25% అబద్ధాలు.. 75% బురద - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 25% అబద్ధాలు.. 75% బురద

25% అబద్ధాలు.. 75% బురద

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ‘ఈనాడు’ పాట్లు
-‘హిందుజా’పై ఆద్యంతమూ అసత్యాల రాతలు
- 75% కరెంటును అమ్ముకునేందుకు హిందుజా ప్రయత్నాలు మొదలెట్టిందే 2009 నవంబర్‌లో..
- ఈ విషయాన్ని అప్పట్లో మొదటిపేజీలోనే ప్రముఖంగా ప్రచురించిన ‘ఈనాడు’.
- అలా అమ్ముకునేందుకు 2009 నవంబర్లో వైఎస్సే అనుమతించారంటూ తాజాగా తప్పుడు రాతలు
- 2009 సెప్టెంబర్‌లోనే వైఎస్ మరణించిన వాస్తవాన్ని కూడా పట్టించుకోని వైనం
-100% కరెంటును రాష్ట్రానికే ఇవ్వాలని 2009 జూలైలో వైఎస్ నిర్ణయం తెలిసి కూడా ఆ విషయాన్ని కనీసం ప్రస్తావించని ‘ఈనాడు’
- 2007లో సీఎస్ తీసుకున్న నిర్ణయానికే వైఎస్‌నిర్ణయంగా వక్రభాష్యం.

‘కింద పడ్డా పైచేయి నాదే’నన్న రీతిలో గత మూడు రోజులుగా హిందుజా వ్యవహారంలో ‘ఈనాడు’ పడరాని పాట్లు పడుతోంది. దీనిపై ‘వెలుగులోకి చీకటి కోణం’ అంటూ ఈనాడు రాసిన కథనం సత్యదూరమని, హిందుజాకు సంబంధించిన 100 శాతం విద్యుత్తూ రాష్ట్రానికే ఇవ్వాలంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశం ‘మినిట్స్’తో సహా సవివరంగా సాక్షి నిరూపించింది. అయినా ‘మేళ్లు నిజమే’ శీర్షికన గురువారం వైఎస్‌పై మరోసారి ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. తద్వారా తన నైజాన్ని నిరూపించుకుంది. 

హిందుజాకు అనుకూలంగా 2007లోనే వైఎస్ నిర్ణయం తీసుకున్నారంటూ తాను రాసిన అబద్ధపు కథనాన్ని సమర్థించుకునేందుకు నానాపాట్లూ పడుతున్న ‘ఈనాడు’ ఆ క్రమంలో తాజాగా అన్ని పరిధులనూ అతిక్రమించేసింది. 2009 సెప్టెంబర్ 2న మరణించిన వైఎస్, హిందుజా ఒత్తిడికి తలొగ్గి, 75 శాతం విద్యుత్‌ను అది అమ్ముకోవచ్చంటూ 2009 నవంబర్‌లో నిర్ణయం తీసుకున్నారంటూ తల తిరుగుడు రాతలు రాసేసింది! ‘ఈనాడు’ తాలూకు వైఎస్ వ్యతిరేక పైత్యం ఆ స్థాయికి వెళ్లింది! 

ఇంతా చేసి, 75 శాతం విద్యుత్‌ను అమ్ముకునేందుకు 2009 నవంబర్ 9 దాకా హిందుజాకు అనుమతే ఇవ్వలేదని గతంలో ఈనాడు పత్రికే స్వయంగా పేర్కొంది. ఈ మేరకు ‘కరెంటంతా అమ్ముకుంటాం’ శీర్షికన 2009 నవంబర్ 9 సంచిక తొలి పేజీలోనే ప్రముఖంగా వార్తను ప్రచురించింది. 75 శాతం విద్యుత్‌ను అమ్ముకునేందుకు అనుమతించాలంటూ హిందుజా ఒత్తిళ్లు తెస్తోందని, ఆ మేరకు విధి విధానాల రూపకల్పనలో ఇంధన శాఖ బిజీగా ఉందని అందులో పేర్కొంది! అదీగాక, హిందుజా 100% విద్యుత్‌ను రాష్ట్రానికే ఇవ్వాలంటూ 2009 జూలై 22న జరిగిన సమావేశంలో వైఎస్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.

కానీ ఆయన మరణానంతరం కేవలం 25 శాతం విద్యుత్‌ను మాత్రమే రాష్ట్రానికిచ్చేలా రోశయ్య సర్కారుపై హిందుజా ఒత్తిళ్లు తేవడం ప్రారంభించింది. ఈ వాస్తవాలన్నీ పూర్తిగా తెలిసి కూడా, కేవలం వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయాలన్న ఏకైక ఎజెండాతో అబద్ధపు ప్రచారానికి ‘ఈనాడు’ నిస్సిగ్గుగా తెరతీసింది. ఆయనపై అసత్య ఆరోపణలు చేసే క్రమంలో ఎంతటి నైచ్యానికైనా దిగజారుతానని మరోసారి నిరూపించుకుంది.

75 శాతం విద్యుత్‌ను హిందుజాకిచ్చేలా 2007లోనే వైఎస్ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు కొత్తగా ఒప్పందం జరిగిందనీ ఈనాడు నెత్తీనోరూ బాదుకుంటున్న వైనం నవ్వు పుట్టించక మానదు. ఎందుకంటే 25 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికి ఇవ్వడానికి మాత్రమే అంగీకరిస్తూ 2007లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో సమావేశమైన కమిటీ నిర్ణయం తీసుకుంది.

కానీ దాన్ని వైఎస్ పూర్తిగా వ్యతిరేకించారు. మొత్తం కరెంటును రాష్ట్రానికే ఇవ్వాలని 2009లో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు హిందుజా కూడా అంగీకరించింది. 2009 జూలై 22న జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది. దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం పాలయ్యారు. అనంతరం కేవలం 25 శాతం విద్యుత్తే ఇచ్చి మిగతా 75 శాతాన్ని అమ్ముకుంటామంటూ రోశయ్య ప్రభుత్వంపై హిందుజా ఒత్తిళ్లు తేవడం ప్రారంభించింది.

‘కరెంటంతా అమ్ముకుంటాం’ శీర్షికన 2009 నవంబర్ 9 సంచిక తొలి పేజీలో ఈ విషయాన్ని స్వయంగా ఈనాడే ప్రముఖంగా ప్రచురించింది. ఇలా సొంత రాతలను కూడా విస్మరించి అంకమ్మ శివాలు వేయడం ‘ఈనాడు’కు కొత్తేమీ కాదు. వైఎస్‌పై రాసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ మరిచి పూర్తిగా బరితెగించడమూ దానికి కొత్త కాదు. కాకపోతే, మొత్తంగా 25 శాతం విద్యుత్‌ను మాత్రమే హిందుజా రాష్ట్రానికిచ్చేలా 2007లోనే నిర్ణయం జరిగిందంటూ పదేపదే మొత్తుకోవడం వెనక... పరోక్షంగా ఆ సంస్థకు సహకరించాలన్న కుట్ర కూడా ఈనాడు రాతల్లో దాగున్నట్టు కన్పిస్తోంది. వైఎస్‌పై బురదజల్లే క్రమంలో, 780 మెగావాట్లు పరిమాణానికి సమానమైన 75 శాతం హిందుజా విద్యుత్ రాష్ట్రానికి దక్కకుండా పోయేరీతిలో ‘ఈనాడు’ వ్యవహరిస్తున్న వైనమూ తేటతెల్లమవుతోంది. 

భూమిని వెనక్కెందుకు తీసుకోలేదు బాబూ?

విశాఖలో నెలకొల్పాల్సిన 1,040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 1992లో హిందుజాకు అప్పగించారు. ఈ మేరకు 1992 జూలై 17న హిందుజాతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)కి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. దానికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కూడా కుదిరింది. ఎంవోయూ మేరకు 1996-97 నాటికి విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులను హిందుజా పూర్తి చేసి, విద్యుదుత్పత్తినీ ప్రారంభించాలి. కానీ అప్పటికి హిందుజా విద్యుత్ ప్లాంటును నిర్మించనే లేదు. 

ఈ నేపథ్యంలో దానికి కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఆ పని చేయలేదు. ఆ భూమిని వెనక్కి తీసుకుని, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను జెన్‌కోకు అప్పగించాలని 2002లోనే కాగ్ సూచించినా పెడచెవిన పెట్టారు! తర్వాత ప్లాంటు నిర్మాణం చేపడతామంటూ 2005లో హిందుజా మళ్లీ ముందుకొచ్చింది. సింహాద్రి విస్తరణ ప్లాంటు-2 ధరకు రాష్ట్రానికి 100 శాతం విద్యుత్ ఇచ్చేలా 2009లో వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. 

100 శాతమిస్తేనే ప్లాంటు నిర్మాణ బాధ్యతలిస్తామని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా తొలి పీపీఏను మారుస్తూ రెండో పీపీఏను కుదుర్చుకోవాల్సి ఉంది. వైఎస్ మరణంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ‘ఈనాడు’ మాత్రం కొత్త ఒప్పందం కుదిరిందని అడ్డంగా వాదిస్తోంది. కానీ అలాంటి కొత్త ఒప్పందమేదీ కుదరలేదు. కాబట్టే హిందుజా సంస్థ ఇప్పుడు రాష్ట్రానికి కేవలం 25 శాతం కరెంటే ఇస్తానంటూ మొండికేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అచ్చం డూడూ బసవన్న మాదిరిగా దాని ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. న్యాయ సలహా ఇవ్వాలంటూ ఏజీని ఆశ్రయిస్తోంది. 

కొత్త ఒప్పందమేది రామోజీ?

హిందుజా విద్యుత్ ప్రాజెక్టుతో 2007లో కొత్త ఒప్పందం కుదిరిందన్న ‘ఈనాడు’ మాటలు శుద్ధ అబద్ధమని రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ (ఏజీ) చెప్పిన విషయం గమనిస్తే అర్థమవుతుంది. హిందుజాతో కొత్తగా పీపీఏ కుదుర్చుకోవాలంటే పాత పీపీఏను రద్దు చేసుకోవాల్సి ఉం టుందని 2010 సెప్టెంబర్ 9న ఇచ్చిన నివేదికలో అప్ప టి ఏజీ డీవీ సీతారాం మూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 2010 నవంబర్ 9 దాకా హిందుజాతో కొత్తగా ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. కానీ ‘ఈనాడు’కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. 25% విద్యుత్ మాత్రమే రాష్ట్రానికిచ్చేలా 2007లోనే కొత్త ఒప్పందం కుదిరిం దంటూ తనదైన శైలిలో ఎల్లో రాతలు రాస్తూ ఆనందిస్తోంది! 

ఇదీ ‘హిందుజా’ చరిత్ర!
- 1991లో ప్రారంభమైన సరళీకరణ ప్రక్రియ నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పెంచేందుకు 8 ఫాస్ట్‌ట్రాక్ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చింది. వాటిలో రాష్ట్రంలోని హిందుజా ప్రాజెక్టు కూడా ఒకటి.
- 1994లో నాటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కంపెనీకి 1,100 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.
- ఈ ప్రాజెక్టులకు రాష్ట్రం గ్యారంటీ, కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయి. ఈ మేరకు 1994లో పీపీఏ కుదిరింది.
- అనంతరం పీపీఏకు అనుగుణంగా ప్రాజెక్టు పనులను హిందుజా చేపట్టలేకపోయింది. దాంతో ప్రాజెక్టు స్థాపన కార్యక్రమం నుంచి అది వైదొలిగినట్టేనని అంతా భావించారు.
- మొదట్లో కుదుర్చుకున్న పీపీఏ కాల పరిమితి 2001 నాటికి ముగిసింది
- హిందుజాకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకుని జెన్‌కోకు కేటాయించాలన్న కాగ్ సూచనలకు నాటి సీఎం చంద్రబాబు ససేమిరా అన్నారు
- కంపెనీకి కేటాయించిన 1,100 ఎకరాలను బాబు ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదు. పీపీఏలను కూడా రద్దు చేయలేదు.
- దశాబ్దం దాటాక హిందుజా మళ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చింది. మొత్తం కరెంటును రాష్ట్రానికిస్తేనే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలప్పగిస్తామని వైఎస్ తెగేసి చెప్పారు. అందుకు హిందుజా అంగీకరించింది.
- కేవలం 25 శాతం విద్యుత్‌ను ఇచ్చేందుకు అంగీకరించాలంటూ వైఎస్ మరణానంతరం రోశయ్య, తర్వాత కిరణ్ సర్కార్లపై ఢిల్లీ స్థాయిలో హిందుజా ఒత్తిళ్లు తేవడం ప్రారంభించింది. వాటికి తలొగ్గుతూ రెండు ప్రభుత్వాలూ ఏజీ అభిప్రాయం కోరాయి.
Share this article :

0 comments: