చిరు రాజీనామా నోటిఫై చేయరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరు రాజీనామా నోటిఫై చేయరా?

చిరు రాజీనామా నోటిఫై చేయరా?

Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012

రాష్ట్రపతి ఎన్నికలకంటే ముందుగా రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు తాను సిద్ధమవుతున్న నేపథ్యంలో చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఇంకా నోటిఫై చేయకుండా అసెంబ్లీ సచివాలయం జాప్యం చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత నెల 29న చిరంజీవి రాజీనామా చేసినప్పటికీ.. ఇప్పటి వరకు తిరుపతి స్థానం ఖాళీ అయిన విషయాన్ని, ఉప ఎన్నిక నిర్వహించాలనే అంశంపై వివరాలను అసెంబ్లీ సచివాలయం ఇంకా ఎందుకు పంపించలేదంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయాన్ని(సీఈవో) కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. దీనిపై సీఈవో కార్యాలయం అసెంబ్లీ సచివాలయ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నప్పటికీ శుక్రవారం వరకు ఎలాంటి ఫలితం తేలలేదు. ఇప్పటికే ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాలతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. తిరుపతి ఒక్క స్థానానికి విడిగా ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటోంది. వెంటనే అసెంబ్లీ సచివాలయంతో మాట్లాడి, తిరుపతి అసెంబ్లీ స్థానం నోటిఫై అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సీఈవో కార్యాలయాన్ని కోరింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ అసెంబ్లీలో రైతుల పక్షాన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హులైన 17 ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీ అయిన విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్‌కు పంపడంలో అసెంబ్లీ సచివాలయం తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం రెండుసార్లు ఆరా తీసిన తర్వాతే వాటి వివరాలను అసెంబ్లీ సచివాలయం పంపించింది. సాధారణంగా ఎవరి రాజీనామానైనా అమోదించిన వెంటనే ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తారని ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని అంటున్నాయి. 

మూడేళ్లయితే బదిలీలు..
ఇదిలా ఉండగా..ఉప ఎన్నికలు జరగనున్న స్థానాల్లో మూడేళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న వారితోపాటు సొంత జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను మరో చోటికి బదిలీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఇలాంటి అధికారులు, ఉద్యోగుల(రెవెన్యూ, పోలీసు) వివరాలను వెంటనే తెలియజేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. వాటి ఆధారంగా బదిలీలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: