మత్స్యకారుణ్ని ఎమ్మెల్యే చేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మత్స్యకారుణ్ని ఎమ్మెల్యే చేస్తా

మత్స్యకారుణ్ని ఎమ్మెల్యే చేస్తా

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012


విశాఖపట్నం, న్యూస్‌లైన్:నేనిక్కడ మత్స్యకార గ్రామాల మీదుగా వస్తున్నప్పుడు.. ఓ మత్స్యకారుడు నాతో అన్నాడు.. అన్నా! మాకు ఏ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదన్నా.. రాజకీయంగా ఏ పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదన్నా అని అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా.. మీ జిల్లా(విశాఖపట్నం) నుంచి ఒక మత్స్యకారుడిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మత్స్యకారుల బాగోగుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, వేటకెళ్లి అనుకోకుండా ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే రూ.లక్ష పరిహారం కూడా ఆలస్యంగా ఇస్తోందని మండిపడ్డారు. ‘మనసున్న మంచి అన్నయ్యలా హామీ ఇస్తున్నా.. మా ప్రభుత్వం వచ్చాక పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతాం. ఈ ప్రభుత్వంలా కాకుండా.. మనిషి గల్లంతయిన ఆరు మాసాల్లోపే దాన్ని అందించి ఆ అక్కాచెల్లెళ్లను ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. విశాఖజిల్లా పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచార యాత్ర రెండో రోజు శుక్రవారం ఆయన పాయకరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఉదయం పాల్తేరులో ప్రారంభమైన రోడ్‌షో.. ఎస్.నర్సాపురం వరకూ సాగింది. ఊళ్లన్నీ రోడ్లెక్కి జగన్ కోసం బారులు తీరిన నేపథ్యంలో అడుగడుగునా జగన్నినాదాల హోరు ప్రతిధ్వనించింది. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

సర్కారువి కల్లబొల్లి మాటలు: ఉపాధి కూలీలు రోజంతా పనిచేస్తున్నా.. రూ. 60-70 మాత్రమే వస్తోంది. కనీస వేతనం రూ.130కుపైగా ఇస్తున్నట్టు చెప్తున్న ఈ ప్రభుత్వం మాటలు కల్లబొల్లివే. వచ్చే సువర్ణయుగంలో ఈ పరిస్థితి ఉండదు. అందరి కష్టాలూ తీరిపోతాయి. అవ్వలు, తాతలు కూలి పనులకెళ్లే అగత్యం లేకుండా మూడు పూటలా వారి కడుపు నిండేలా నెలకు రూ.700 పింఛను చెల్లిస్తాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు నింపేలా పాలన అందిస్తాం. ప్రతి ఇంటిలో కనీసం ఒకరు.. ఇంజినీరింగ్ లేదా డాక్టర్ లేదా ఐఏఎస్‌లాంటి ఉన్నత చదువులు చదివినపుడే పేదరికం పోతుంది. అందుకే మా ప్రభుత్వం వచ్చాక.. పిల్లల్ని బడికి పంపే తల్లిదండ్రుల ఖాతాలో నెలకు రూ.500 చొప్పున వేస్తాం. అలా ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలకు చొప్పున అందిస్తాం. వైఎస్ కలగన్న ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఈ సర్కారు తూట్లు పొడుస్తోంది. ప్రభుత్వం ఫీజులు కడుతుందో? లేదో? తెలియని ఆందోళనలో విద్యార్థుల చదువులు సాగుతున్నాయి.

కరెంట్ బిల్లు చూస్తే షాక్!: రాష్ట్రంలో ఉన్న పాలకులు సోనియా గాంధీకోసం పనిచేస్తున్నారా? రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్ మరణించాక రైతు వ్యవసాయం చేయడం కంటే ఉరేసుకోవడమే మేలనుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చారు ఈ పాలకులు. రైతన్న పరిస్థితి ఇలా ఉంటే.. కూలి చేసుకునే అక్కాచెల్లెళ్లు ఉన్న చోటు వీడి పొరుగు ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురించింది. తడి చేతులతో స్విచ్ వే స్తే ఎక్కడ షాక్ కొడుతుందోనన్న భయం లేదుగాని.. కరెంట్ బిల్లు తాకకుండానే షాక్ కొడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులకు కారణమైన ఈ ప్రభుత్వం కొనసాగేందుకు ఎలాంటి నైతిక హక్కూ లేదు. పేదలు, రైతులకు అండగా గొల్ల బాబూరావు సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి ఓటేసి తమ పదవులను సైతం త్యజించారు. వచ్చే ఉప ఎన్నికల్లో వారిని చల్లని దీవెనలతో ఆశీర్వదించి.. రాజకీయాల్లో విలువలకు పట్టంకట్టాలని కోరుతున్నా.

ఇక బ్యాంకు మేనేజర్ల మాటలు పడక్కర్లేదు..
జగన్ పాల్గొన్న పాల్తేరు సభలో లక్ష్మమ్మ అనే మహిళ మాట్లాడుతూ.. పొదుపు రుణాల దోపిడీపై గోడు వెళ్లబోసుకుంది. మూడేళ్ల కింద రూ.20 వేల రుణం తీసుకున్నానని, నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నా.. అది వడ్డీకే సరిపోతోందని, అసలు ఎప్పుడు చెల్లిస్తారంటూ బ్యాంకు మేనేజర్ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ‘వచ్చే సువర్ణయుగంలో దివంగత నేత వైఎస్ గర్వపడేలా.. అక్కా చెల్లెళ్లకు వడ్డీలేని రుణాలను అందిస్తా. ఇక ఎవరూ వడ్డీల పేరిట బ్యాంక్ మేనేజర్ల బెదిరింపులను భరించాల్సిన పనిలేదు. ఆ వడ్డీలను ముందుగానే ప్రభుత్వం చెల్లించేలా చేస్తా’ అని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: