మళ్లీ తేల్చండి, విజయసాయిరెడ్డి బెయిల్‌పై సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ తేల్చండి, విజయసాయిరెడ్డి బెయిల్‌పై సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం

మళ్లీ తేల్చండి, విజయసాయిరెడ్డి బెయిల్‌పై సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012



బెయిల్ మంజూరుకు ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలు హేతుబద్ధంగా లేవని వెల్లడి.. బెయిల్ ఉత్తర్వులు రద్దు
సోమవారం లొంగిపోతానని, అదే రోజు కేసును విచారించాలని హైకోర్టును కోరిన సాయిరెడ్డి
సానుకూలంగా స్పందించిన హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు విషయాన్ని మళ్లీ తేల్చాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై నిర్ణయం తీసుకొనే సమయంలో అందుకు తగిన కారణాలను వివరించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను శుక్రవారం తీర్పునిచ్చారు. ఇదే సమయంలో సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ స్పందిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సోమవారం సాయిరెడ్డి సీబీఐ కోర్టు ముందు లొంగిపోతారని, ఈ కేసును అదే రోజు విచారించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని అభ్యర్థించారు. ఇందుకు జస్టిస్ భాను సానుకూలంగా స్పందించారు. హైకోర్టు ఉత్తర్వులు సోమవారం ఉదయం ప్రత్యేక న్యాయస్థానానికి చేరతాయని, తరువాత మీరు తదనుగుణంగా స్పందించవచ్చునని న్యాయమూర్తి తెలిపారు.

ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలను విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. బహిరంగ కోర్టులో దాదాపు 40 నిమిషాలపాటు న్యాయమూర్తి తీర్పు పాఠాన్ని చదివారు. ఇరుపక్షాల వాదనలు, చార్జిషీట్‌లోని పలు అంశాలను తీర్పులో ప్రస్తావించారు. ఏ సమయాల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేయవచ్చన్న విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను, అవి ఏ విధంగా ఈ కేసులో వర్తిస్తాయనే విషయాన్ని వివరించారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన కారణాలు హేతుబద్ధంగా లేవని అభిప్రాయపడ్డారు. బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
Share this article :

0 comments: