ప్రజలపై పన్నులు బాదేసుకోండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలపై పన్నులు బాదేసుకోండి!

ప్రజలపై పన్నులు బాదేసుకోండి!

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

సీఎస్‌టీ నష్టపరిహారం ఇచ్చేదిలేదని సంకేతాలు 
రూ. 5,000 కోట్ల బకాయిల ఎగవేత! 
కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర అధికారుల్లో తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: మేం ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొడతాం... మీరు ప్రజలపై పన్నులు బాదేసి ఆ నష్టాన్ని పూడ్చుకోండంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు ఉచిత సలహా ఇచ్చేసింది. కేంద్రీయ అమ్మకం పన్ను (సీఎస్‌టీ) నష్టపరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా ఎగవేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల మన రాష్ట్రం ఏకంగా రూ. 5,000 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. అంతర్రాష్ట్ర కొనుగోళ్లకు సంబంధించి విధించే సీటీసీని నాలుగు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించినందువల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు నష్టపరిహారం ఇస్తామని గతంలో కేంద్రం అంగీకరించింది. ఈమేరకు చెల్లిస్తూ వచ్చింది. 

అయితే ఇకపై సీఎస్‌టీ నష్టపరిహారం ఇచ్చేదిలేదని, దీనివల్ల కలిగే నష్టాన్ని పన్నులు పెంచుకోవడం ద్వారా పూడ్చుకోవాలని ఇటీవల అన్ని రాష్ట్రాల వాణిజ్యపన్నుల శాఖలకు స్పష్టం చేసింది. దీనివల్ల మన రాష్ట్రం రూ. 5,000 కోట్లు కోల్పోతోంది. ‘‘మేం బకాయిలు ఎగ్గొడతాం. మీరు అదనపు పన్నులు వేసి నష్టాన్ని పూడ్చుకోండని కేంద్రం చెప్పడం ఏమాత్రం సహేతుకంగా లేదు. రాష్ట్రాల్లో అమ్మకం పన్ను పెంచుకోవాలా వద్దా? అన్నది ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి. పన్నులు పెంచుకునేందుకు అనుమతించాం. 

మేం చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొడతాం.. అని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం బాధాకరం’’ అని వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఇదెక్కడి అన్యాయం: సీఎస్‌టీ చట్టం సెక్షన్14 కింద పేర్కొన్న వస్తువులకు నాలుగు శాతం మించి పన్ను వసూలు చేయరాదు. అయితే వీటికి కూడా 5% వసూలు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. పొగాకు, చక్కెర, టెక్స్‌టైల్స్‌లాంటి సెంట్రల్ లిస్టులోని వస్తువులపై పన్ను విధించే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించింది. అందువల్ల సీఎస్‌టీ నష్టపరిహారం ఇచ్చేది లేదని, ఇంకా అవసరమైతే పన్నులు పెంచుకోవాలని కేంద్రం సూచించడంపై రాష్ట్ర అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎస్‌టీ నష్టపరిహారం ఎగవేసి మేం లబ్ధిపొందాలి, పన్నులు పెంచితే వచ్చే వ్యతిరేకతను రాష్ట్రం ఎదుర్కోవాలన్న విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 

2007- 08లో సీఎస్‌టీ 4 శాతం ఉండగా కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని 3 శాతానికి తగ్గించింది. ఇందుకు ప్రతిగా సీఎస్‌టీ నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.300 కోట్లు చెల్లించింది.

2008 -09లో సీఎస్‌టీని మూడు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించింది. సీఎస్‌టీ నష్టపరిహారం కింద కేంద్రం రాష్ట్రానికి రూ. 1,200 కోట్లు విడుదల చేసింది. 2009-10లో రాష్ట్రానికి సీఎస్‌టీ నష్టపరిహారం కింద కేంద్రం రూ. 2,200 కోట్లు విడుదల చేసింది. 

2010-11, 2011-12 సంవత్సరాలకు రూ.5,000కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నా... ఇచ్చే అవకాశం లేదని కేంద్రం మౌఖికంగా స్పష్టం చేసింది. కేంద్ర సీఎస్‌టీ నష్టపరిహారం ఇవ్వనందునే సీఎస్‌టీని రెండు శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని కూడా విరమించుకుంది. ఈ నేపథ్యంలో జనరల్ సేల్స్‌ట్యాక్స్ (జీఎస్‌టీ) అమలు చేసేందుకు కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడంలేదు. అందువల్ల ఇప్పట్లో జీఎస్‌టీ అమల్లోకి వచ్చే అవకాశం లేదని వాణిజ్య పన్నుల శాఖ అదికారులు పేర్కొన్నారు.
Share this article :

0 comments: