కొండ్రు, శీలం, సర్వే, హర్షకుమార్‌లు దళిత దళారులు వైఎస్ పథకాల వల్లే దళితులకు మేలు జరిగింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొండ్రు, శీలం, సర్వే, హర్షకుమార్‌లు దళిత దళారులు వైఎస్ పథకాల వల్లే దళితులకు మేలు జరిగింది

కొండ్రు, శీలం, సర్వే, హర్షకుమార్‌లు దళిత దళారులు వైఎస్ పథకాల వల్లే దళితులకు మేలు జరిగింది

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012




న్యూస్‌లైన్ నెట్‌వర్క్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా నూకలు చెల్లినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలు హెచ్చరించారు. మంత్రి కొండ్రు మురళీమోహన్, ఎంపీలు సర్వే సత్యనారాయణ, జేడీ శీలం, హర్హకుమార్‌లు దళిత జాతిని అవమానించేటట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పదవులిచ్చి, గౌరవం ఇచ్చినపుడు వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడని పొగిడినవారే... ఆయన మరణించాక దళితద్రోహి అని విమర్శించడం దారుణమని ధ్వజమెత్తారు. పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ చిత్తూరు జిల్లా తిరుపతి, రేణిగుంట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మాట్లాడారు.

దళిత దళారులైన శీలం, సర్వే, హర్హకుమార్, మురళీమోహన్‌లు మహానేతపై అభూతకల్పనలు, అసత్య ప్రచారం చేస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు సహించరని సూర్యప్రకాశ్, నాగార్జున హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేవరకూ కర్ణాటకలో ఐఏఎస్ అధికారిగా ఉంటూ వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన శీలం కూడా వైఎస్‌ను విమర్శిస్తారా? అని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ పేరుతో కళాశాల పెడతానని చెప్పి భూమి కేటాయింపజేసుకున్న కొండ్రు మురళి, అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను పడగొట్టిన నిందితులను అరెస్టు చేయకుండా ఆపిన హర్షకుమార్‌లు వైఎస్‌ను విమర్శించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితవాడల్లో చందాలిచ్చి వైఎస్ విగ్రహాలు పెట్టిస్తున్నారని మంత్రి మురళి చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

‘‘ఎక్కడికో ఎందుకు... మురళి సొంత గ్రామంలోని దళితవాడకే వెళ్లి అక్కడి ప్రజలనే అడుగుదాం... వారక్కడ విగ్రహాలను చందాలు తీసుకుని పెట్టారో సొంతంగా నిధులు పోగేసుకుని పెట్టుకున్నారో తెలుస్తుంది’’ అని సవాలు విసిరారు. ‘‘వైద్యానికి నోచుకోని వేలాది మంది దళితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన విషయం ఈ కుహనా దళితనేతలు మరిచారా? రాష్ట్రంలో నిర్మించిన 48 లక్షల గృహాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎస్సీలు, బలహీనవర్గాలేనన్నది మరిచారా? ఉన్నత విద్యకు నోచుకోని లక్షలాది మంది విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకం అమలు చేయడం ద్వారా ఎంతో మంది ఎస్సీ విద్యార్థులు లబ్ధి పొందిన విషయం గుర్తు లేదా?’’ అని నిలదీశారు. ఈ పథకాలు వైఎస్‌వి కాదనీ కాంగ్రెస్‌వేననీ చెప్పుకుంటున్న ఈ నాయకులు దేశంలో ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో ఎంత మంది దళితులకు లబ్ధి చేకూరిందో, ఎన్ని నిధులు ఖర్చయ్యాయో దమ్ముంటే ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: