బస్సు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రేపు జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బస్సు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రేపు జగన్ పరామర్శ

బస్సు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రేపు జగన్ పరామర్శ

Written By ysrcongress on Wednesday, March 21, 2012 | 3/21/2012

ఖమ్మం జిల్లాలోని వాగులో పాఠశాల బస్సు బోల్తాపడిన దుర్ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఖమ్మం జిల్లాకు రానున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చందా లింగయ్య తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా నుంచి నేరుగా చండ్రుగొండకు వస్తారని.. పర్యటన వివరాలు బుధవారం పూర్తిస్థాయిలో వెల్లడిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 వేలు, గాయపడినవారికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో ఘోరం
మరో 15 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
మృతులంతా ఎల్‌కేజీ నుంచి 4వ తరగతి చదువుతున్నవారే
20 మంది చిన్నారులను కాపాడిన మేకల కాపరి
బస్సును క్లీనర్ నడపడమే ప్రమాదానికి కారణం
క్లీనర్ పరారు.. డ్రైవర్ గొంతుకోసిన గుర్తు తెలియని వ్యక్తులు
పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన తల్లిదండ్రులు

కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్: విషాదం.. పెను విషాదం..! ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగిపోయింది!! డ్రైవరు నిర్లక్ష్యం.. క్లీనరు అత్యుత్సాహం కారణంగా ముక్కుపచ్చలారని 9 మంది చిన్నారులు జల సమాధి అయ్యారు. స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిల్చారు. చనిపోయిన చిన్నారులంతా ఎల్‌కేజీ నుంచి నాలుగో తరగతి చదువుతున్నవారే. ఈ దుర్ఘటనలో మరో 15 మంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రాఘవాపురం పెద్దవాగులో స్కూలు బస్సు పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా డ్రైవరు నడుపుతున్న బస్సు స్టీరింగ్.. క్లీనర్ చేతిలోకి వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ఎలా జరిగింది..?

కొత్తగూడెం మండలంలోని వేపలగడ్డ గ్రామంలో ఉన్న ఎల్.వి.రెడ్డి మెమోరియల్ స్కూల్ బస్సు మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో 30 మంది పిల్లలతో వేపలగడ్డ నుంచి సుజాతనగర్, రాఘవాపురం గ్రామం మీదుగా చండ్రుగొండ మండలంలోని తుంగారం గ్రామానికి బయల్దేరింది. తుంగారం సమీపంలో రాఘవాపురం పెద్దవాగు వద్దకు చేరుకోగానే బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకుపోయింది. పిల్లలంతా హాహాకారాలు చేశారు. అయితే వారిని ఆదుకునేందుకు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో గుగులోతు మణికంఠ (6), చిన్నాల నవ్య (5), బర్మావత్ గణేష్ (5), బూడిద సంతోష్ (8), రాగోబోయిన సౌజన్య (6), అజ్మిరా శివ వరప్రసాద్ (8), ఇనుముల ప్రదీప్ (4), గుగులోతు కొండయ్య (5), సందీప్ ఉన్నారు. 

క్లీనరే ముంచాడు..

డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి క్లీనర్‌కు స్టీరింగ్ ఇవ్వడంతోనే ఘోరం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి బయట పడిన నవ్య అనే విద్యార్థి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత నగర్ వద్దకు రాగానే గతంలో పాఠశాల బస్సులో క్లీనర్‌గా పనిచేసిన శ్రీను బస్సు ఎక్కాడు. రాఘవాపురం వద్దకు వస్తుండగానే... బస్సు నడుపుతానంటూ డ్రైవరు వెంకటేశ్వర్లు నుంచి స్టీరింగ్ తీసుకున్నాడు. నిర్లక్ష్యంగా వేగంతో దూసుకెళ్లాడు. పెద్దవాగు వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి వాగులోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే క్లీనర్ పారిపోయాడు. చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించి డ్రైవర్ కూడా కొద్దిసేపు అక్కడే ఉండి అతను కూడా వెళ్లిపోయాడు.

నెంబరు లేని బస్సు.. మరమ్మతులు లేని బ్రిడ్జి

ప్రమాదానికి గురైన స్కూల్ బస్సుకు కనీసం నెంబర్ కూడా లేదు. అంతేకాక బ్రిడ్జి కూడా అవసాన దశకు చేరుకుంది. రెయిలింగ్ కూడా లేదు. పాఠశాలల బస్సుల కండిషన్, డ్రైవర్ల నైపుణ్యతను పరీక్షించాల్సిన ఆర్‌టీఏ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం, పాఠశాల యాజమాన్యం నైపుణ్యంగల డ్రైవర్లను పనిలో పెట్టుకోకపోవడం ప్రమాదానికి కారణమే.

క్రేన్లతో బస్సు బయటకు..

జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్, జిల్లా ఏఎస్పీ ప్రకాష్‌జాదవ్, కొత్తగూడెం ఏఎస్పీ భాస్కర్ భూషణ్, సింగరేణి డెరైక్టర్ టి.విజయకుమార్, సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం, సింగరేణిలోని ఓపెన్‌కాస్టు గనుల్లో ఉండే క్రేన్‌లను తెప్పించి వాగులో పడిన బస్సును బయటకు తీశారు. గజ ఈతగాళ్లు మృతదేహాలను వాగులో గాలించారు. వాగులో ఉన్న నీటిని మోటార్ల సాయం తో తోడారు. సాయంత్రం నుంచి సంఘటన స్థలంలో కలెక్టర్ సిద్దార్థ జైన్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 మంది విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం, గాయపడ్డ విద్యార్థులకు రూ.25 వేల పరిహారం అందజే స్తామన్నారు.

స్కూలును ధ్వంసం చేసిన తల్లిదండ్రులు..

స్కూల్ బస్సు వాగులో పడిన ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు అక్కడకు చేరుకొని పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల యాజమాన్యం ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన వారు.. స్కూలుపై దాడికి పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఖమ్మం, కొత్తగూడెం రహదారిని దిగ్భందించారు. అర్థరాత్రి 12 గంటల వరకు ఆందోళన కొనసాగింది.

20 మందిని కాపాడిన మేకల కాపరి..

‘‘మధ్యాహ్నం ఎండ మండి పోతోంది... మేకల మందకు నీళ్లు పెడదామని వాగు వద్దకు వచ్చాను... విమానం పడ్డట్టు బస్సు వాగులో పడిపోయింది... కొద్ది సేపు ఏం చేయాలో తోచలేదు... పిల్లలంతా రోదిస్తున్నారు... చేతిలో ఉన్న గొడ్డలి కర్రతో బస్సు ఎక్కి అద్దం పగలగొట్టా... నా చేతిలో ఉన్న కండువాను పిల్లలకు అందించా... 20 మంది వరకు పైకిలాగా.. అప్పటికే చనిపోయిన చిన్నారుల శవాలు తేలాయి... ’’ అని బాదావత్ సేత్యా చెప్పారు. చండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన సేత్యా బస్సు వాగులో పడిపోయే సమయంలో సమీపంలోనే ఉన్నాడు. ైధైర్యం చేసి చిన్నారులను కాపాడారు.

డ్రైవర్ గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తులు

విద్యార్థుల మృతికి కారణమయ్యాడంటూ ఎల్‌వీ రెడ్డి పాఠశాల బస్సు డ్రైవర్‌పై రాఘవాపురం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గొంతు కోశారు. చండ్రుగొండ మండలం రాఘవాపురం పరిధిలో పంట కాల్వలో పాఠశాల బస్సు పడి విద్యార్థులు మృతిచెందటంతో డ్రైవర్ అక్కడ నుంచి పరారై రాఘవాపురం సమీపంలో తిరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు.
Share this article :

0 comments: