సర్కారును సాగనంపుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారును సాగనంపుదాం

సర్కారును సాగనంపుదాం

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012



ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజల కోసం దివంగత మహానేత ప్రవేశపెట్టిన పథకాలకు పాతరేయడమే ఇప్పటి పాలకుల కర్తవ్యంగా మారిందని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్కారును ఇంకా ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మూడో రోజైన మంగళవారం జలుమూరు, నరసన్నపేట మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పల్లె జనంతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కంబకాయ, కరవంజి, శ్రీముఖలింగం, జలుమూరు, చల్లపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆరోగ్యశ్రీపై భరోసా ఏదీ?

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తమ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ప్రజలు నిశ్చింతగా ఉండేవారు. కానీ నేడు ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. దాదాపు 135 వ్యాధులను ఆరోగ్యశ్రీ జాబితా నుంచి ఎత్తేశారు. అంతేకాక బధిర బాలలకు ఇన్నాళ్లూ 12 ఏళ్ల వరకూ చేసే కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆపరేషన్‌ను సైతం రెండేళ్లవారికే పరిమితం చేశారు. రెండేళ్లలోపే సదరు చిన్నారికి మూగ, చెవుడు ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్తేనే ఆపరేషన్ చేస్తారట. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో గమనించండి. ఇలాంటి సర్కారును ఎందుకు కొనసాగించాలో చెప్పండి. ఇలాంటి వాళ్లను సాగనంపితేనే ప్రజలకు మేలు కలుగుతుంది.

రైతుల పరిస్థితి దిగజారుతోంది..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయం చేసే బదులు ఆత్మహత్యలే నయమని భావించే పరిస్థితిని పాలకులు కల్పించారు. పసుపు, మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం మార్కెట్ యార్డుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వరి రైతు ఇంకా కుంగిపోతున్నాడు. రైతు దగ్గరున్నపుడు ధాన్యం అతి తక్కువ రేటు పలుకుతోంది. అదే ధాన్యం మిల్లర్ల వద్దకు చేరేసరికి ఎవరికీ అందని ధర చెబుతున్నారు. ఇలాంటి కష్టనష్టాలు తట్టుకోలేక అన్నదాత సేద్యానికి విరామం ప్రకటించాడు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఉపాధి హామీ కూలీలకూ కూలి గిట్టుబాటు కావడం లేదు. క్యూబిక్ మీటర్ల పేరిట కొత్త నిబంధన విధించడంతో వారికి రోజుకు రూ.50-60కి మించి కూలి
దక్కడంలేదు.

ఫీజుల పథకాన్ని ఎత్తేసే కుట్ర..

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేయాలని సర్కారు కుట్ర పన్నుతోంది. వీరి దుష్ట పన్నాగానికి రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని బలైపోయింది. ఇక ముందు అలాంటి ఘోరాలు జరగకూడదు. మహానేత వైఎస్ మరణించాక ఈ పాలకులు కొత్తగా ఒక్కరికైనా మేలు చేశారా? కొత్తగా ఒక్క ఇల్లయినా నిర్మించి ఇచ్చారా? ఇలాంటివారికి మీరే బుద్ధి చెప్పాలి. ఐదేళ్ల కాలానికి ఎన్నికయ్యాం కాబట్టి ఈ ఐదేళ్లలో జనం ఏమైపోయినా పట్టించుకోకుండా పదవులను అనుభవించే ఎమ్మెల్యేలు ఒక రకం. అయితే పేదలు, రైతులకు న్యాయం చేయలేని పక్షంలో ఆ పదవులే వ్యర్థమని భావించేవారు రెండో రకం. మన కృష్ణదాసన్న ఈ రెండో రకానికి చెందినవారు. మీరంతా మంచి మనసుతో ఆయన్ను ఆశీర్వదించండి. మీ ఓటుతో ఈ పాలకులకు బుద్ధి చెప్పండి.

Share this article :

0 comments: