చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు

చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012



* చంద్రబాబుతో కిరణ్ సర్కారు కుమ్మక్కుకు మరో రుజువు
* బాబు హయాంలో జరిగిన రూ. 300 కోట్ల కుంభకోణం కేసు మూసివేతకు సీఐడీ నిర్ణయం
* కాంగ్రెస్ సర్కారులోని ‘ముఖ్యుల’ ఒత్తిడే కారణం
* కాకినాడ వద్ద ‘స్పెక్ట్రమ్’ గ్యాస్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం
* 1997లో విద్యుత్ కొనుగోలుకు బాబు ఒప్పందం
* నాటి టీడీపీ సర్కారుకు భారీ ముడుపుల ఆరోపణలు
* ప్రాజెక్టు వ్యయం రూ. 100 కోట్లు పెంచి చూపిన వైనం
* ఫలితంగా ట్రాన్స్‌కోపై భారీగా స్థిర చార్జీల భారం
* నాటి నుంచి నెలకు అదనంగా రూ. 2 కోట్ల చొప్పున ఇప్పటికే రూ. 300 కోట్లు ‘స్పెక్ట్రమ్’కు సమర్పణ
* అక్రమాలపై సంస్థ ప్రమోటర్ల నుంచే ఆరోపణల వెల్లువ
* 2004లో సీఐడీ విచారణకు నాటి సీఎం వైఎస్ ఆదేశం
* బ్రిటిష్ కంపెనీ నుంచి రూ. 67 కోట్ల ముడుపులు స్వీకరించినట్లు ఈడీకి నాటి ‘స్పెక్ట్రమ్’ ఎండీ వెల్లడి
* రూ. 26 కోట్ల కాంట్రాక్టులు బోగస్‌గా నిర్ధారించిన ఐటీ
* ట్రాన్స్‌కో ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీసీఐడీ
* ఈడీ, ఐటీ తదితర శాఖల నుంచి ఆధారాలూ సమర్పణ
* నాటి ‘స్పెక్ట్రమ్’ మేనేజింగ్ డెరైక్టర్, కుమారుడు అరెస్ట్
* ఎనిమిదేళ్ల తర్వాత కేసు మూసివేతకు సీఐడీ నిర్ణయం
* బలమైన ఆధారాలున్నా.. లేవంటూ లేఖ

కె.శ్రీకాంత్‌రావు:
అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య మరో కుమ్మక్కు వ్యవహారమిది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన ఓ విద్యుత్ ప్రాజెక్టు కుంభకోణం కేసును.. కాంగ్రెస్ ప్రభుత్వ ‘ముఖ్యుడు’ ఒత్తిడి తెచ్చి మూసివేసేయించేందుకు రంగం సిద్ధం చేసిన వైనమిది. తద్వారా చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అక్రమాలకు ముసుగువేయటంతో పాటు.. సదరు విద్యుత్ సంస్థను, దాని యాజమాన్యాన్ని గట్టెక్కించేందుకు సర్కారు ప్రముఖులు తహతహలాడుతున్నారు. స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీజీఎల్) విద్యుత్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 100 కోట్ల మేర పెంచి చూపించి.. స్థిర చార్జీల రూపంలో ఇప్పటికే రూ. 300 కోట్ల వరకూ దండుకున్నదన్నది కేసు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన సూచనల మేరకు ఈ కుంభకోణంపై ట్రాన్స్‌కో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదయింది.

ఈ ప్రాజెక్టు విషయంలో తాము పాల్పడిన అక్రమాలకు సంబంధించి స్పెక్ట్రమ్ నాటి మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఎదుట స్వయంగా అంగీకరించిన వాంగ్మూల పత్రాలనూ, ఆదాయపన్ను శాఖ గుర్తించిన అవకతవకల తాలూకు నివేదికనూ, అకౌంట్లలో అవకతవకలను నిర్ధారిస్తూ బిల్‌మోర్ చార్డర్ట్ అకౌంటెంట్ ఇచ్చిన నివేదికనూ, షేర్ల తారుమారు విషయమై కంపెనీ అక్రమాలను నిర్ధారిస్తూ తీర్పుచెప్పిన హైదరాబాద్ రెండో అదనపు చీఫ్ జడ్జి కోర్టు ఆదేశాలను కూడా ట్రాన్స్‌కో సీఐడీకి అందజేసింది. సీఐడీ దర్యాప్తులో కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా లభించాయి. నిందితులను అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును మూసివేయటానికి రంగం సిద్ధం చేసింది.

మొన్నటి వరకు సీఐడీలో పని చేసిన ఓ ఉన్నతాధికారి ఈ కేసును మూసివేసేందుకు ససేమిరా అనటంతో.. ఆయనను ఏకంగా అక్కడి నుంచి బదిలీ కూడా చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తాజాగా సీఐడీ అధికారులు.. ‘స్పెక్ట్రమ్’ కుంభకోణానికి ఆధారాలు లేవని, కేసును మూసివేయాలని నిర్ణయించుకున్నామని ఫిర్యాదుదారైన ట్రాన్స్‌కోకు మూడు రోజుల కిందట లేఖ ద్వారా తెలియజేసింది. సీఐడీ అధికారులు పంపించిన లేఖపై ఆంధ్రప్రదేశ్ పవర్ కో ఆర్డినేషన్ సమావేశంలో చర్చించిన తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించాలన్న విషయం ట్రాన్స్‌కో నిర్ణయించే అవకాశం ఉంది.

విద్యుత్ కొనుగోళ్లకు బాబు ఒప్పందం...
స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీజీఎల్) కాకినాడ వద్ద 208 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నిర్మించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 జనవరి 23న ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో నిర్మించిన బ్రిటన్‌కు చెందిన రోల్స్‌రాయిస్ సంస్థ నుంచి ప్రమోటర్లయిన ‘స్పెక్ట్రమ్’ యజమానులే ముడుపులు పుచ్చుకుని.. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టచెప్పిన విషయంపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రతిఫలంగా ఈ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 18 సంవత్సరాలపాటు విద్యుత్ కొనుగోలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అంతేకాకుండా.. ఈ సంస్థకు ప్రాజెక్టు వాస్తవ వ్యయం కంటే ఎక్కువ మొత్తాన్ని స్థిర (ఫిక్స్‌డ్) చార్జీల రూపంలో చెల్లించి ట్రాన్స్‌కో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. 1998 నుంచి 2009 మార్చి వరకూ ఈ విధంగా స్థిర చార్జీల రూపంలో ట్రాన్స్‌కో రూ. 273 కోట్ల మేర స్పెక్ట్రమ్‌కు అదనంగా అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చేసుకున్న నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో మార్పు చేసే అవకాశం లేకపోవటంతో ఇప్పటికీ అధిక స్థిర చార్జీలు చెల్లిస్తూ వస్తున్నారు. అది ఇప్పటికి రూ. 300 కోట్లు దాటిపోయింది. ఒప్పందం పూర్తయ్యే నాటికి అదనపు చెల్లింపులు దాదాపు రూ. 350 కోట్లు దాటుతుంది.

కుంభకోణం జరిగిందిలా...
ట్రాన్స్‌కో నుంచి స్థిర చార్జీలు ఎక్కువగా దండుకునే లక్ష్యంతో.. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే దాదాపు రూ. 97 కోట్లు అధికంగా చూపించింది. మొత్తం రూ. 748 కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు లెక్కలు చూపింది. స్పెక్ట్రమ్ సంస్థ.. ఈ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం, అమలు, నిర్వహణ బాధ్యతలను బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ అనే సంస్థకు అప్పగించింది. అందుకు ఆ సంస్థ నుంచి ‘ఏజెన్సీ కమిషన్’ పేరుతో రూ. 67 కోట్లు ముడుపులు పుచ్చుకున్నట్లు ‘స్పెక్ట్రమ్’ నాటి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కిషన్‌రావు స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విచారణలో అంగీకరించారు. ఆ ముడుపులు తీసుకోవటం కోసమే తొవాండా సర్వీసెస్ లిమిటెడ్ అనే బోగస్ కంపెనీని సృష్టించినట్లు కూడా తన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు.

అలాగే.. ప్రాజెక్టు నిర్మాణ పనులను (తన కుటుంబ సభ్యులకే) సివిల్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు నకిలీ పద్దులు సృష్టించారు. కనీసం టెలిఫోన్ కనెక్షన్ కూడా లేని బ్లూస్టార్ కన్‌స్ట్రక్షన్స్ అనే బోగస్ కంపెనీకి రూ. 29 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపారని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. రోల్స్‌రాయిస్ నుంచి తీసుకున్న రూ. 67 కోట్ల ముడుపులను, దానితో పాటు రూ. 29 కోట్ల విలువ చేసే బోగస్ కాంట్రాక్టులను కూడా ప్రాజెక్టు వ్యయంలో కలపటం వల్ల.. దానిని వాస్తవ వ్యయం కన్నా దాదాపు రూ. 97 కోట్లు ఎక్కువగా చూపారని ట్రాన్స్‌కో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

ఇలా ప్రాజెక్టు వ్యయం పెంచి చూపటం ద్వారా.. చంద్రబాబు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం స్పెక్ట్రమ్ సంస్థకు చెల్లించాల్సిన స్థిర చార్జీలు భారీగా పెరిగాయని పేర్కొంది. (ప్రాజెక్టు పెట్టుబడి మూలధన వ్యయం మొత్తాన్ని వడ్డీతోపాటు, పన్నులు, లాభం తదితరాలను స్థిర చార్జీల కింద సదరు కంపెనీకి ట్రాన్స్‌కో ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని స్థిర చార్జీలు అంటారు.) విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ‘స్పెక్ట్రమ్’ స్థిర చార్జీల రూపంలో ప్రతి నెలా దాదాపు రూ. 14.50 కోట్లు వసూలు చేస్తోందని.. అంటే వాస్తవ వ్యయంపై స్థిర చార్జీల కన్నా ప్రతి నెలా రూ. 2 కోట్లు అదనంగా ఆ సంస్థ పొందుతోందని.. ఆ మేరకు తాము నష్టపోతున్నామని ట్రాన్స్‌కో వివరించింది.

ప్రమోటర్ల గొడవతో బయటపడ్డ అక్రమాలు...
ఈ ప్రాజెక్టు నిర్మాణం, సంస్థలోని ప్రమోటర్ల మధ్య కలహాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఆద్యంతం వివాదాస్పదమే. ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ వ్యయం పెంపు తదితర అంశాలపై ప్రమోటర్లలో ఒకరైన ఎ.వి.మోహనరావు, మరికొందరు పలు కోర్టుల్లో కేసులు వేశారు. స్పెక్ట్రమ్ ప్రాజెక్టు అక్రమాలమయమని, వ్యయం భారీగా పెంచి చూపారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటూ అప్పట్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే.. అప్పటి ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఎస్.సంపత్.. ప్రాజెక్టు వ్యయం పెంచి చూపించారనటం అవాస్తవమంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయటంతో ఈ పిల్‌ను 2002లో హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ప్రమోటర్లలో ఒకరైన ఎ.వి.మోహన్‌రావు.. మూలధన వ్యయాన్ని పెంచి చూపించిన విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. దీంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సర్కారు.. మోహనరావు ఫిర్యాదుల కాపీలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లకు అందించటంతో పాటు సీబీసీఐడీ వద్ద ప్రత్యేకంగా కేసు నమోదు చేయాలని ట్రాన్స్‌కోకు నిర్దేశించింది. ఈడీ విచారణలో.. రోల్స్‌రాయిస్ కంపెనీ నుంచి రూ. 67 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు కిషన్‌రావు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో వివిధ శాఖల నుంచి మరిన్ని సాక్ష్యాలను సేకరించింది.

అవకతవలపై విచారణకు వైఎస్ సర్కారు నిర్దేశం...
చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పోరాడిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. 2004లో అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ అవకతవకలపై సీబీసీఐడీ విచారణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎ.వి.మోహనరావు చేసిన ఆరోపణల పత్రాలు, అందుకు సంబంధించి ఈడీ, ఐటీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తదితర విభాగాల నుంచి సేకరించిన పూర్తి ఆధారాలతో ట్రాన్స్‌కో అదే ఏడాది జూన్ ఎనిమిదో తేదీన సీబీసీఐడీకి ఫిర్యాదు చేసింది. ట్రాన్స్‌కో ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు క్రైమ్ నంబర్ 21/2004తో భారత శిక్షాస్మృతి లోని 403, 405, 408, 409, 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్పెక్ట్రమ్ సంస్థ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి పెంచి చూపించిన వైనంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తర్వాత స్పెక్ట్రమ్ కార్యాలయంలోనూ, ఆ సంస్థ ఎండీగా ఉన్న కిషన్‌రావు ఇంట్లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించటమేకాక.. కిషన్‌రావును, ఆయన కుమారుడు రఘువీర్‌ను అరెస్టు చేశారు కూడా. అనంతరం వారు బెయిల్‌పై విడుదల కాగా.. కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

‘స్పెక్ట్రమ్’ అవకతవకలపై ట్రాన్స్‌కో ఫిర్యాదులోని ముఖ్యాంశాలు...
* రోల్స్‌రాయిస్ నుంచి ముడుపుల కోసం తొవాండ సర్వీసెస్ లిమిటెడ్ అనే బోగస్ కంపెనీ సృష్టి.
* ఉద్దేశపూర్వకంగా బూటకపు రికార్డులు రూపొందించటం.
* సివిల్ పనుల కోసం బ్లూస్టార్ కనస్ట్రక్షన్స్ అనే బోగస్ కంపెనీ ఏర్పాటు.
* షేర్ హోల్డర్ల జాబితానూ ఇష్టానుసారం మార్చేయటం.
* దురుద్దేశపూర్వకంగా మూలధన వ్యయాన్ని పెంచి చూపటం.
* తద్వారా అధిక మొత్తంలో స్థిర చార్జీలు పొందాలన్న దురుద్దేశం.
* ఫలితంగా ట్రాన్స్‌కో ప్రతి నెలా రూ. 2 కోట్లు అదనంగా చెల్లిస్తూ నష్టపోతోంది.
* ఆ మొత్తం ఇప్పటివరకూ రూ. 300 కోట్లు దాటిపోయింది.


షేర్ల అక్రమాలను నిగ్గుతేల్చిన కోర్టు
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్పీలు
స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీలో షేర్ల అక్రమాలపై అదే సంస్థకు చెందిన షేర్ హోల్డర్లు వేసిన కేసులో.. అక్రమాలు జరిగినట్లు కోర్టు నిర్ధారించింది. స్పెక్ట్రమ్‌కు చెందిన నిధులను దాని మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కిషన్‌రావు తనకు చెందిన ఇతర బోగస్ కంపెనీల్లోకి మళ్లించి.. ఆ నిధులనే తిరిగి స్పెక్ట్రమ్‌లో పెట్టుబడిగా పెట్టి తన కుటుంబ సభ్యుల పేరిట 4 కోట్ల షేర్లు కొన్నట్లు తేలింది. దీంతో ఆ షేర్ల కొనుగోళ్లను రద్దు చేయాలని అప్పట్లో సిటీ సివిల్ కోర్టులోని రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై కిషన్‌రావు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ పెండింగ్‌లో ఉంది.

2009లోనే విద్యుత్ ప్లాంటు స్వాధీనానికి వైఎస్ సూచనలు...
స్పెక్ట్రమ్‌కు స్థిర చార్జీల రూపంలో అధికంగా చెల్లించిన రూ.273 కోట్లను వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని 2009 మార్చిలో నాటి ముఖ్యమంత్రి రాజశే ఖరరెడ్డి అధికారులకు సూచించారు. ఆ సంస్థతో చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం కాలపరిమితి ముగిసే సమయానికి.. ‘స్పెక్ట్రమ్’ స్థిర చార్జీల రూపంలో అదనంగా రూ. 350 కోట్ల వరకూ లబ్ధిపొందుతుంది. ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకపోతే.. కొనుగోలు ఒప్పందం 2016లో ముగిసిన తరువాత.. మూలధన వ్యయం కావాలని పెంచి చూపటం ద్వారా వసూలు చేసుకున్న అధిక మొత్తానికి నష్టపరిహారంగా సదరు విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జెన్‌కోకు అప్పగించాలని వైఎస్ అప్పట్లో సూచించారని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొన్నాయి.

అయితే.. ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణలో కిషన్‌రావు వాంగ్మూలం, ఆదాయపన్ను శాఖ నివేదిక తదితర ఆధారాలు ఉన్నప్పటికీ.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కేసు మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు సీఐడీ లేఖ రాయటం పట్ల ట్రాన్స్‌కో సహా వివిధ వర్గాల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం.. అధికార -ప్రతిపక్ష పార్టీల మధ్య కుమ్మక్కు వ్యవహారమేనన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
Share this article :

0 comments: