సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ.. తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ.. తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ.. తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012



షరతులతో కూడిన బెయిల్ మంజూరు.. విడుదల
బెయిల్‌ను అడ్డుకునేందుకే సీబీఐ చార్జిషీట్: కోర్టు వ్యాఖ్య
74 మంది నిందితుల్లో 13 మంది పైనే చార్జిషీట్ వేశారు
13 మందిలో ఒక్కరినే జైలులో పెట్టాల్సిన అవసరమేముంది?
అరెస్టు చేసి 90 రోజులు పూర్తయింది కాబట్టి బెయిల్‌కు అర్హుడే
ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి
సాయిరెడ్డి విడుదలను 16 వరకు ఆపాలని కోరిన సీబీఐ..
తిరస్కరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను అడ్డుకునేందుకే 74 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో కేవలం 13 మందిపై మాత్రమే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన మొదటి చార్జిషీట్‌లో 13 మందిని నిందితులుగా పేర్కొన్నా అందులో విజయసాయిరెడ్డి ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని, ఆయన్ను అరెస్టు చేసి ఇప్పటికే 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ పొందేందుకు అర్హుడని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. సాయిరెడ్డిని విడిచిపెడితే దర్యాప్తును అడ్డుకుంటారన్న సీబీఐ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసులో సాయిరెడ్డి రెండో నిందితుడు మాత్రమేనని, ఇందులో ఇతర నిందితులను సీబీఐ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇతర నిందితులు కూడా బలవంతులేనని, వారు దర్యాప్తును అడ్డుకోలేనప్పుడు సాయిరెడ్డి మాత్రమే అడ్డుకుంటారన్న వాదన సరైంది కాదని స్పష్టంచేశారు. దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి నాగమారుతి శర్మ తన తీర్పులో స్పష్టం చేశారు. రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించటంతో పాటు పాస్‌పోర్టు అప్పగించి బెయిల్ పొందాలని షరతు విధించారు. అలాగే అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సీబీఐ దర్యాప్తుకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సాయిరెడ్డిని ఆదేశించారు. పూచీకత్తు బాండ్లతోపాటు పాస్‌పోర్టును సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వెంటనే కోర్టుకు సమర్పించారు. దీంతో సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే.. బెయిల్ మంజూరు చేయటాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని.. కాబట్టి సోమవారం (16వ తేదీ) వరకూ సాయిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయకుండా ఆపాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. దీనిని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. కోర్టు సిబ్బంది బెయిల్ ఆర్డర్ కాపీలను రాత్రి 7 గంటలకు చంచల్‌గూడ జైలు అధికారులకు అందచేశారు. దీంతో.. జనవరి 2వ తేదీ నుంచి జైలులో విచారణ ఖైదీగా వున్న విజయసాయిరెడ్డి శుక్రవారం రాత్రి 7.45 గంటలకు విడుదలయ్యారు. మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించాలని ప్రయత్నించినప్పటికీ అప్పటికే జైలు ప్రధాన ద్వారం ముందు ఆగిన వాహనంలో సాయిరెడ్డి న్యాయవాదులతో కలిసి వెళ్ళిపోయారు.

సాక్ష్యాలు లేకున్నా అరెస్టు చేశారు: సుశీల్‌కుమార్ వాదన

అంతకుముందు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ సందర్భంగా.. ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. 2007 తర్వాత జగన్ కంపెనీలతో సాయిరెడ్డికి సంబంధమే లేదని, పెట్టుబడుల వ్యవహారాల్లో ఆయన పాత్ర లేదని కోర్టుకు తెలిపారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సాయిరెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ ఎటువంటి సాక్ష్యాలను సేకరించిందో తమకు తెలియదని, కీలక సాక్ష్యాలు ఉన్నాయని మాత్రమే ప్రతి సందర్భంలో సీబీఐ వాదిస్తోందని చెప్పారు. విచారణ పేరుతో ఎంత కాలం ఆయన్ను జైల్లో పెడతారని, దర్యాప్తు పూర్తి కావటానికి రెండేళ్లు పడితే అంత కాలం ఆయన్ను జైల్లో ఉంచాల్సిందేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు మంత్రులు, 14 మంది ఐఏఎస్ అధికారులకు పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నా.. ఈ కేసును ఏడు నెలలుగా విచారిస్తున్న సీబీఐ సాయిరెడ్డిని మినహా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. ‘‘సాయిరెడ్డి తమ నుంచి బలవంతంగా డబ్బు తీసుకున్నారని ఎవరైనా సీబీఐకి ఫిర్యాదు చేశారా? కంపెనీల నుంచి వచ్చిన డబ్బును జగన్ కంపెనీల్లో పెట్టించారని మాత్రమే సాయిరెడ్డిపై సీబీఐ ఆరోపించింది.

కుట్రతో సంబంధమేలేని సాయిరెడ్డి ఎంత కాలం జైల్లో ఉండాలి? అవసరం లేకపోయినా ఆయన్ను జైల్లో ఉంచి ఆయన హక్కులను హరిస్తున్నారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి ఇప్పటికి 100 రోజులు పూర్తయ్యింది. ఎంత కాలం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను సీబీఐ హరిస్తుంది? జగన్ కంపెనీల్లోకి రూ. 1,246 కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయని పేర్కొన్న సీబీఐ.. చార్జిషీట్‌లో కేవలం రూ. 19 కోట్లకు సంబంధించి మాత్రమే ప్రస్తావించింది. రూ. 1,246 కోట్లకు సంబంధించిన దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయటానికి సీబీఐకి ఏళ్ల సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. దర్యాప్తులో కొత్త విషయాలు, కొత్త వ్యక్తులకు సంబంధించిన పాత్ర ఉన్నప్పుడే దర్యాప్తు కొనసాగించేందుకు కోర్టు అనుమతించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. దురుద్దేశపూరితంగా సీబీఐ అసంపూర్తి ఛార్జిషీట్ దాఖలు చేసిందని వాదనలు వినిపించారు. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
Share this article :

0 comments: