కిలో 100 నోటు దాటిన వేరుశనగ నూనె ధర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిలో 100 నోటు దాటిన వేరుశనగ నూనె ధర

కిలో 100 నోటు దాటిన వేరుశనగ నూనె ధర

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

కూరగాయల ధరలు ఏకంగా రెండు మూడు రెట్లు పెరిగిన వైనం 
ఇవి సర్కారు సంస్థల లెక్కలే.. పత్తాలేని ధరల నియంత్రణ 
ఏడాదిలో భారీగా పెరిగిన సరుకుల రేట్లు కూరలు, ఉప్పు, పప్పు.. అన్నీ నిప్పులే

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎడాపెడా పన్నుల మోతలు, కరెంటు చార్జీల వాతలు, గ్యాస్ ధరల పెంపులతో... ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, వంట నూనెలు, కూరగాయలు ఏది ముట్టుకుందామన్నా చింత నిప్పుల్లా మండిపోతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు అందే పరిస్థితి లేకుండా ధరలు రోజురోజుకూ నింగికి ఎగబాకుతున్నాయి. ధరల పెరుగుతున్నాయనే విషయాన్ని ఒక పట్టాన ఒప్పుకోని మార్కెటింగ్, రైతు బజార్లు, పౌర సరఫరాల శాఖల అధికారిక నివేదికల ప్రకారమే నిత్యావసరాల ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. అన్ని సరుకుల ధరలు అమాంతంగా పెరుగుతున్నా వీటిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధరల తగ్గింపు లక్ష్యంగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కానీ కనీస మాత్రంగానైనా పట్టించుకోవటం లేదు.

కాగుతున్న నూనెలు..: వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. మూడు నెలల కిందట కాస్త తగ్గుముఖం పట్టిన వేరుశనగ నూనె మళ్లీ వేగంగా పెరుగుతోంది. పౌర సరఫరాల శాఖ లెక్క ప్రకారమే గత ఏడాది కిలో రూ. 78 ఉన్న వేరుశనగ నూనె సగటు ధర ఇప్పుడు రూ. 110కి పెరిగింది. ప్రభుత్వ పరంగా నియంత్రించే చర్యలు లేకపోవటంతో పచ్చళ్ల సీజను, ఉత్పత్తి తగ్గిందని సాకుగా చూపి ప్రైవేటు సంస్థలు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పామాయిల్ నూనె లీటరు ఏకంగా రూ. 59 పలుకుతోంది. 

బియ్యమూ భారమే..: ఓ మోస్తరు మంచి బియ్యం ధర గత ఏడాది కిలోకు రూ. 26 ఉండగా అది ఇప్పడు రూ. 31కి చేరింది. కిలో రూ. 23 ఉన్న సాధారణ బియ్యం ధర ఏడాదిలో రూ. 28 అయ్యింది. కరువు కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అంచనాల కన్నా 50 లక్షల టన్నులు తగ్గటంతో బియ్యం ధరల పెరుగుదల ఇలా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. 

పాలు ఇంకా ప్రియం..: గత ఏడాది రూ. 28 వరకు ఉన్న లీటరు పాల ధర ఇప్పుడు సగటున రూ. 28-30 పలుకుతోంది. ఇలా ధర పెరగటంతో ఏడాదిలోనే ఒక చిన్న కుటుంబంపై రూ. 120 అదనపు భారం పడుతోంది. 

ఉప్పు నిప్పయింది: ఏం వేసినా, వేయకున్నా సరే ఉప్పు లేనిది మాత్రం కూర కాదు. అయితే తక్కువ ధర అంటే వెంటనే గుర్తుకు వచ్చే ఉప్పు పరిస్థితి కూడా ఇప్పుడు మారిపోయింది. ఏడాది కిందట కిలో రూ. 6 ఉన్న సాధారణ ఉప్పు ధర ఇప్పుడు రూ. 11కు పెరిగింది. ఇక బ్రాండెండ్ ఉప్పు ప్యాకెట్ల సంగతి చెప్పే పరిస్థితేలేదు.

పప్పు ఎంతో బరువు..: మిగతా పప్పు ధరలకన్నా కాస్త అందుబాటులో ఉన్న శనగపప్పు ధరలు భారీగా పెరిగాయి. ఏడాది కిందట ఇదే సమయంలో కిలో రూ. 35 ఉన్న శనగపప్పు ధర ఇప్పుడు రూ. 48కి ఎగబాకింది. 

చేదెక్కిన చింతపండు..: సరుకులు, కూరగాయల ధరలకు భయపడి కాస్తంత సాంబారో, పులుసో చేసుకుందామంటే చింతపండు ధర మండిపోతోంది. ఏడాదిలోనే రూ. 63 నుంచి రూ. 71కి చేరింది చింతపండు ధర. 

అమ్మో! హోటల్ ఫుడ్డా?!: హోటళ్లకు అవసరమైన అన్ని సరుకుల ధరలూ భారీగా పెరిగాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతూనే చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ ధరను భారీగా పెంచాయి. 19 కిలోల సిలిండర్‌పై ఒకేసారి రూ. 226.50 అదనపు భారం వేశాయి. ఇలా చమురు సంస్థల భారీ వడ్డనతో నెల కిందట రూ. 1,677 ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,903కు పెరిగింది. ఇప్పటికే రాష్ట్రం వసూలు చేస్తున్న 5 శాతం వ్యాట్‌కు తోడు ఈ నెల నుంచి కేంద్రం సర్వీసు చార్జీలను 12 శాతానికి పెంచింది. దీంతో హోటల్‌లో టీ, టిఫిన్, భోజనం అన్నింటి ధరలూ అమాంతంగా పెరిగాయి. రాష్ట్ర సర్కారు తాజాగా ఇచ్చిన కరెంటు షాక్ ప్రభావం అప్పుడే పడింది. సాధారణ హోటల్‌లో మొన్నటి వరకు రూ. 25 ఉన్న ప్లేట్ భోజనం ఇప్పుడు రూ. 35కు పెరిగింది. ఫుల్ భోజనం రూ. 30 నుంచి 40కి చేరింది. మధ్యస్థాయి హోటల్‌లో ప్లేట్ మీల్స్ రూ. 40 నుంచి రూ. 60కి, ఫుల్ భోజనం రూ. 55 నుంచి 80కి పెరిగింది. సాధారణ హోటళ్లలో ఇన్నాళ్లు గరిష్టంగా రూ. 15 ఉన్న టిఫిన్ల ధరలు ఇప్పుడు రూ. 20కి చేరాయి. టీ పొడి ధరలు సగటున కిలో రూ. 200 పలుకుతుండడంతో సింగిల్ టీ ధర రూ. 5కి చేరింది. 

రైతన్నకు గిట్టుబాటు కరువు 

వినియోగదారులకు జేబులు ఖాళీ చేసే స్థాయిలో నిత్యావసరాలకు మార్కెట్‌లో ధరలు పలుకుతున్నా.. వీటిని ఉత్పత్తి చేసే రైతులకు లాభాలు అందించటం దేవుడెరుగు.. కనీసం గిట్టుబాటు కూడా కల్పించటం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత ధోరణి కారణంగా.. దళారులు, వ్యాపారులే లాభపడుతూ రైతులను నిండా ముంచేస్తున్నారు. రైతుల నిస్సహాయతను సొమ్ముచేసుకుంటూ వారి నుంచి గిట్టుబాటు ధరకన్నా అతి తక్కువకే దళారులు, వ్యాపారులు ఉత్పత్తులు కొంటున్నారు. అలా దోపిడీ చేసిన సరుకులను బహిరంగ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విక్రయిస్తూ రెండు రకాలుగా లాభపడుతున్నారు.

కూరలు కొంటే గాయాలే.. 
అన్ని రకాల కూరగాయలు ఏడాదిలోనే రెండు, మూడు రెట్లకు పెరిగిపోయాయి. పచ్చిమిర్చి గత ఏడాది కిలో రూ. 18 ఉండగా ఇప్పుడు రూ. 35కు పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో కిలో 8 రూపాయలుగా ఉన్న టమాటా ధర ఇప్పుడు రూ. 22కు ఎగబాకింది. రూ. 12 ఉన్న బెండ రూ. 38కి పెరిగింది. రూ.18 పలికిన దొండ ఇప్పుడు రూ. 30 పలుకుతోంది. రూ. 30 ఉన్న బీన్స్(ఫ్రెంచ్) ఇప్పుడు రూ. 60కి చేరింది. అన్ని రకాల కూరగాయల ధరలూ ఈ నెల రోజుల్లోనే 20 శాతం వరకు పెరిగాయి. కరువుకు తోడు కరెంటు కోతల కారణంగా డిసెంబర్ తర్వాత రైతులు కూరగాయల పంటలు వేయటం తగ్గించారు. కూరగాయలు పండించాలనుకున్న రైతులకు కూడా ఉద్యాన శాఖ సకాలంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయలేదు. బహిరంగ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విత్తనాలు తెచ్చి కరువుకు ఎదురీది పంటలు వేసేందుకు రైతులు ఆసక్తి చూపటంలేదు. దీంతో కూరగాయల పంటల విస్తీర్ణం బాగా తగ్గింది. గత ఏడాది రబీలో 4 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు వేయగా కరువు వల్ల ఈ ఏడాది 3.25 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. మండుతున్న ఎండలతో వేసినకొద్దీ పంటలు సైతం ఎండిపోతున్నాయి. ఫలితంగా సగటు ఉత్పత్తి తగ్గి డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రావటంలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవి ముదిరేకొద్దీ మే, జూన్ నెలల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
Share this article :

0 comments: