కరెంటు చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరెంటు చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

కరెంటు చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కాయి. చార్జీలను దించాలని.. లేదంటే ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినదించాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో నిరసన ధ్వనులు మార్మోగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలో ధర్నా చేశారు. ఆందోళనకు దిగిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసు బలగాలు అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు మరో ఐదేళ్లపాటు పెంచేది లేదని 2009 ఎన్నికల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డగోలుగా చార్జీలు పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో నిలదీశారు. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయాలైన సోమాజీగూడలోని విద్యుత్‌సౌధను పార్టీ నేతలు ముట్టడించారు. 

ఇందులో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జనక్ ప్రసాద్, కె.శివకుమార్, రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసి అనర్హతకు గురైన 18 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, ఆయా జిల్లాల పార్టీ అడ్‌హాక్ కమిటీల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులూ ధర్నాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిరోసిన్ దీపాలు, కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జలుమూరుల్లో జరిగిన సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం సబ్‌స్టేషన్ వద్ద పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నాలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, కర్నూలు జిల్లాలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆందోళనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలోని సాగర్ రోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కిరోసిన్ లాంతర్లతో ర్యాలీ తీశాయి. కరీంనగర్ జిల్లాలో వేములవాడ, చొప్పదండి, ధర్మపురి, మంథని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Share this article :

0 comments: