రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది

రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012



రాజకీయ పార్టీల గుర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పు
తీర్పుతో విభేదించిన జస్టిస్ చలమేశ్వర్

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది. న్యాయమూర్తులు అల్తమాస్ కబీర్, ఎస్.ఎస్.నిజ్జార్, జాస్తి చలమేశ్వర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం 2-1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. ఈసీ అనుసరిస్తున్న విధానంలోని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు రాష్ట్రాల్లోని పలు గుర్తింపు పొందని ప్రాంతీయ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు పొందడంతో పాటు కనీసం రెండు అసెంబ్లీ సీట్లు సాధించిన రాజకీయ పార్టీలకు ఈసీ గుర్తింపు మంజూరు చేస్తోంది. అయితే రాష్ట్రానికి చెందిన ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీతో పాటు బహుజన్ వికాస్ అఘడి, దేశీయ ముర్పోక్కు ద్రవిడ ఖజగం తదితర పార్టీలు.. గతంలో తమకు కేటాయించిన గుర్తును ఈసీ మార్చడాన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లన్నిటినీ పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈసీ అనుసరిస్తున్న విధానం అర్థంలేనిదేమీ కాదని పేర్కొంటూ బుధవారం వాటిని తోసిపుచ్చింది.

‘రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకున్నప్పుడు ఉమ్మడి గుర్తు కేటాయింపుతో పాటు గుర్తింపు వల్ల కలిగే అన్ని ప్రయోజనాలూ ఆ పార్టీకి లభిస్తాయి’ అని ధర్మాసనం పేర్కొంది. అయితే జస్టిస్ చలమేశ్వర్ ఈసీ విధానంతో విభేదిస్తూ అసమ్మతి తీర్పు రాశారు.

గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల వర్గీకరణలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీలు పాలిస్తున్నప్పుడు, మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందనే విషయం తెలుసుకోవడంలో ఈ కోర్టు విఫలమైనట్టేనన్నారు. లేనిపక్షంలో రాజ్యాంగంలోని 14వ అధికరణం కల్పిస్తున్న హక్కుకు అర్థం లేదన్నారు. ప్రజాస్వామ్యంలోనూ అంకెలే ముఖ్యమనుకుంటే.. హిట్లర్ కూడా గొప్ప ప్రజాస్వామ్యవాదేనని జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: