సోనియా నన్ను పిలవడం, నేను వెళ్లడం అనే ప్రశ్నలు ఊహాజనితం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా నన్ను పిలవడం, నేను వెళ్లడం అనే ప్రశ్నలు ఊహాజనితం

సోనియా నన్ను పిలవడం, నేను వెళ్లడం అనే ప్రశ్నలు ఊహాజనితం

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

నల్లకాలువలో ఇచ్చిన మాటతోనే సమస్య మొదలైంది
ఆ మాట తప్పనందుకు పార్టీని వీడాల్సిన స్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది
26 జీవోలపై విచారించకుండా సీబీఐ చార్జిషీటు ఎలా దాఖలు చేస్తుంది?
ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తాం
సోనియా నన్ను పిలవడం, నేను వెళ్లడం అనే ప్రశ్నలు ఊహాజనితం
బాబు చేసిన కేటాయింపులు సరైనవైతే నా తండ్రి చేసినవి తప్పవుతాయా?
సీబీఐ దర్యాప్తు తీరుతోనేరాజకీయ దురుద్దేశం బయటపడుతోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తనపై వేధింపులు మొదలయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం రాత్రి ఎన్డీటీవీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పలు అంశాలపై సూటిగా సమాధానమిచ్చారు. ‘కోవూరు ఉప ఎన్నికల ఫలితం తరువాత మిమ్మల్ని మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మిమ్మల్ని అరెస్టు చేయడం ద్వారా లొంగదీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు?’ అని ఎన్డీటీవీ ప్రశ్నించినపుడు ‘కాంగ్రెస్ నా గురించి ఏమాలోచిస్తోందో నాకు తెలియదు. కానీ మేం, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే ప్రసక్తే రాదు. మేం రాష్ట్రంలో పోరాడుతున్నది కాంగ్రెస్‌తోనే! మేమిక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మా వాణిని వినిపిస్తున్నాం. అందువల్ల కాంగ్రెస్‌తో మేం కలిసి వెళ్లడమనేది ఎంతమాత్రం జరగదు. ఇక్కడ రాజకీయ పోరాటం జరుగుతోంది. కొనసాగుతూనే ఉంటుంది’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే స్వయంగా మిమ్మల్ని పిలిస్తే... ప్రెజర్ టాక్టిక్స్‌ను (ఒత్తిళ్లను) ప్రయోగించి మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకుంటే..’ అని ప్రశ్నించినపుడు ‘అవన్నీ ఊహాజనితమైన అంశాలు. సోనియా నన్ను పిలవడం, నేను కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లడం అనేది జరగదు. కాంగ్రెస్‌తో కలవడమన్నది జరగని పని..’ అని ఆయన తేల్చి చెప్పారు. తాను వ్యక్తిత్వానికీ, విశ్వసనీయతకూ విలువనిచ్చే వ్యక్తినని జగన్ వివరించారు.

సోనియా చేయించారని శంకర్రావే చెప్పారు: ‘నేను కాంగ్రెస్ పార్టీని వీడిన నెల రోజుల తర్వాత శంకర్రావు హైకోర్టుకు ఒక తేదీ లేని లేఖ రాశారు. అందులో టీడీపీ వారు కూడా భాగస్వాములయ్యా రు. ఆ తర్వాతే నాపై కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి తాను సోనియా ప్రోద్బలంతోనే హైకోర్టుకు లేఖ రాశానని శంకర్రావే స్వయంగా పత్రికలకు వెల్లడించారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడుగానీ మా నాన్న సీఎంగా ఉన్నపుడుగానీ ఏమీ జరగలేదు’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘నా తండ్రి మృతి చెందిన ప్రదేశంలో నేను మాట ఇచ్చాను. నా తండ్రి మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారికుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. ఇచ్చిన మాట మీద నిలబడటంతోనే సమస్య మొదలైంది. నా మాట అధిష్టానవర్గానికి రుచించలేదు. పార్టీని వీడటం మినహా గత్యంతరం లేని పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది’ అని అన్నారు.

వారు చేస్తే తప్పు కాదా?: సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై అడిగిన ప్రశ్నలకు జగన్ సవివరంగా సమాధానం ఇస్తూ వారి ద్వంద్వ నీతిని ఎత్తిచూపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల సంక్షేమం కోసం నిత్యం పాటుపడ్డారని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకే రకమైన విధానంతో భూ కేటాయింపులు జరిపితే.. వాటిలో ఒక్క రాజశేఖరరెడ్డి చేసినవే ఎందుకు తప్పు అయ్యాయి? మిగిలిన ఇద్దరు చేసినవీ ఎలా సక్రమమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. ఎవరినైనా వేలెత్తి చూపే ముందు దానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు. ‘రాజశేఖరరెడ్డిగారు నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా చేశారని భావిస్తే దానిని నిరూపించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏం చేశారు? రాజశేఖరరెడ్డి ఏం చేశారో పోల్చండి. వాటికి భిన్నంగా చేసి ఉంటే తప్పు అవుతుంది. చంద్రబాబు చేసింది న్యాయబద్ధం అయినప్పుడు, అదే విధానాలతో ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన మా నాన్న చేసినవి ఎలా అక్రమం అవుతాయి? మా నాన్న తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ అదే విధానాలు అవలంబిస్తే అవికూడా ఎలా న్యాయబద్ధం అవుతాయి? ఏమిటి ఇదంతా?’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబును ప్రశ్నించలేదే?: రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రంలో, దేశంలో మొదటి పదిస్థానాల్లో ప్రముఖంగా ఉండే ఫార్మా కంపెనీలకు 75 ఎకరాల చొప్పన 25 ఏళ్లకు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లీజుకిస్తే.. ఎకరా రూ.15 లక్షలకు ఇవ్వాల్సింది ఏడు లక్షల రూపాయలకు ఇచ్చారంటూ ఆయనపై సీబీఐ అభియోగాలు మోపిందని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు హైదరాబాద్ నగరం నడ్డిబొడ్డున ఎకరం నాలుగు కోట్లు చొప్పున విలువ చేసే 535 ఎకరాలను ఎకరా రూ.29 లక్షల రూపాయలకు ఎమ్మార్‌కు కేటాయించారు. పరిశ్రమలకు కాకుండా ఇలా గోల్ఫ్ కోర్స్(బాగా ధనవంతులు ఆడే ఆట)కు, హోటల్స్, విల్లాల నిర్మాణం కోసం ఆ భూముల్ని చంద్రబాబు ఇచ్చేస్తే సీబీఐ దానిపై విచారణ జరపకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదొక్కటే కాకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో 838 ఎకరాలను ఐఎంజీ భారత అనే డమ్మీ సంస్థకు కేటాయించారన్నారు. తన తండ్రి నగరానికి వంద కి.మీ. దూరంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా పేరున్న ఫార్మా కంపెనీలకు భూమిని కేటాయించారని గుర్తు చేశారు. 

వాళ్ల షేర్ల పత్రాలు ఏమైనా నా ఇంట్లో ఉన్నాయా?: ‘సాక్షి’ పత్రికలో పెట్టుబడులు ఆహ్వానించిన సమయానికి కొద్ది రోజుల ముందు పది లక్షల సర్క్యులేషన్‌తో ఉన్న ‘ఈనాడు’ దినపత్రిక ఏటా 1,800 కోట్ల రూపాయలు నష్టంలో ఉందని, అలా ఉండి కూడా ఆ సంస్థ విలువను రూ.6,800 కోట్లుగా చూపి షేర్లను అమ్ముకుందని జగన్ గుర్తు చేశారు. ‘‘నష్టాల్లో ఉన్న ఆ పత్రికలోకి రూ.2,600 కోట్ల పెట్టుబడులు వస్తే ఒప్పెలా అయింది? ‘సాక్షి’లో పెట్టుబడులు పెడితే తప్పెలా అయింది?’’ అని ప్రశ్నించారు. ‘అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ‘సాక్షి’ సర్క్యులేషన్ పరంగా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది.పెట్టుబడులు తప్పుడువే అయితే సీబీఐ నా ఇళ్లపై, ఆస్తులపై దాడులు జరిపినప్పుడు ఆ షేర్ల సర్టిఫికెట్లు ఏమైనా దొరికాయా? సీబీఐ వాటిని స్వాధీనం చేసుకుందా?’ అని ప్రశ్నించారు.

పెట్టుబడులన్నీ న్యాయబద్ధమైనవే: తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారందరూ న్యాయబద్ధంగా చెక్కుల రూపంలో.. తమ సంస్థల బోర్డు తీర్మానాలతో, పాన్ నంబర్లతో సహా పెట్టుబడులు పెట్టారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘వాళ్లు నా కంపెనీలలో కాకుండా అదే డబ్బును, అవే తీర్మానాలతో, అవే పాన్ నంబర్లతో వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే మాత్రం అవి సరైనవిగా మారిపోతాయా?’’ అని ఆయన నిలదీశారు. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ రాజకీయంగానే తనపై గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని వివరిం చారు. తన కంపెనీలో పెట్టుబడులు ‘క్విడ్ ప్రో కో’నే అయితే సీబీఐ చెబుతున్న లెక్కల ప్రకారం వారు లాభం పొందిన దానికంటే ఎక్కువ ఎందుకు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. రాబోయే ఏడాదిలో ‘సాక్షి’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లినప్పుడు పెట్టుబడిదారులు తాము పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం పొందబోతున్నారని, అప్పుడు ఈ ఆరోపణలు చేసేవాళ్లంతా ఏం జవాబు చెబుతారని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే, మంత్రిని అయ్యేవాడినని, అప్పుడు ఈ వివాదాలు కూడా వచ్చి ఉండేవి కావని అన్నారు.

జీవోలపై విచారణ జరపకుండానే చార్జిషీటు ఏంటి?

ఇదే కేసుకు సంబంధించిన 26 జీవోలపై సుప్రీంకోర్టు మంత్రులకు, సీబీఐకు ఒక వైపు నోటీసులు జారీ చేయగా, మరోవైపు ఈ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని జగన్‌మోహన్‌రెడ్డి తప్పుపట్టారు. ఆ జీవోలపై విచారణ జరపకుండా అవి న్యాయమైనవో, అక్రమమో ఎలా తేల్చుతారని ప్రశ్నించారు. ఆ జీవోలపై విచారణ జరపకుండానే సీబీఐ చార్జిషీటు దాఖలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు కనిపిస్తున్నాయన్నారు. జీవోలపై విచారణ జరపకుండానే చార్జిషీటు దాఖలు చేసిన అంశంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

Share this article :

0 comments: