడవలూరు, ముదివర్తి, అన్నారెడ్డిపాళెం, రామతీర్థం, దండిగుంట తదితర గ్రామాల్లో జనం నీరాజనాలు పలికారు. జగన్‌తో పాటు రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్యతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో జిల్లా, స్థానిక నేతలు కూడా జగన్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు.

19 నుంచి గుంటూరులో ఓదార్పు
గుంటూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర ఈ నెల 19న గుంటూరు జిల్లాలో పునః ప్రారంభమవుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 19న జగన్ చిలకలూరిపేట పట్టణంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి యాత్ర కొనసాగిస్తారని తెలిపారు.
Share this article :

0 comments: