ఇక డీజిల్ మోత! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక డీజిల్ మోత!

ఇక డీజిల్ మోత!

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

ధరలపై నియంత్రణ ఎత్తివేతకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం
ఎల్పీజీపై నియంత్రణ ఎత్తివేసే ప్రతిపాదన లేదు
క్రూడ్ ధరలు పెరిగినా రిటైల్ ధరలను పర్యవేక్షిస్తాం
రాజ్యసభలో కేంద్ర మంత్రి నమో నారాయణ వెల్లడి
ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు

త్వరలో ప్రజలకు డీజిల్ షాక్: బీజేపీడీజిల్ ధరలకూ రెక్కలు రానున్నాయి! ఒక్క కలంపోటుతో పెట్రోల్‌పై నియంత్రణను ఎత్తివేసి వాటి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణమైన కేంద్రం తాజాగా డీజిల్‌పై కన్నేసింది. రవాణారంగానికి ఆక్సిజన్ అయిన డీజిల్‌పై నియంత్రణను తొలగించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నియంత్రణ పోతే ఇక డీజిల్ ధరలు కూడా పైకి ఎగబాకుతాయి. అడ్డూఅదుపులేకుండా కూరగాయల నుంచి ఆర్టీసీ చార్జీల వరకు అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్ని అంటుతాయి. ఆమ్ ఆద్మీ ధరల చక్రబంధంలో చిక్కుకుంటాడు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీన్ని తాము వ్యతిరేకిస్తామని బీజేపీ తేల్చిచెప్పింది. 

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసి వాటి ధరల పెంపునకు ఆజ్యం పోసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్‌పై కూడా అలాంటి చర్యకే ఉపక్రమించింది. రవాణా రంగానికి ఆక్సిజన్ అయిన డీజిల్ ధరలపై నియంత్రణను తొలగించేందుకు సూత్రపాయ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నియంత్రణ ఎత్తివేస్తే డీజిల్ ధరలకూ రెక్కలొస్తాయి. కేంద్రం చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇక పెట్రోల్ మాదిరి డీజిల్ ధరలు కూడా భగ్గుమంటాయని బీజేపీ ధ్వజమెత్తింది. ‘మార్కెట్‌కు అనుగుణంగా డీజిల్ ధరలు ఉండాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

అయితే ప్రస్తుతానికి ఎల్పీజీపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేయాలనే ప్రతిపాదన లేదు’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పెట్రోల్ ధరలు మార్కెట్‌కు లింకై ఉన్నందున ఎల్పీజీ, కిరోసిన్, డీజిల్‌ల ధరలను ప్రభుత్వం నిర్ణయించి సబ్సిడీలో అందిస్తోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దాని ప్రభావం సామాన్యుడిపై పడకుండా ప్రభుత్వమే వాటి ధరలను నిర్ణయించి బాసటగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుదల, దేశీయ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆమ్‌ఆద్మీ చిక్కుకోకుండా డీజిల్ రిటైల్ ధరలను పర్యవేక్షిస్తామని వివరించారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ, డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయాలనే సూత్రప్రాయ నిర్ణయాన్ని గత జూన్‌లోనే తీసుకున్నామని చెప్పారు. దీనిపై ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా అన్నప్రశ్నకు సమాధానం దాటవేశారు.

డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. అన్ని రవాణా అవసరాలకు కీలకమైన డీజిల్ ధరలను పెంచడం వల్ల దాని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై ప డుతుందన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చె ప్పారు. ‘డీజిల్‌పై సూ త్ర ప్రాయ నిర్ణయమే తీసుకున్నామని, ప్రజ ల అవసరాలకు అనుగుణంగా ధరలను పర్యవేక్షిస్తామని వారు (ప్రభుత్వం) చెబుతున్నారు. ఏదేమైనా రానున్నరోజుల్లో ధరలను పెంచాలని భావిస్తున్నారు. అంటే త్వరలో కేంద్రం డీజిల్ షాక్ ఇవ్వనుంది’ అని ఆయన ధ్వజమెత్తారు. 

సబ్సిడీల తగ్గింపు లక్ష్యంగా...

2012 ప్రారంభం నుంచి మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ ఆందోళనల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. జనవరిలో 111 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ఏప్రిల్‌లో 120 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం డీజిల్‌పై లీటర్‌కు 15 రూపాయలు నష్టం వస్తోందని ఆయిల్ కంపెనీలు వాపోతున్నాయి. ప్రభుత్వం డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేస్తే ఆమేరకు భారం వినియోగదారులపై పడుతుంది. నియంత్రణ ఎత్తివేస్తే ధరవరలకు పట్టపగ్గాలుండవు. 2011-12లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది ఇంధన సబ్సిడీల కోసం బడ్జెట్‌లో రూ.43,580కోట్లు కేటాయిచింది.

దేశంలో అధిక సబ్సిడీల ఒత్తిడి వల్ల ఆర్థికలోటు విపరీతంగా పెరుగుతోంది. అందువల్ల సబ్సిడీలపై కోత విధిం చేందుకు కేంద్రం యోచిస్తోంది. సబ్సిడీల వాటా గత ఏడాది స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో 5.9 శాతం ఉండగా, ప్రస్తుతం 5.1గా ఉంది. సబ్సిడీల్లో కోతవిధించి దీన్ని 2 శాతం కంటే తక్కువకు తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డీజిల్‌పై నియంత్రణను దఫదఫాలుగా తొలగిం చాలా, లేక ఒకేసారి ఎత్తివేయాలా అనే దానిపై కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.
Share this article :

0 comments: