నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు జూన్ 12న పోలింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు జూన్ 12న పోలింగ్

నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ సీట్లకు జూన్ 12న పోలింగ్

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012



మే 18వ తేదీన నోటిఫికేషన్ జారీ
బెంగాల్లో రెండు, మధ్యప్రదేశ్, త్రిపుర, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి జూన్ 12న ఎన్నికలు
కేరళ, గోవాల్లో 2 అసెంబ్లీ సీట్లకు జూన్ 2న పోలింగ్
అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు జూన్ 15న
మొత్తం 10 రాష్ట్రాల్లో 28 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ సీటుకు ఎన్నికల ప్రకటన
అధికారపార్టీ ఒత్తిళ్లను తోసిరాజని షెడ్యూలు
విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
మేలో ఎండల తీవ్రత దృష్ట్యానే జూన్‌లో పోలింగ్!
తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల తేదీపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల రణభేరి మోగింది. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి జూన్ 12న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మరో ఏడు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా అదే రోజు పోలింగ్ జరగనుంది. కేరళ, గోవాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 2వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈమేరకు 10 రాష్ట్రాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఈసీ మంగళవారం రెండు రకాల షెడ్యూళ్లు విడుదల చేసింది. కేరళ, గోవాల్లోని రెండు అసెంబ్లీ సీట్లకు ఒక షెడ్యూలును, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఒక పార్లమెంట్ స్థానం, 26 అసెంబ్లీ సీట్లకు మరో షెడ్యూలును విడుదల చేసింది. ఈ షెడ్యూళ్ల ప్రకారం... కేరళ, గోవాల్లో ఉప ఎన్నికలకు మే 9వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. జూన్ 2న పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మిగతా ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు మే 18న నోటిఫికేషన్ జారీ అవుతుంది. జూన్ 12న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మాత్రం అన్ని చోట్లా జూన్ 15వ తేదీనే జరుగుతుంది. జూన్ 18న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఉప ఎన్నికలు జరిగే ఈ రాష్ట్రాలన్నింటిలో ఎన్నికల నిబంధనావళి వెంటనే అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందుకు దివంగత మహా నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలు 17మందిపై స్పీకర్ వేటు వేశారు. ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, పరకాల, ఒంగోలు, నరసన్నపేట, పాయకరావుపేట (ఎస్సీ), అనంతపురం, ఎమ్మిగనూరు, రాయదుర్గం, కోడూరు (ఎస్సీ), ఉదయగిరి, నర్సాపురం, ప్రత్తిపాడు (ఎస్సీ), రామచంద్రాపురం, మాచర్ల, పోలవరం (ఎస్టీ) నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తిరుపతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చిరంజీవి రాజ్యసభకు ఎన్నికవడంతో ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చినందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. షెడ్యూలు జారీతో ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.


కంగుతిన్న కాంగ్రెస్:
 కేంద్ర ఎన్నికల సంఘం హఠాత్తుగా ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీని కంగు తినిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి కాంగ్రెస్ అనేక రకాల ప్రయత్నాలు చేసింది. సీబీఐ చార్జిషీట్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చేర్చడాన్ని నిరసిస్తూ పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాటిని ఆమోదించకుండా అధికారపార్టీ జాప్యం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై వేటు వేయడంలో తీవ్ర జాప్యం చేసింది. చివరకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయినప్పటికీ, ఈ నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు జరిగితే ఘోరపరాభవం తప్పదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలను సాధ్యమైనంత జాప్యం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఉప ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వ వర్గాలు బలవంతపెడుతుండటం, ఈ విషయమై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే షెడ్యూలు విడుదల చేస్తేనే మంచిదని ఈసీ భావించినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. మే రెండోవారంలో కానీ, జూన్‌లో కానీ షెడ్యూలు వస్తుందని, రాష్ట్రపతి ఎన్నికలోగా సీట్లను భర్తీ చేయరన్న ఆశలతో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులను ఈ పరిణామం కంగుతినిపించింది.

సంప్రదాయం కొనసాగింపు..: రాష్ట్రపతి ఎన్నికలోగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే సంప్రదాయాన్ని కొనసాగించే సంకల్పంతో ఈసీ ఈ షెడ్యూళ్లను జారీ చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికలపై కసరత్తు చేసిన అనంతరం మంగళవారం ఈసీ పూర్తిస్థాయి సమావేశం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషి, కమిషనర్లు వి.ఎస్.సంపత్, హెచ్.ఎస్.బ్రహ్మ పాల్గొన్న ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఏర్పాట్లను విసృ్తతంగా సమీక్షించారు. ఎన్నికల షెడ్యూలుకు తుది మెరుగులు దిద్ది మధ్యాహ్నం తర్వాత ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో వాతావరణ, స్థానిక పరిస్థితులు, విద్యార్థుల పరీక్షలు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత రెండు షెడ్యూళ్లను జారీ చేసినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పదవీకాలం జూలై24వ తేదీతో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు మే నెలాఖర్లో లేదా జూన్ మొదటి వారంలో షెడ్యూలు ప్రకటించాల్సి ఉన్నందున ఆలోగా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ఈసీ తొలుత భావించింది. కానీ, స్థానిక పరిస్థితులతో సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మే నెలకన్నా జూన్‌లో ఎన్నికలు నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చి ఆ ప్రకారమే షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. మే నెలలో తీవ్ర ఎండల కారణంగా పోలింగ్ శాతం బాగా తగ్గడంతోపాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతోనే జూన్ రెండో వారంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు ఈసీవర్గాల సమాచారం . జూన్ రెండో వారం చివరిదాకా పాఠశాలలకు కూడా సెలవులు ఉంటాయి కనుక ఎన్నికలకు ఇబ్బందులు ఏమీ ఉండవని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు నివేదించడంతో రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలులోగా భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలనే ఆలోచనను ఈసీ మార్చుకుందని తెలుస్తోంది. జూన్ రెండోవారానికల్లా పోలింగ్ ప్రక్రియను ముగించి 18వ తేదీకల్లా ఫలితాలు వెలువరిస్తే రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనడానికి అందరికీ అవకాశం లభిస్తుందన్న ఆలోచనతోనే ఈసీ ఈ షెడ్యూళ్లను ఇచ్చినట్టు చెబుతున్నారు. ఖాళీ స్థానాలను భర్తీ చేయకుండా రాష్ట్రపతి ఎన్నికకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున అలాంటి రిస్క్ తీసుకోకూడదని ఈసీ గట్టిగా నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఖాతరు చేయలేదని ఈసీవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలును, మంగళవారం పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూలును ప్రకటించిందని తెలిపాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశాలు ఉండటంతో వాటి సమాచారం వస్తుందేమోనని ఈసీ ఎదురుచూసింది. అలాంటి సమాచారమేదీ అందలేదు. దీంతో ఉప ఎన్నికల నగారా మోగించినట్టు తెలిసింది.

చర్చనీయాంశమైన అంతరం..: ఉప ఎన్నికల షెడ్యూళ్లలో పేర్కొన్న నోటిఫికేషన్ తేదీలు కొత్త చర్చకు తెరతీశాయి. సాధారణంగా షెడ్యూలు వెలువడిన వారం, పది రోజుల్లోపు నోటిఫికేషన్ జారీచేస్తారు. రాష్ట్రంతోపాటు ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈసారి అందుకు భిన్నంగా షెడ్యూలు విడుదలైన 25 రోజులకు.. అంటే మే 18న నోటిఫికేషన్ రానుంది. షెడ్యూలు ప్రకటనకు, నోటిఫికేషన్ జారీకి మధ్య ఇన్ని రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారనేది రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కూడా షెడ్యూలుకు, నోటిఫికేషన్‌కు 16 రోజుల వ్యవధినిచ్చి మే 9న జారీ చేయనున్నారు. షెడ్యూలు, నోటిఫికేషన్ మధ్య ఇంత అంతరం ఉండటానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా అని ఈసీ వర్గాలను ప్రశ్నించగా, వెసులుబాటు దృష్ట్యానే తేదీల నిర్ణయం జరిగింది తప్పించి ఇతరత్రా అంశాలేమీ కారణం కాదని తెలిపాయి.
Share this article :

0 comments: