గోదాములు దొరక్క విశాఖ ఓడరేవులో మూలుగుతున్న 75 వేల టన్నుల ఎరువులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గోదాములు దొరక్క విశాఖ ఓడరేవులో మూలుగుతున్న 75 వేల టన్నుల ఎరువులు

గోదాములు దొరక్క విశాఖ ఓడరేవులో మూలుగుతున్న 75 వేల టన్నుల ఎరువులు

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012



గోదాములు దొరక్క విశాఖ ఓడరేవులో మూలుగుతున్న 75 వేల టన్నుల ఎరువులు
వెంటనే త రలించాలని ఒత్తిడి తెస్తున్న ఓడరేవు అధికారులు
ఇతర రాష్ట్రాలకు మళ్లించాల్సి వస్తుందంటున్న క్రిభ్‌కో, ఇఫ్కో
వచ్చే ఖరీఫ్‌లో ఎరువుల కోసం దుకాణాల ముందు మళ్లీ బారులు?
గోదాములు దొరక్క మార్క్‌ఫెడ్ సతమతం

హైదరాబాద్, న్యూస్‌లైన్: గత ఖరీఫ్‌లో ఒక్క యూరియా బస్తా కోసం రైతులు దుకాణాల ముందు బారులు తీరారు.. రోడ్లెక్కి ఆందోళనలు చేశారు.. లాఠీ దెబ్బలు సైతం తిన్నారు.. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా సర్కారు కళ్లు తెరవలేదు. ఫలితంగా ఈసారి ఖరీఫ్‌లో కూడా ఎరువుకు కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కు అవసరాల కంటే అదనంగా ఎరువుల కేటాయింపు కోసం ప్రయత్నించాల్సిన ప్రభుత్వ పెద్దలు అదేమీ చేయలేదు. దీంతో రాష్ట్రం అడిగినదాని కంటే కేంద్రం 1.95 లక్షల టన్నుల ఎరువులకు కోత పెట్టింది. ఇలా తక్కువగా ఇచ్చిన కేటాయింపులను తీసుకోవడంలోనూ ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించేందుకు అత్యవసర నిల్వలను సమకూర్చుకోలేకపోతోంది. అత్యవసరాల ఎరువులు ఇస్తాం తీసుకోండంటూ కంపెనీలు అడుగుతున్నా గోదాములు లేక ఇప్పుడు తీసుకోలేమంటూ చేతులెత్తేస్తోంది!

కళ్లు తెరవదు.. పాఠం నేర్వదు..!

రాష్ట్రంలో రైతులకు అదనులో ఎరువులు దొరక్కపోవడానికి ప్రధాన కారణం... డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. డిమాండ్ తక్కువగా ఉన్న ఏప్రిల్, మేలలో కంపెనీల నుంచి ఎరువులను తీసుకుని నిల్వ చేయాలి. వాటిని అదనులో రైతులకు సరఫరా చేయాలి. రెండు నెలల్లో ఖరీఫ్ మొదలు కానున్న తరుణంలో ఎరువుల నిల్వపై ఇప్పటికే ఏర్పాట్లు చేయాలి. కానీ ఇప్పుడు కేంద్రం కేటాయించిన ఎరువులు నిల్వ చేసుకునేందుకే గోదాములు దొరకడంలేదు. దీంతో ఎరువులను సరఫరా చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర సర్కారు వాటిని తీసుకునే పరిస్థితి లేదు. అత్యవసర నిల్వ కోసం క్రిషక్ భారతి సహకార సమాఖ్య (క్రిభ్‌కో), భారత రైతుల ఎరువుల సమాఖ్య (ఇఫ్కో)లు రాష్ట్రానికి తాజాగా 75 వేల టన్నుల ఎరువులు కేటాయించాయి. ఇవి విశాఖపట్నం ఓడరేవుకు చేరి మూడురోజులు గడుస్తోంది. గోదాములు ఖాళీ లేకపోవడంతో రాష్ట్ర సర్కారు వాటిని తీసుకోవడంలేదు. ఇలాగే ఆలస్యం చేస్తే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించాల్సి వస్తుందని క్రిభ్‌కో, ఇఫ్కోలు చెబుతున్నాయి. ఈ కోటాను వచ్చే నెలలో ఇస్తామని పేర్కొంటున్నాయి. ఓడరేవు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఎరువులను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు క్రిభ్‌కో, ఇఫ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఎక్కడ నిల్వ చేయాలి...?

జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ కోసం 43.50 లక్షల టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర సర్కారు కోరగా కేంద్రం 41.55 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే సుమారు రెండు లక్షల టన్నులను తగ్గించడంతో ఇప్పటికే రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండేళ్లుగా ప్రతి ఖరీఫ్‌లో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం కేటాయించిన మొత్తం ఎరువుల్లో 10 శాతం మేర అత్యవసరాల కింద నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోటా కింద సేకరించే ఎరువుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే యూరియా 2 లక్షల టన్నులు, లక్ష టన్నుల డీఏపీ, లక్ష టన్నుల కాంప్లెక్సు ఎరువులు ఉండాలని భావించింది. నాలుగు లక్షల టన్నుల ఎరువులను కంపెనీల నుంచి సేకరించి అత్యవసర సమయాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా రైతులకు పంపిణీ చేసే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్)కు అప్పగిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీటి ఆధారంగా మార్క్‌ఫెడ్ ఎరువుల నిల్వ ప్రక్రియను మొదలుపెట్టింది. క్రిభ్‌కో, ఇఫ్కోలు మార్క్‌ఫెడ్‌కు ఎరువులు ఇవ్వడానికి అంగీకరించాయి. మార్క్‌ఫెడ్ ప్రతిపాదించిన వెంటనే తొలి దశలో 75 వేల టన్నుల ఎరువులు కేటాయించాయి. రాష్ట్రంలో ఎక్కడా ఖాళీ గోదాములు లేకపోవడంతో మార్క్‌ఫెడ్ ఈ ఎరువులను తీసుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో... గోదాములు సమకూర్చాలని కోరుతూ మార్క్‌ఫెడ్ తాజాగా సర్కారుకు విన్నవించింది.

చేతులెత్తేసిన గిడ్డంగుల సంస్థలు..

ఎరువుల నిల్వకు గోదాముల కోసం సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, కేంద్ర గిడ్డంగుల సంస్థ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తమ పరిధిలోని గోదాములన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఎఫ్‌సీఐ హమాలీల సమ్మెతో ఇప్పట్లో ఖాళీ అయ్యే పరిస్థితి లేదని కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోదాములను పరిశీలించి నిల్వకు అనుకూలంగా ఉన్న వాటిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. సరుకులు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం వల్లే మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోదాముల్లో కొన్ని ఖాళీగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఎరువులను నిల్వ చేస్తే జరిగే నష్టాలకు తమను బాధ్యులుగా చేస్తారనే ఆందోళనలో మార్క్‌ఫెడ్ అధికారులు ఉన్నారు
Share this article :

0 comments: