ఢిల్లీ ఒత్తిళ్లతో మీరు హిందుజా సంస్థకు మేలు చేయాలంటే చేయండి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ ఒత్తిళ్లతో మీరు హిందుజా సంస్థకు మేలు చేయాలంటే చేయండి..

ఢిల్లీ ఒత్తిళ్లతో మీరు హిందుజా సంస్థకు మేలు చేయాలంటే చేయండి..

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012

* కానీ మీరు లంచాలు తీసుకుని నెపం వైఎస్ మీద వేయాలనుకోవడం దారుణం
* మరణించి ఇన్నేళ్లవుతున్నా వైఎస్‌ను ఎలా అప్రదిష్టపాలు చేయాలా అని చూస్తున్నారు
* ఆయన్ను ఎలా తిట్టాలా అని కేబినెట్‌లో చర్చిస్తున్నారు
* వైఎస్ దళితులకు, రైతులకు, పేదలకు వ్యతిరేకి అని అంటున్నారు
* ఏ సీఎం చేయని విధంగా వైఎస్ దళితులు, రైతులు, పేదల సంక్షేమానికి తపన పడ్డారు
* ఉవ్వెత్తున తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన నరసన్నపేట బహిరంగ సభ 

నరసన్నపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అహరహం శ్రమించి కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రదిష్టపాలు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం చూస్తుంటే బాధనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 

‘‘వైఎస్ చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ నేతలు ఎలా తయారయ్యారంటే.. తప్పులన్నీ వీరు చేస్తున్నారు. నెపం మాత్రం వైఎస్ మీదకు నెట్టేస్తున్నారు. చనిపోయిన ఆ మహానేత మీద అభాండాలు వేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతూ అన్నారు.. వైఎస్ దళిత వ్యతిరేకట.. వైఎస్ రైతు వ్యతిరేకట.. వైఎస్ పేద వ్యతిరేకట.. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. 

నిజంగా వైఎస్ దళిత వ్యతిరేకే.. రైతు వ్యతిరేకే.. పేద వ్యతిరేకే. అందుకే గతంలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని విధంగా దళిత, రైతు, పేదల సంక్షేమం తపించారు. ఎవరూ ప్రవేశపెట్టని పథకాలు ప్రవేశపెట్టారు. వారికి మంచి చేయాలని తాపత్రయ పడ్డారు. అందుకే ఆ దివంగత నేత నన్ను, నా తల్లిని వీడిపోయినా.. నీకు మేమున్నాం అంటూ ఈ దళితులు, రైతులు, పేదలు, అక్కా చెల్లెమ్మలు మాకు తోడుగా నిలిచారు’’ అని జగన్ ఉద్ఘాటించారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో నాలుగురోజుల ప్రచార పర్యటనకు ముగింపుగా బుధవారం సాయంత్రం నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరసన్నపేట కిక్కిరిసిపోయింది. జనం మేడలు, మిద్దెలు ఎక్కి జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

మనం ఎమర్జెన్సీలో ఉన్నామా?
ప్రజలు నన్ను టీవీల్లో కూడా చూడకుండా చేయాలని కుయుక్తులు పన్నిన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఈ బహిరంగ సభ సమయానికి కరెంట్ కూడా తీసేసింది. వీరి దుర్బుద్ధి చూస్తుంటే బాధనిపిస్తోంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఎమర్జెన్సీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. చీకట్లు కమ్ముకున్నా నన్ను చూసేందుకు వేచి ఉన్న ఇన్ని వేల మంది ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడలేదు కానీ.. వైఎస్ పాలనలో సువర్ణయుగాన్ని మనందరం చూశాం. పేదలు, రైతుల కోసం నిరంతరం శ్రమించిన మహానేత మరణించి రెండున్నరేళ్లు దాటింది. అయినప్పటికీ ఆయన మా గుండెల్లో జీవించే ఉన్నాడని ప్రజలంతా చెప్తున్నారు. కానీ ఆయన విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే బాధేస్తోంది. కొద్ది రోజుల కిందటే జరిగిన క్యాబినెట్ సమావేశంలో వైఎస్‌ను ఎలా తిట్టాలా అని చర్చించడం చూస్తే బాధనిపించింది.

వైఎస్ తలవంచుకునే పరిస్థితి తెచ్చారు
ఈ కాంగ్రెస్ పెద్దలు తప్పులు చేసి ఆ నెపాన్ని వైఎస్ మీదకు నెట్టాలని చూస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వీరు హిందూజా సంస్థకు మంచి చేయాలి అని తాపత్రయ పడుతున్నారు. మీరు(ప్రభుత్వం) ఆ సంస్థకు వత్తాసు పలకాలంటే అలాగే చేయండి. అయితే మీరు లంచాలు తీసుకుని ఆ సంస్థకు మేలు చేస్తూ.. ఆ తప్పులన్నీ దివంగత నేత మీదకి నెట్టడానికి యత్నించడం చూస్తే బాధనిపిస్తోంది. నిజంగా వైఎస్ పై నుంచి చూస్తూ ఉంటే.. ఇటువంటి వారి చేతిలోనా నేను నా రాష్ట్రాన్ని పెట్టింది అని తలవంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ పెద్దలు. మహానేత మరణించిన తర్వాత రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందీ అంటే.. విశ్వసనీయత, విలువలు అనేవి టార్చిలైటు వేసి వెతికినా కనపడే పరిస్థితి లేదు. చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబు నాయుడుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మరో న్యాయమట.

పదవీత్యాగం మాటలు కాదు..
ఐదేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మధ్యలోనే పదవులు వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది కృష్ణదాస్‌తోబాటు మరో 17 మంది ఎమ్మెల్యేలు రైతుల సంక్షేమం కోసం ఆలోచించి ఆనాడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. పేదలు, రైతుల కన్నా ఇంకేదీ ముఖ్యం కాదని చాటి పదవులు త్యజించిన ఆ ఎమ్మెల్యేలందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఉప ఎన్నికల్లో పోటీ అంటే మాటలు కాదు. పోలీసులు ప్రభుత్వానికి అండగా ఉంటారు. తమకు నచ్చినవారి కి సహకరిస్తూ నచ్చనివారిపై కేసులు పెడతారు. డబ్బు ఆశజూపుతారు. ఆప్యాయతలను, అనురాగాలనూ వేలం వేసి కొనాలని చూస్తారు. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుని విజ్ఞతతో ఓటేయాలి. మీ ఓటు పేదోడికి, రైతుకు చెందుతుందని గుర్తుంచుకోండి. మీ ఓటుతో పాలకుల కళ్లు తెరవాలి. అంతేకాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు మీ ఓటు సత్తా తెలియాలి.

రైతుల పరిస్థితి దారుణం
వైఎస్ మరణించాక రాష్ట్రంలో రైతులను పట్టించుకునేవారే కరువయ్యారు. మిర్చి, పసుపు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్నా పట్టిం చుకునే నాథుడు లేడు. వరి రైతు పరిస్థితీ అలాగే ఉంది. రైతు వద్ద ఉన్నపుడు క్వింటాల్ ధాన్యం రూ.700-750 పలుకుతుండగా, మిల్లర్ వద్దకు వచ్చేసరికి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చెరకు రైతులకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం కన్నా ఆత్మహత్యలే నయమని భావిస్తున్న రైతులు ఏకంగా సమ్మెకు దిగి దాదాపు లక్ష ఎకరాలను బీడుగా వదిలేశారు. అయినా సర్కారు స్పందించలేదు. రైతులే కష్టాల్లో ఉంటే ఇక కూలీల పరిస్థితి ఏంటి? అందుకే వేలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నాయి. పోనీ వారికి ఉపాధిహామీ పథకంలోనైనా కూలి గిట్టుబాటవుతుందా అంటే అదీలేదు. ఇప్పుడు క్యూబిక్ మీటర్ల చొప్పున కొలిచి కూలి ఇస్తుండడంతో అదీ అంతంతమాత్రంగానే వస్తోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని చూస్తుంటే బాధ కలుగుతోంది. 

అవనాపు కుటుంబానికి జగన్ పరామర్శ
విజయనగరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 9న సూరిబాబు మృతి చెందారు. జగన్ నరసన్నపేట బహిరంగ సభను ముగించుకొని రాత్రి నేరుగా విజయనగరంలోని సూరిబాబు స్వగృహానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూరిబాబు సతీమణి, కుమారులను ఓదార్చారు.

నేటి నుంచి పాయకరావుపేటలో జగన్ ప్రచారం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి రెండు రోజులపాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రైతుల కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకుని వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గొల్ల బాబూరావు విజయం కోసం ఆయన ప్రచారం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాలుగు రోజుల ప్రచార యాత్ర ముగించుకుని జగన్ బుధవారం రాత్రి కశిం కోట చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కశింకోట నుంచి ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రాత్రికి వేంపాడ మీదుగా నక్కపల్లి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. మరునాడు ఉదయం నక్కపల్లి నుంచి ప్రచారం మొదలుపెడతారు. పలు గ్రామాల్లో పర్యటించి రాత్రికి ఎస్.నరసాపురం చేరుకుంటారు. అక్కడితో యాత్రను ముగిస్తారు.

ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనిజనం ఎదురుచూస్తున్నారు: సబ్బం హరి
నరసన్నపేట సభలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మాట్లాడుతూ ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా? ఎప్పుడు ఓటేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. సరిగ్గా సభ సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కుట్రేనని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఫ్యాన్ గాలి హోరులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందన్నారు. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ పద్మప్రియ తదితరులు మాట్లాడారు.
Share this article :

0 comments: