సంగారెడ్డి, హైదరాబాద్ అల్లర్లపై వైఎస్ జగన్ ఆవేదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంగారెడ్డి, హైదరాబాద్ అల్లర్లపై వైఎస్ జగన్ ఆవేదన

సంగారెడ్డి, హైదరాబాద్ అల్లర్లపై వైఎస్ జగన్ ఆవేదన

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

సంగారెడ్డిలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో జగన్ పర్యటన

రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం అన్యాయం
ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి.. మనందరిలో ప్రవహించే రక్తం ఒక్కటే
నా కంటే ముందు సీఎం ఇక్కడికి వచ్చుంటే సంతోషించేవాడిని
సీఎం గారూ.. మీరొచ్చి ప్రజలకు మేమున్నామనే భరోసా ఇవ్వండి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి
పదివేలిచ్చి చేతులు దులుపుకోకుండా.. నష్టపోయిన మేర పరిహారమివ్వండి
సంగారెడ్డి(మెదక్), న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు, అగాధం సృష్టించేందుకు రాష్ట్రంలో ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి ఘటనలకు పాల్పడటం కంటే హేయమైన చర్య మరోటి ఉంటుందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఇటీవల అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. అల్లర్లలో నష్టపోయిన వారిని పేరు పేరునా పరామర్శించారు. ‘‘ఇలాంటి ఘటనలు సంగారెడ్డిలో ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ జరిగిన వెంటనే హైదరాబాద్‌లోనూ అల్లర్లు సృష్టించారు. రాజకీయ లబ్ధి కోసం పథకం ప్రకారం విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకోవడం అన్యాయం. ఇలా లబ్ధిపొందాలనుకునే ఆలోచనకు స్వస్తి పలకాలి. మతమేదైనా మనందరిలో ప్రవహించే రక్తం ఒకటే. అందరమూ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాం. మనలో చిచ్చుపెట్టి, ద్వేషం పెంచడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నించారు.
సీఎం వచ్చుంటే సంతోషించేవాడిని..

‘నేను రాకముందే ఇక్కడికి సీఎం వచ్చి ఉంటే.. మీకు మేమున్నాం.. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చి ఉంటే చాలా సంతోషపడేవాడిని. ఆయన ఇక్కడకు రావడానికి గంటసేపు పడుతుందేమో.. అయినా కూడా రాకపోవడం దారుణం’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం గారూ..! చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నా. ఒకసారి సంగారెడ్డికి వచ్చి చూడండి. మేమున్నామనే భరోసా ఇవ్వండి. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా బతకాలనే ఆలోచన మళ్లీ వారిలో రేకెత్తించండి’ అని కోరారు.

ఎంత నష్టపోతే.. అంత పరిహారమివ్వండి..: ‘70, 80 దుకాణాల్లో విధ్వంసం జరిగింది. దాదాపు కోటిన్నర రూపాయల నష్టం జరిగింది. సుమారు 400 మంది మూకుమ్మడిగా దుకాణాలను ఎంపిక చేసుకుని మరీ దాడులకు పాల్పడ్డారు. కేవలం పదివేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. బాధితులు ఎంత నష్టపోతే అంత మేర.. పది లక్షలైతే పది లక్షలు.. నాలుగు లక్షలైతే నాలుగు లక్షల మేర పరిహారం చెల్లించాలి. దాంతోపాటు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని భరోసా ఇవ్వాలి. పునరావృతం కాకుండా చూడాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.

చూసీ చూడనట్లు వదిలేస్తే రాష్ట్రం నష్టపోతుంది

‘సాక్షాత్తూ పోలీసుల ఎదుటే విధ్వంసం ఘటనలు జరిగినట్లు సాక్షులు చెప్తున్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగితే కొంత మందిని అరెస్టు చేసి తిరిగి విడుదల చేశారు. ఇలా చేస్తే గొడవలు సద్దుమణుగుతాయా? హైదరాబాద్‌కు ఇలాంటి గొడవలు విస్తరించాయి. ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చూసీ చూడనట్లు వదిలేస్తే రాష్ట్రం చాలా నష్టపోతుంది’ అని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పర్యటనలో జగన్ వెంట బాజిరెడ్డి గోవర్దన్, హెచ్.ఎ.రహమాన్, కె.కె.మహేందర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాజ్‌సింగ్ ఠాకూర్, కొండా రాఘవరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, శివకుమార్, బి.జనార్దన్‌రెడ్డి, బట్టి జగపతి, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పట్లోల్ల ప్రతాప్‌రెడ్డి, జశ్వంత్ కుమార్, శ్రవణ్ కుమార్ రెడ్డి, అంజిరెడ్డి, కె.అమృత సాగర్, సురేష్‌రెడ్డి, నేమూరి నవీన్‌గౌడ్, రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.

చేయీ చేయీ కలిపి..

సంగారెడ్డి అల్లర్లలో పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న మాజిద్ పాన్ డబ్బా, పక్కనే ఉన్న బుచ్చప్ప చెప్పుల దుకాణం దహనమయ్యాయి. సోమవారం వారిని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అపోహలు వీడి కలిసుండాలని కోరుతూ వారిద్దరినీ ఒకరి చేతిలో మరొకరి చెయ్యేసి కలిపారు. ‘జనం సాక్షిగా మీరు ఇలాగే కలిసి మెలసి ఉండాలి. హిందూ-ముస్లింల మధ్య అగాథం సృష్టించేందుకు కొంత మంది అల్లర్లు రేకెత్తించారు. అన్ని వర్గాల వారు సంయమనం పాటించాలి. అందరూ ఐకమత్యంగా ఉండాలి’ అంటూ ఆయన బుచ్చప్ప, మాజిద్ చేతులను పెకైత్తారు. అంతా కలిసే ఉంటామంటూ అక్కడున్న వారు అనడంతో జగన్ సంతోషం వ్యక్తంచేశారు.
Share this article :

0 comments: