సీఎం పనితీరేం బాగోలేదు: గవర్నర్ నివేదిక! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం పనితీరేం బాగోలేదు: గవర్నర్ నివేదిక!

సీఎం పనితీరేం బాగోలేదు: గవర్నర్ నివేదిక!

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

రాష్ట్రంలో సాధారణ పరిపాలనా సాగటం లేదు 
సీఎం కిరణ్ రొటీన్ ఫైళ్లనూ పట్టించుకోవట్లేదు 
ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు 
రోజువారీ పాలనపైనా నిర్ణయాలు చేయట్లేదు 
దీనివల్ల ఉన్నతాధికారుల్లో నిస్తేజం నెలకొంది 

పాలనే లేదన్న భావన ప్రజల్లో కలుగుతోంది 
కేంద్ర పెద్దలకు ఇచ్చిన నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది... రొటీన్‌గా సాగాల్సిన సాధారణ పరిపాలన కూడా సాగటం లేదు... ముఖ్యమంత్రి పనితీరు ఏ మాత్రం బాగోలేదు...’ - ఈ మాటలు అన్నది ఎవరో సామాన్యుడు కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధినేత గవర్నర్! ప్రభుత్వంలో రొటీన్‌గా సాగాల్సిన పాలన కూడా పూర్తిగా కుంటుపడిపోయిందని.. దీనికంతటికీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలే కారణమని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కేంద్ర పెద్దలకు నివేదిక రూపంలో వివరించినట్లు కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. సీఎం పనితీరుపై పలువురు మంత్రులు, పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చి చేరటంతో పార్టీ అధిష్టానం అసలు రాష్ట్రంలో పాలన ఎలా ఉందనే దానిపై గవర్నర్ నుంచి నివేదికను కోరినట్లు తెలిసింది. ఆ మేరకు.. ముఖ్యమంత్రి పనితీరు, పాలనా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై గవర్నర్ ఇటీవల కేంద్ర పెద్దలకు నివేదిక సమర్పించినట్లు ఢిల్లీలో తెలియవచ్చింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలతో పాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు చెందిన ఫైళ్లపై రొటీన్‌గా సంతకం చేయాల్సిన సీఎం అందుకు భిన్నంగా నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారని.. రోజు వారీ పాలనా వ్యవహారాలపై కూడా నిర్ణయాలు తీసుకోవటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని కూడా గవర్నర్ పేర్కొన్నట్లు తెలిసింది. సీఎంకు ఫైలు వెళితే ఆ ఫైలు ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పలేని స్థితిలో ఉన్నామనే ధోరణి మంత్రుల్లోనే వ్యక్తం అవుతోందని.. దీనినిబట్టి పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం అవుతోందని గవర్నర్ తన నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. గవర్నర్ నరసింహన్ తొలి నుంచీ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ నేరుగా అధికారులతో పాటు మంత్రులతోనూ సంప్రదింపులు జరపటం తెలిసిందే. ఇప్పుడు కూడా పాలనా వ్యవహారాలు, సీఎం పనితీరుపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి పలు విషయాల్లో సమాచారాన్ని సేకరించి మరీ గవర్నర్ నివేదికను రూపొందించి కేంద్ర పెద్దలకు సమర్పించినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా జరగాల్సిన చిన్న చిన్న అంశాలపై కూడా సీఎం నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని, దీనివల్ల మొత్తం రాష్ట్ర పాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఉన్నతాధికారుల్లో నిస్తేజం నెలకొందని కూడా గవర్నర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులు అసలు రాష్ట్రంలో పాలనే లేదనే భావనను సాధారణ ప్రజానీకంలో కలిగిస్తున్నాయని గవర్నర్ తన నివేదికలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 
ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన... 

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల పేరుతో, తరువాత ప్రజాపథం పేరుతో, ఇప్పుడు ఉప ఎన్నికల పేరుతో సాధారణ ఫైళ్లను కూడా చూడకుండా సీఎం కిరణ్ పెండింగ్‌లో పెట్టడంతో 6,000కు పైగా ఫైళ్లు సీఎం పేషీలో పేరుకుపోయినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కాక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర మనోవేదనతో సీఎం పేషీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెలాఖరులోగా పదోన్నతి రాకపోతే రిటైర్ అయిపోతామనే ఆందోళన వందలాది మంది ఉద్యోగుల్లో నెలకొంది. పదోన్నతి రాకుండా రిటైర్ అయిపోతే ఇంక్రిమెంట్ కోల్పోవటమే కాకుండా పెన్షన్ ప్రయోజనాలూ రావని ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా డిపార్ట్‌మెంట్ పదోన్నతుల కమిటీ పదోన్నతుల జాబితాలను ఆమోదిస్తుంది. సంబంధిత ఫైళ్లను కేవలం సాధారణంగా సంతకం చేసి సీఎం పంపించాల్సి ఉంటుంది. అలాంటి ఫైళ్లను కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టటం ఉద్యోగుల్లో ఆందోళన, ఆగ్రహానికి దారితీస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్లులకు చెందిన ఫైళ్లకూ మోక్షం లభించటం లేదని వాపోతున్నారు. సీఎం పేషీ అధికారులు కూడా ఫైళ్లు పేరుకుపోవటం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం చూస్తారని వందల సంఖ్యలో ఫైళ్లు పట్టుకుని క్యాంపు ఆఫీసుకు లేదా హెచ్‌ఆర్‌డీకి వెళ్లటం, నిరాశగా తిరిగిరావటం అధికారులకు పరిపాటిగా మారిపోయింది. వందల ఫైళ్లు తీసుకువెళితే పట్టుమని పది ఫైళ్లపై కూడా సీఎం సంతకాలు చేయటం లేదని సమాచారం. సాధారణ వ్యవహారాలకు సంబంధించి అధికారులు తమంతట తాము ఫైళ్లు పట్టుకుని వెళితే.. వాటిపై ‘అంత ఆసక్తి ఎందుకు?’ అని సీఎం వ్యాఖ్యానిస్తున్నారని.. దీంతో అధికారులు నీరుగారిపోతున్నారని చెప్తున్నారు. 

ప్రజాపథం తూతూ మంత్రం: మరోవైపు.. సమస్యల పరిష్కారం పేరుతో చేపట్టిన ప్రజాపథం కూడా తూతూ మంత్రంగా మారిపోయింది. ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఆ జిల్లాల్లో ప్రజాపథం పేరుతో హడావిడి చేసిన సీఎం, మంత్రులు ఇప్పుడు షెడ్యూల్ రావటంతో దాన్ని గాలికి వదిలేశారని అధికారులే అంటున్నారు. సీఎం, మంత్రులు ప్రజాపథాన్ని వదిలేసి కేవలం ఉప ఎన్నికలపైన దృష్టి సారించారని, దీంతో ఉప ఎన్నికలు లేని జిల్లాల్లో కూడా ప్రజాపథం పూర్తిగా కుంటుపడిందని, ప్రజాసమస్యలు పరిష్కారం అనేదేమీ లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రులు పట్టించుకోకపోవటంతో అధికార యంత్రాంగం కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Share this article :

0 comments: