మత్స్యకారులు మరణించినప్పుడు అక్కాచెల్లెమ్మలను ఆదుకునేలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మత్స్యకారులు మరణించినప్పుడు అక్కాచెల్లెమ్మలను ఆదుకునేలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

మత్స్యకారులు మరణించినప్పుడు అక్కాచెల్లెమ్మలను ఆదుకునేలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

వేటకెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు
ఆ అక్కా చెల్లెళ్లను వెంటనే ఆదుకుంటా: వైఎస్ జగన్


* ఎక్స్‌గ్రేషియా అందించే విషయంలో ఈ ప్రభుత్వంలా నాన్చుడు ఉండదు
* మత్స్యకారుడు గల్లంతైన వారంలోపు రూ.50 వేలు ఇస్తాం
* మిగతా నాలుగున్నర లక్షల రూపాయలు ఆరు నెలల్లోపు అందిస్తాం
* సముద్రంలోకి కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలు పెట్టనివ్వం
* కాలుష్యం రాని ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు అందులో 80 శాతం ఉద్యోగాలు స్థానికులు, మత్స్యకారులకు ఇప్పిస్తాం
* అధికారంలోకొచ్చిన ఏడాదిలోపే బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తాం
* బడికి వెళ్లే చిన్నారికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు తల్లి ఖాతాలో రూ.వెయ్యి వేస్తాం
* ఈ హామీ చాలా గొప్పది.. దీన్ని సవాలుగా తీసుకొని అమలు చేస్తా

నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘మత్స్యకారులు రోజూ సముద్రంలో వేటకు పోతారు.. వెళ్లిన మత్స్యకారులు మళ్లీ తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితిలో ఆ అక్కాచెల్లెమ్మలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఒకవేళ వారు తిరిగి రాకపోతే ఆ అక్కాచెల్లెమ్మల పరిస్థితి ఏమిటీ అని ఆలోచించినపుడు బాధనిపిస్తోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక మత్స్యకారుల గురించి పట్టించుకునేవారే లేకుండాపోయారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇవాళ నేను ప్రతి మత్స్యకార సోదరుడికీ హామీ ఇస్తున్నా.. త్వరలోనే ఒక సువర్ణయుగం వస్తుంది..

ఆ సువర్ణయుగంలో.. ఏ మత్స్యకారుడైనా వేటకు వెళ్లి తిరిగి రాని పరిస్థితి వచ్చినప్పుడు.. ఆ అక్కాచెల్లెమ్మలకు అండగా ఓ మంచి అన్నయ్య మీకు ముఖ్యమంత్రి స్థానంలో కనపడతాడు. ఆ అక్కాచెల్లెమ్మలను ఆదుకునేలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే ప్రకటిస్తానని హామీ ఇస్తున్నా’ అని జగన్ ఉద్ఘాటించారు. ఎక్స్‌గ్రేషియా అందించే విషయంలో ఈ సర్కారులా ఏళ్లపాటు నాన్చే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. మత్స్యకారుడు గల్లంతైన విషయం తెలిసిన వారం రోజుల్లోపే ఆ కుటుంబానికి రూ. 50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని, ఆ తర్వాత ఆరు నెలల్లోపు మిగిలిన రూ.4.5 లక్షలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉప ఎన్నికలు జరగనున్న నరసాపురం నియోజకవర్గంలో ఆయన బుధవారం నుంచి మలి విడత ప్రచారం నిర్వహించారు. నరసాపురం పట్టణంలోని స్టేషన్‌పేట నుంచి రోడ్ షోను ప్రారంభించిన ఆయన పీచుపాలెం, ముస్కేపాలెం, లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, దర్భరేవు, వేములదీవి తూర్పు, బియ్యపుతిప్ప, సర్దుకొడప గ్రామాల్లో పర్యటించారు. వేములదీవి తూర్పులో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

మత్స్యకారులకు 80 శాతం ఉద్యోగాలిప్పిస్తా..
మత్స్యకార సోదరులు నివసించే ప్రాంతంలో ఫ్యాక్టరీలు వెలుస్తున్నప్పుడు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం సముద్రంలో కలిసి చేపలు చనిపోతాయనే ఆందోళన ప్రతి మత్స్యకారుడికీ ఉంది. మా ప్రభుత్వం వచ్చాక ఇలాంటి భయాలు లేకుండా చేస్తాం. పొరపాటున సముద్రం దగ్గర ఫ్యాక్టరీ వస్తే.. దాన్నుంచి ఏమాత్రం కాలుష్యం కూడా సముద్రంలోకి పోకుండా చూస్తానని హామీ ఇస్తున్నా. మన దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి.. వాళ్లు వేరే ఊరి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు.

అంతేకాదు.. వారికేమో ఎక్కువ జీతాలు.. మనవారికేమో తక్కువ జీతాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేస్తాం. ఆ మేరకు రెండు నిబంధనలు పెడతాం. ఒకటి సముద్రంలోకి కాలుష్యం వెళ్లే ఫ్యాక్టరీలు ఇక్కడ రాకూడదు. ఒకవేళ కాలుష్య రహిత ఫ్యాక్టరీలు పెట్టాల్సి వస్తే.. అందులో 80 శాతం ఉద్యోగాలు మన ఊరి వాళ్లకే, మత్స్యకారులకే ఇవ్వాలని నిబంధన పెడతాం. అలాగే ఈ ప్రాంతానికి(బియ్యపుతిప్ప) సంబంధించి ఫిషింగ్ హార్బర్ అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంవత్సరంలోపే మీకు హార్బర్ నిర్మించి ఇస్తానని హామీ ఇస్తున్నా. 

ఇది నాకు సవాల్..
ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు మంచి అన్నయ్యలా ఇంకో విషయం కూడా చెప్తున్నా.. మనం పేదరికం నుంచి బయటపడాలీ అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరన్నా ఇంజనీరో, డాక్టరో కావాలి.. లేదంటే కలెక్టర్‌లాంటిఉన్నత చదువులు చదవాలి. అలా చదివి వారు ఎంతో కొంత సంపాదిస్తేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతారుు. దీనికోసం ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆకాశం నుంచి గర్వపడేలా ఒక హామీ ఇస్తున్నా. వచ్చే సువర్ణయుగంలో ఏ అక్కా, చెల్లీ తన పిల్లల్ని చదివించడానికి బాధపడే పరిస్థితి ఉండదు.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ పిల్లల్ని మీరు బడికి పంపించండి చాలు.. వారిని నేను చదివిస్తాను. ఆ పిల్లల్ని నేను చేస్తా ఇంజనీర్లుగా.. నేను చేస్తా డాక్టర్లుగా.. నేను చదివిస్తా కలెక్టర్ లాంటి పెద్ద చదవులను అని భరోసా ఇస్తున్నా. ప్రతి స్కూలులో ఇంగ్లిషు మీడియం పెట్టడమే కాదు.. పిల్లల్ని బడికి పంపినందుకు చిన్నారికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరేసి పిల్లలకు రూ.1,000 తల్లి ఖాతాలో వేస్తానని హామీ ఇస్తున్నా.

అన్నింటికంటే ఈ హామీ చాలా గొప్పదని, దీన్ని అమలు చేయడంలో చాలా కష్టాలు ఉంటాయని నాకు తెలుసు. మాట తప్పని నా గుణానికి ఇది ఒక పరీక్ష అని నాకు తెలుసు. కానీ దీన్ని నేను ఒక చాలెంజ్‌గా తీసుకుని అమలు చేసి చూపిస్తానని ప్రతి అక్కాచెల్లికి నేను చెప్తున్నా. నేను ఏ రోజైతే దీన్ని అమలు చేస్తానో ఆ రోజు ఈ పిల్లలు చదవగలుగుతారు. అలా చదివి వారు ఇంజనీర్లు, డాక్టర్లు అయినప్పుడు ఆ మహానేత రాజశేఖరరెడ్డి ఆకాశం నుంచి నన్ను చూసి గర్వపడతారు.

ఇంకా అధ్యయనం చేస్తాం..
రాబోయే రోజుల్లో ఇంకా అధ్యయనం చేస్తాం. ఎంతగా అధ్యయనం చేస్తామంటే.. నేను చనిపోయిన తర్వాత నాన్న ఫొటో పక్కనే నా ఫొటో కూడా పెట్టుకునేంతలా అధ్యయనం చేసి పథకాలు ప్రవేశపెడతానని హామీ ఇస్తున్నా.

ఏ పేదవాడి ముఖాన చిరునవ్వు లేదు..
ఇవాళ ఒక్కసారి రాష్ట్రంవైపు తిరిగిచూస్తే ఏ పేదవాడి ముఖాన చిరునవ్వు లేదు. ఏ పేదవాడి దగ్గరకైనా వెళ్లి ఇంట్లో చదువుకుంటున్న పిల్లాడిని అడిగితే.. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తుందో ఇవ్వదోనన్న భయంతో చదువుతున్నానన్నా అని అంటున్నాడు. 108కు ఫోన్‌చేస్తే 20 నిమిషాల్లో వచ్చి పేదవాడిని పెద్దాసుపత్రికి క్షణాల్లో తీసుకెళ్లి లక్షల ఖర్చయ్యే వైద్యమైనా ఉచితంగా చేయించాలన్న స్వప్నంతో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

ఇప్పుడు 108కు ఫోన్ చేస్తే.. డీజిల్ లేదనో, రిపేరులో ఉందనో సమాధానం వస్తోంది. ఆరోగ్య శ్రీ నుంచి 135 దాకా రోగాలను తొలగించి ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసింది. కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా పల్లం గ్రామంలో మత్స్యకారులు నివాసముంటున్న దాదాపు 600 ఇళ్లు కాలిపోయాయి. బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. ఒక గ్రామం గ్రామం కాలిపోతే.. వారిని పరామర్శించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి రాలేదు.. 

ముఖ్యమంత్రికే కాదు ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడికీ రాలేదు. పేదవాడు బాధపడుతున్నా వారి గురించి పట్టించుకోరు.. పేదవాడికి ఇల్లు లేకపోయినా పట్టించుకోరు.. నీళ్లు లేకపోయినా, కరెంటు రాకపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ఎవరు ఎలా పోయినా ఫర్వాలేదు.. సోనియాగాంధీని ప్రసన్నం చేసుకుంటే చాలనే పరిస్థితిలో పాలకులున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పేదలకు, రైతులకు అండగా నిలిచి ఎమ్మెల్యే పదవులను సైతం త్యాగం చేసిన ప్రసాద్(నర్సాపురంలో పార్టీ అభ్యర్థి ఎం.ప్రసాదరాజు) సహా 17 మంది ఎమ్మెల్యేలను చూసి నేను గర్వపడుతున్నా. 

వల వేస్తూ.. కొబ్బరి కాయ వలుస్తూ..
మర్రితిప్పలో కొబ్బరి వలుపు కార్మికులు పని చేసుకుంటుం డగా అక్కడికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డివారితో మాట్లాడారు. ‘అన్నా మీ పరిస్థితి ఎలా ఉంది? ఆదాయం ఎంత వస్తుంది.. ఏడాదిలో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి?’ అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వయంగా గునపానికి కొబ్బరికాయను గుచ్చి వలిచారు. గ్రామంలో యాదవులు జగన్‌మోహన్‌రెడ్డికి గొర్రె పిల్లల్ని కానుకగా ఇచ్చారు. పీచుపాలెంలో మత్స్యకార మహిళలు తమ కష్టాలను ఆయనకు వివరించారు. మత్స్య సంపద దొరకడంలేదని, రుణాలు ఇప్పించాలని కోరారు. 

మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వేములదీవి ఈస్ట్ గ్రామం కాలువలో ఒక మత్స్యకారుడు వల వేసి చేపలు పడుతుండగా చూసి ఆగిన జగన్.. ‘తాతా.. చేపలు బాగా పడుతున్నాయా.. వల ఎలా వేస్తావు?’ అని అడిగారు.. దీంతో ఆ వృద్ధుడు వల వేసే విధానాన్ని చూపించగా జగన్ వల విసిరారు. ఆ సమయంలో కాలువ నీళ్లలో పిల్లలు ఆయన్ను చూసి కేరింతలు కొడుతుండడంతో ‘అందరికీ ఈత వచ్చా.. బాగా చదువుకోవాలి’ అని సూచించారు.
Share this article :

0 comments: