ఎన్ని చార్జి షీట్లు దాఖలు చేస్తారు?,జగన్ కేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు సూటి ప్రశ్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్ని చార్జి షీట్లు దాఖలు చేస్తారు?,జగన్ కేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు సూటి ప్రశ్న

ఎన్ని చార్జి షీట్లు దాఖలు చేస్తారు?,జగన్ కేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు సూటి ప్రశ్న

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

ఇంకా ఎన్ని చార్జిషీట్లు పెడతారు? 12, 13 పెడతారా? 
అనేక చార్జిషీట్లు పెట్టడానికి చట్టం అనుమతిస్తుందా? 
ఒకే నేరానికి ఎన్ని శిక్షలు ఉంటాయి?.. 
ఇంకా దర్యాప్తు జరుగుతోందంటే.. 
జగన్‌ను మొదటి నిందితుడిగా ఎందుకు చేర్చారు?.. 
ఒకవైపు దర్యాప్తు పూర్తయిందంటారు.. 
మరోవైపు కొనసాగుతోందంటారు? 
జీవోలున్నాయి.. పెట్టుబడుల వివరాలున్నాయి.. 
ఇంకా కొత్తగా దర్యాప్తు చేసేదేముంది? 
సాయిరెడ్డిని ఎన్ని రోజులు జైల్లో పెడతారు?
సీబీఐకి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రశ్నల పరంపర 
ప్రాణాలకు భయం ఉంటే రాజీనామా చేయవచ్చని వ్యాఖ్య 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి.. ఆయనను ఎన్ని చార్జిషీట్లలో నిందితుడిగా చేర్చుతారని సీబీఐని ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఎన్ని చార్జిషీట్లు పెడతారో చెప్పాలని సీబీఐని అడిగింది. ఒకవైపు దర్యాప్తు పూర్తయిందంటూనే మరోవైపు దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ చెప్తుండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారో నిర్ణీత గడువు చెప్పగలరా అని ప్రశ్నించింది. వైఎస్ ప్రభుత్వం కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఇచ్చినట్లు చెప్తున్న జీవోలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడిపెట్టిన వారి వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా కొత్తగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించింది. జగన్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణ తీరుపై న్యాయమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు తీరుపై ఆయన సీబీఐకి ప్రశ్నలు సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సీబీఐ వైపు నుంచి సరైన సమాధానం రాలేదు. న్యాయమూర్తి ప్రశ్నలివీ... 

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా భూకేటాయింపులు, ఇతర ప్రయోజనాలు కల్పించిందని ఆరోపిస్తున్నారు... వీటికి సంబంధించిన అన్ని జీవోలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిపొందిన కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వివరాలు తెలుసుకదా. అలాంటప్పుడు సీబీఐ ఇంకా దర్యాప్తులో తేల్చేది ఏముంటుంది? 
వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటున్నారు? కుట్ర ఒక్కటే అయినప్పుడు వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉందా? 

జగన్‌ను ఎన్ని చార్జిషీట్లలో నిందితునిగా చేరుస్తారు? ఇంకా ఎన్ని 12 లేదా 13 దాఖలు చేస్తారా? 4 లేదా 5 దాఖలు చేస్తారా? ఒకే నేరానికి ఎన్ని శిక్షలు ఉంటాయి? వేర్వేరుగా కుట్ర జరిగిందని చెప్తూ అనేక చార్జిషీట్లు దాఖలు చేయటానికి చట్టం అనుమతిస్తుందా? 

ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నప్పుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మొదటి నిందితునిగా పెడుతూ చార్జిషీట్ ఎందుకు దాఖలు చేశారు? విచారణ పూర్తయిందని ఒకవైపు చెప్తూ మరోవైపు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు? 

జీవోలు, పెట్టుబడిదారుల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందా? ఈ కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుంది? నిర్ణీత గడువు చెప్పగలరా? అంటూ సీబీఐని ప్రశ్నించారు.

కాగా, గుజరాత్‌లో జరిగిన హైస్పీదడ్ డీజిల్ కుంభకోణం కేసులో 100 చార్జిషీట్‌లు దాఖలు చేశారని.... దినేష్ దాల్మియా కేసును సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్పీ వెంకటేశ్‌లు కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్ కేసులో వేర్వేరుగా కుట్రలు జరిగాయని దర్యాప్తు ఆధారంగా పలు చార్జిషీట్లను దాఖలు చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా చార్జిషీట్లు కోర్టుకు సమర్పిస్తామని వివరించారు. 

ప్రాణభయం ఉంటే.. రాజీనామా చేయొచ్చు...

సీబీఐ అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి నాగమారుతిశర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి ఎవ్వరూ పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు నేనైనా, మీరైనా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవనం సాగించటం మంచిదని సూచించారు. ఇటువంటి వాదన చేయటం సరైంది కాదని తేల్చిచెప్పారు. ఒకేసారి మూడు పెద్ద కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో తమపై సీబీఐపై తీవ్రమైన పనిభారం ఉందని జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా నివేదించారు. సరైన సిబ్బంది లేకపోయినా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దర్యాప్తు జాప్యం జరుగుతున్నది వాస్తవమే అయినా.. వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించి చార్జిషీట్లు కోర్టుకు సమర్పిస్తామన్నారు.
Share this article :

0 comments: