ఉప ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ కుతంత్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ కుతంత్రం

ఉప ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ కుతంత్రం

Written By ysrcongress on Friday, April 6, 2012 | 4/06/2012

ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్న రాష్ట్ర పెద్దలు 
మట్టికరిచి, పుట్టి మునుగుతుందన్న భయమే కారణం
వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై తొలి నుంచీ కుట్రలే
తక్షణం ఎన్నికలకు ఆస్కారమున్నా కాలయాపనకు ఒత్తిళ్లు 
రాష్ట్రపతి ఎన్నికలలోపు అన్ని స్థానాలూ భర్తీ చేయడం సంప్రదాయం
దాన్ని కూడా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదంటున్న నిపుణులు
18 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాల్లోని ప్రజలకు (రాష్ట్ర జనాభాలో 8.5 శాతం) 
రాష్ట్రపతి ఎన్నికలో భాగస్వామ్యం ఉండదు
ఇది ప్రాథమిక హక్కుకు విరుద్ధం కాదా?

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఎలాగైనా నిలువరించేందుకు అధికార పార్టీ అనుసరిస్తున్న అడ్డగోలు ఎత్తుగడలు తారస్థాయికి చేరుతున్నాయి. 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానాల్లో ఇప్పట్లో ఉప ఎన్నికలు జరక్కుండా అడ్డుకునేందుకు తెరవెనుక మరో భారీ కుట్ర జరుగుతోంది. వాటిని సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు కొద్ది రోజులుగా ఏకంగా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు, వారికిచ్చిన మాట కోసం ఆ 17 మంది ఎమ్మెల్యేలూ తమ శాసనసభ్యత్వాలను తృణప్రాయంగా పరిగణించడం, రాజీనామా కూడా చేయడం, వాటిని ఆమోదించకుండా ప్రభుత్వం వీలైనంతగా సాగదీయడం, చివరికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముప్పు తప్పదేమోననే ఆందోళనతో వారిపై వేటు వేయడం తెలిసిందే. కానీ రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తిరుపతితో కలిపి ఆ 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోవడం అసాధ్యమేనని అధికార పెద్దలు పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. వాటి ఫలితాల ఆధారంగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ భారీ మార్పులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌కు ఒక్క చోటా గెలుపు అవకాశాల్లేవని సర్వేలో తేలిందని ఇటీవల ఒక మంత్రే అసెంబ్లీ లాబీల్లో బహిరంగంగా పేర్కొనడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో.. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో, వాటిని వీలైనంత కాలం పాటు వాయిదా వేయించే దిశగా అన్ని మార్గాల్లోనూ ఢిల్లీ పెద్దలపై రాష్ట్ర నేతలు ఒత్తిళ్లు పెంచారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

జగన్ ప్రభంజనంతో పాటు మరిన్ని ఇతర కారణాలను కూడా తమ వాదనకు మద్దతుగా వారు చూపుతున్నారు. భారీగా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు విపరీతమైన కరెంటు కోతలు, అడ్డగోలుగా పెరిగిన పన్నులు, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట, మద్యం సిండికేట్ల విషయమై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సిగపట్లు ప్రజలకు వెగటు పుట్టించే స్థాయికి చేరాయి. వీటన్నింటినీ ఢిల్లీ పెద్దలకు నేతలు వివరించినట్టు సమాచారం. పరస్పరం కత్తులు నూరుకుంటున్న రాష్ట్ర పెద్దలు కూడా ఉప ఎన్నికలను అడ్డుకోవడంలో మాత్రం ఒక్కతాటిపై నడుస్తున్నారు! ‘‘పరిస్థితులేవీ మాకు అనుకూలంగా లేవు. అందుకే ఆగస్టు దాకా ఉప ఎన్నికలు జరక్కుండా చూడాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చాం. రాజకీయ పార్టీగా మా వ్యూహం మాకుంటుందిగా!’’ అని గురువారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నాయకుడొకరు వ్యాఖ్యానించారు! ‘అధికార యంత్రాంగం ఎలాగూ చేతిలోనే ఉంది. డబ్బుకూ కొదవ లేదు. మరికాస్త సమయం దొరికితే చాలని చూస్తున్నాం’ అని మరో నాయకుడన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధంగా లేమంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల నియమావళికి సంబంధించిన కొన్ని సాంకేతిక సాకులను అందులో పొందుపరిచిందంటున్నారు. కనీసం ఆగస్టు దాకా ఉప ఎన్నికలు వద్దని కోరినట్టు సమాచారం.

18 అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక నూకలు చెల్లినట్టేనని ఆ పార్టీ నేతలే ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే వాటిలో ఎక్కడా గెలిచే అవకాశాలు కన్పించడం లేదంటున్నారు. ‘‘ఇటీవల జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 18 స్థానాలకు వెంటనే ఎన్నికలు జరిగితే ఇంకేమైనా ఉందా! మొత్తం రాజకీయాలే తారుమారవుతాయి. అందుకే వాటిని వీలైనంతగా వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని సీనియర్ మంత్రి ఒకరు వివరించారు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా ఈ విషయంలో రెండో అభిప్రాయమేదీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నెల్లూరు లోక్‌సభ స్థానం, 17 అసెంబ్లీ స్థానాలకు ఆర్నెల్ల గడువు ముగిసే ఆగస్టు చివరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవాల్సి ఉంది. కానీఅప్పటిదాకా వాటిని అడ్డుకుంటే ఆయా నియోజకవర్గాల్లో ఒక పథకం ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పరిస్థితిని మెరుగు పరుస్తామని ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించారు. నిధులకు కొదవ లేదంటూ ఎంతగా ధైర్యం చెబుతున్నా పలు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది! దాంతో ఆ స్థానాల్లో అభివృద్ధి పనుల పేరిట కోట్లాది రూపాయలు విడుదల చేస్తూ కిరణ్ ప్రభుత్వం ఇప్పటికే పలు జీవోలు విడుదల చేయడం తెలిసిందే. నామినేషన్ పద్ధతిలో వాటన్నింటినీ పార్టీ నేతలకు అప్పగించడానికి దాదాపుగా రూ.70 కోట్ల దాకా నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవలి కోవూరు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటుకు రూ.1,000 చొప్పున పంచినా మూడో స్థానానికి దిగజారడం తెలిసిందే. దాంతో ఈసారి అంతకు రెండింతలు ఖర్చు చేసైనా సరే, కొన్ని స్థానాలనైనా గెలుచుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు.

ఎన్నికలకు అవకాశమున్నా... 


రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం జూలై తొలి వారంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోగా లోక్‌సభ, అసెంబ్లీ ఖాళీలకు ఎన్నికలు పూర్తవాల్సి ఉన్నా రాష్ట్రంలో జరుగుతున్న జాప్యాన్ని న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. రాష్ట్రంలోని ఖాళీలకు ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని అంశాలూ సానుకూలంగానే ఉన్నాయి. శాంతిభద్రతలు అదుపులో లేకపోవడం, పరీక్షల వంటివాటిని ఈసీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పుడలాంటివేమీ లేవు. జూలై, ఆగస్టుల్లో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు గనుక మే చివర్లో, లేదా జూన్ తొలి వారంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ మొగ్గుచూపుతోంది. కానీ దాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నుంచి పరోక్షంగా ఒత్తిళ్లు పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

మే చివరి వారంలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు 


రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పదవీకాలం వచ్చే జూలై 24తో ముగియనుంది. రాజ్యాంగం నిర్దేశం మేరకు అందుకు 60 రోజుల ముందు, అంటే మే 24 లోపు విధిగా రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించాలి. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల సభ్యులూ రాష్ట్రపతి ఎన్నికకు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో వేటికీ తమ అభ్యర్థిని గెలిపించుకునేంత మెజారిటీ లేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలేవీ ఖాళీగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదే. రాష్ట్రపతి ఎన్నికలో ఒక ఎమ్మెల్యే ఓటును ఆయన ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ స్థానం ప్రజల అభిప్రాయంగా పరిగణిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతితో కలిపి 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానం ఖాళీగా ఉండటం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో అవి ఖాళీగానే ఉంటే నెల్లూరు లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో కలిపి 25 సెగ్మెంట్ల ప్రజల అభిప్రాయం ఆ ఎన్నికలో ప్రతిఫలించే అవకాశముండదు. దేశ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలో రాష్ట్రంలోని 8.5 శాతం మంది ప్రజలకు భాగస్వామ్యాన్ని దూరం చేయడంగానే దీన్ని భావించాల్సి వస్తుందని న్యాయ నిపుణులంటున్నారు. ఇది ప్రాథమిక న్యాయసూత్రాలకు, ప్రజల ప్రాథమిక హక్కుకు విరుద్ధమని విశ్లేషిస్తున్నారు.

మొదటి నుంచి కుట్రలే .... 


అవిశ్వాస తీర్మానంపై డిసెంబర్ 5న శాసనసభలో చర్చ, ఓటింగ్ జరిగాయి. రైతులు, రైతు కూలీలకిచ్చిన మాట ప్రకారం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు 17 మంది పార్టీల విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. విప్ ధిక్కరిస్తే తక్షణం వేటు తప్పదని అప్పటిదాకా బెదిరిస్తూ వచ్చిన కాంగ్రెస్, వారిపై ఫిర్యాదు చేయడానికే తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. బాగా ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు వారం తర్వాత స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 29లోగా దానిపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు. కానీ వారు డిసెంబర్ 27నే బదులిచ్చారు. విప్ ధిక్కరించామని అంగీకరిస్తూ, తమపై తక్షణం వేటు వేయాల్సిందిగా కోరుతూ విడిగా లేఖలు కూడా ఇచ్చారు. అయినా అధికార పార్టీ మరిన్ని కుట్రలు పన్నింది. వారిపై చర్యలకు అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటికే తెలంగాణలో ఆరు, కోస్తాలో ఒక అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉండటంతో.. 17 మందిపై వేటు వేస్తే అన్నింటికీ మూకుమ్మడిగా ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడింది. వారి పథకం ఫలించి, కేవలం ఏడు స్థానాలకే ఫిబ్రవరి 16న ఈసీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. అయినా 17 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కుయుక్తులు పన్నుతూ వచ్చిన కాంగ్రెస్.. అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికలు వచ్చిపడటంతో ఎట్టకేలకు వారిపై అనర్హత వేటు వేసింది. మార్చి 3న రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదలవగా, మార్చి 2న ఈ మేరకు హడావుడిగా నిర్ణయం వెలువడింది! కానీ ఆ 17 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయానికి సమాచారం పంపకుండా వారం పాటు మీనమేషాలు లెక్కించింది. ఆ వివరాలు అధికారికంగా అందాకే ఈసీకి సీఈవో కార్యాలయం నివేదిస్తుంది. ఇక చిరంజీవి రాజ్యసభకు ఎంపికవడంతో తిరుపతి శాసనసభ్యత్వానికి మార్చి 29న రాజీనామా చేశారు. కానీ ఆ స్థానం ఖాళీ అయినట్టు సీఈవో కార్యాలయానికి ఇంతవరకూ సమాచారం అందలేదని తెలిసింది!

తక్షణ ఎన్నికలకు ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ వినతి! 

నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు తక్షణం ఉపఎన్నికల షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు వినతి పత్రం అందించాలని గురువారం నిర్ణయించింది. ఆ సెగ్మెంట్ల ప్రజలకు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మనోభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని వినతిపత్రంలో కోరనుంది. అప్పటికీ సీఈసీ నుంచి సానుకూల నిర్ణయం వెలువడని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు చెప్పారు.
Share this article :

0 comments: