తమ సమస్యలను పట్టించుకొనే నాయకుడు తమ ఊరికొచ్చాడంటూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తమ సమస్యలను పట్టించుకొనే నాయకుడు తమ ఊరికొచ్చాడంటూ

తమ సమస్యలను పట్టించుకొనే నాయకుడు తమ ఊరికొచ్చాడంటూ

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహం..తమ సమస్యలను పట్టించుకొనే నాయకుడు తమ ఊరికొచ్చాడంటూ రైతులు, కూలీలు,చేతివృత్తిదారుల్లో ఉప్పొంగిన ఆనందం.. తాము పడుతున్న బాధలు,ఇబ్బందులను ప్రియతమనేతకు, ఆత్మబంధువుకు ఎదురేగి చెప్పుకోవాలనే ఆరాటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నియోజకవర్గంలో నాలుగోరోజున పర్యటించిన ప్రతి ఊరులోనూ, వాడలోనూ జనం వెల్లువలా ఆయన్ను అనుసరించారు. వికలాం గులు,వృద్ధులు, యువకులు, మహిళలు జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు.

బుట్టాయగూడెం/జీలుగుమిల్లి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నియోజకవర్గంలో మంగళవారం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని 24 గ్రామాల్లో పర్యటించారు. బుట్టాయగూడెం మండలం విప్పలపాడు, రామారావుపేట జంక్షన్, రెడ్డిగణపవరం, జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం మీదుగా జొన్నవారిగూడెం, తాడువాయి, దర్భగూడెం, జీలుగుమిల్లి, అంకంపాలెం, కామయ్యపాలెం గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కొయ్యలగూడెంలో భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 

బుట్టాయగూడెం మండలంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వగ్రామమైన దుద్దుకూరు నుంచి రోడ్‌షో ప్రారంభమైంది. దారిపొడవునా జనం ఎదరొచ్చి జననేతకు స్వాగతం పలికారు. విప్పలపాడులో వికలాంగుడు మడివి బుజ్జిదొరను జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు. స్థానిక మహిళలను అప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరన్నపాలెం చర్చిలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు.

రామారావుపేట జంక్షన్ వద్ద తన కోసం నిరీక్షిస్తున్న జనంతో మాట్లాడారు. వనుము లక్ష్మి, గౌరమ్మ అనే ఇద్దరు వృద్ధులకు పింఛన్ వస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. కర్రెడ్లగూడెం మీదుగా రెడ్డిగణపవరం చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రైతులు , కూలీలు , విద్యార్థులు తమ సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డికి ఏకరువు పె ట్టారు. ఆరోగ్య శ్రీ సేవలు అందక తాము ఇ బ్బందులు పడుతున్నామని పలువురు రోగులు ఆయన వద్ద వాపోయారు. 

విలువలు , విశ్వసనీయతకు కట్టుబడిన బాలరాజును ఆశీర్వదించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ముల గలంపల్లిలో నార్గన విజయలక్ష్మి అనే మహిళ తాము నిరుపేదలమని విన్నవించుకున్నా, ఇందిరమ్మ పథకంలో నిర్మించుకున్న ఇంటికి రూపాయి బిల్లుకూడా అధికారులు చెల్లించలేదని వాపోయింది. రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. 

వైఎస్ హయాంలో రూ. 160 నేడు రూ. 120

రెడ్డిగణపవరంలో స్థానిక రైతు నాయకుడు అల్లూరి రంగారావు ఇంట్లో పొగాకు రైతులతో జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపుమాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పొగాకు కిలో రూ. 160 ఉండగా, నేడు ఈ ప్రభుత్వ హయాంలో రూ. 110 నుంచి రూ. 120కు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. 

పేరుకు ఏడు గంటలు, ఇచ్చేది ఐదు గంటలే

వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్‌సరఫరా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం వాస్తవానికి ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదని స్వర్ణవారిగూడెంకు చెందిన రైతులు బిక్కిన కృష్ణారావు, గూడవల్లి రామకృష్ణ వాపోయారు. 

కాంగ్రెస్ , టీడీపీల నుంచి పలువురు చేరిక

రెడ్డిగణపవరంలో తెలుగుదేశం పార్టీ నుంచి అల్లూరి రంగారావు, గద్దె వీరకృష్ణ, అల్లూరి రత్నాజీ, అల్లూరి సోమేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఇరపా సూర్యలక్ష్మి, పసుమర్తి వీరకృష్ణ, గద్దె ప్రసాద్, పాలడుగుల శ్రీను, గన్నిన సురేష్, అల్లూరి శివకుమార్, గద్దె బ్రహ్మానందంలతో పాటు సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నాయకులకు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

తాడువాయి జంక్షన్ వద్ద చల్లవారిగూడెంకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాడువాయి శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి మాజీ చైర్మన్ అలవాల గోపాలకృష్ణ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో చల్లవారిగూడెం, తాడువాయి, ఎ.పోలవరం గ్రామాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెడ్డిగణపవరం సమీపంలో ఖమ్మం జిల్లా పార్టీ కన్వీనర్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య ఆధ్వర్యంలో వాజేడుకు చెందిన టీడీపీ నాయకులు డి.ప్రసాదరాజు, కాంగ్రెస్‌కు చెందిన ఎ.కృష్ణమూర్తిరాజు(కృష్ణబాబు)లకు పార్టీ కండువాలు వేసి జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానించారు. 

విగ్రహాల ఆవిష్కరణ

బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. బుట్టాయగూడెం మండలం రౌతుగూడెం, కనకాపురం, జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి, లక్ష్మీపురం, దర్భగూడెం, కామయ్యపాలెం, అంకంపాలెం తదితర గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆవి ష్కరించారు. 

చిన్నారులకు నామకరణం

కర్రెడ్లగూడెం సమీపంలో మోహిని అనే మహిళ తన కుమారుడిని తీసుకుని వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డితో వైఎస్సార్ అని నామకరణం చేయించింది. రెడ్డిగణపవరంలో కొత్తురు జ్యోతి అనే మహిళ తనకుమార్తెకు విజయమ్మ అని జగన్‌మోహన్‌రెడ్డితో పేరు పెట్టించింది. 

లక్ష్మీనారాయణ కుటుంబానికి పరామర్శ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని మృతిచెందిన జీలుగుమిల్లి మండలం ములగలంపల్లికి చెందిన గరగ రమాదేవి కుటుంబాన్ని జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శిం చారు. గతంలో జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించిన సమయంలో వీలుకాకపోవడంతో ఆయన స్వయంగా ఆ ఇంటికి వెళ్లి రమాదేవి భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె దుర్గను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

ఓదార్పు యాత్ర సమయంలో తాను లక్ష్మీపురం వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశామన్నారు. అప్పట్లో ఆయన ‘‘నేనే మీ ఇంటికి వస్తానమ్మా’’ అని మాట ఇచ్చారని, ఇప్పుడు స్వయంగా తమ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని లక్ష్మీనారాయణ ఉబ్బితబ్బిబ్బ య్యారు. ఇచ్చిన మాట మరువకుండా జగన్‌మోహన్‌రెడ్డి తమ ఇంటికి రావడం ఆయన మడమతిప్పని నైజానికి నిదర్శనంగా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తమ ఇంటికి రావడం మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని రమాదేవి కుమార్తె దుర్గ ఆనందం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: