ఎన్నికల ప్రచార యాత్రలా కాకుండా.. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల ప్రచార యాత్రలా కాకుండా.. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా

ఎన్నికల ప్రచార యాత్రలా కాకుండా.. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

జనం మెచ్చిన నాయకుడిగా ఉండాలని.. జనం కోసం అనుక్షణం పనిచేయాలని... ఆయనే తమ నాయకుడని ప్రజలు, కార్యకర్తలు సగర్వంగా చెప్పుకోవాలని.. తన తండ్రి వైఎస్ మాదిరిగానే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే వజ్రసంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఆయన మలివిడత పర్యటనే అందుకు నిదర్శనం. 

కొబ్బరికాయ ఒలిచి, కార్మికుల్లో ఉత్సాహం నింపడం..వల వేసి చేపలుపడుతూ మత్స్యకారుల్లో ఆత్మస్థయిర్యం ప్రోది చేయడం.. దళితవాడలకు వెళ్లి, దళితుల దీనావస్థలను తెలుసుకోవడం..గొర్రెల కాపరులను కలిసి వారి కష్టాల గురించి ఆరా తీయడం.. ఇలా అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేయడానికే జననేత ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల ప్రచార యాత్రలా కాకుండా.. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఆయన మండుటెండను సైతం లెక్కచేయకుండా అలుపనేది లేకుండా తన పర్యటన సాగించారు. ప్రతి ఊరులోనూ, వాడలోనూ మహిళలు, వృద్ధులు, యువకులు జననేతకు ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. ఆత్మీయ అతిథిలా ఆదరించారు. 

నరసాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. నియోజకవర్గంలో బుధవారం మలి విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జననేత ఎక్కడికెళ్లినా జనం నీరాజనాలు పలికారు. ఆయన ప్రచారశైలి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. రాజకీయ నాయకుల్లా కేవలం ఓట్లు కోసమే ప్రజలను కలవడం కాకుండా వారు పలు సమస్యలతో పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రచార సమయంలో మొక్కుబడిగా వచ్చి వడివడిగా వెళ్లిపోకుండా నేరుగా ప్రజల్లో మమేకమై వారిలో ఒకడిగా మన్నన్నలు అందుకుంటున్నారు. మండే ఎండను లెక్కచే యకుండా ఆయన నిర్వహించిన యాత్రలో జ నం సమస్యలు తెలుసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దళితవాడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన చర్చి.. మసీదు.. మందిరంలో పార్థనలు నిర్వహించి ముందుకు సాగారు. తీర ప్రాంతంలో ప్రధానంగా ఇబ్బం దులు పడుతున్న మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని, ‘‘మీకు నేనున్నాను’’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. కొబ్బరి ఒలుపు కార్మికులను కలిసి వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల పేరుపాలంలోని సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఇద్దరు చిన్నారులకు చెందిన కుటుంబసభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న వారిని కలిసి అభినందించారు. ఇలా ఆయన తనదైనశైలిలో సాగించిన యాత్ర కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

దళితపేట నుంచి ప్రస్థానం..
పోలవరంలో నాలుగు రోజుల పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి నరసాపురం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం దళితపేట నుంచే ఎన్నికల ప్రచార ప్రస్థానాన్ని చేపట్టారు. నరసాపురంలోని స్టేషన్‌రోడ్డులో ఉన్న దళితపేటలో కొద్ది సేపు స్థానిక ప్రజలు, జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న ప్రజలు ఆయన్ను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. స్థానిక సమస్యలను వారు వివరించారు. రేషన్‌కార్డులు, పింఛన్‌లు, రోడ్లు, మంచినీరు వంటి సమస్యలను పరిష్కరించాలని, మీరు సీఎం అయితేనే మా కష్టాలు గట్టెక్కుతాయని వారు జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడే ఓటేసి గెలిపిస్తాం..
దళితపేట నుంచి ప్రచారాన్ని చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి అరుంధతీయ కాలనీలో ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ఉప ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజుకు ఓటేసి గెలిపించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. దీంతో ఉత్సాహంగా స్పందించిన ప్రజలు ‘ఇప్పుడే మీకు ఓటేసి గెలిపిస్తాం.. మా సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం మాకుంది’ అని స్పష్టం చేశారు. వారి ఆత్మీయతకు ఆనందించిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్నవి సెమీఫైనల్స్ అని, 2014లో జరిగే ఫైనల్స్ తరువాత మన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వెల్లివిరిసిన మత సామరస్యం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం పట్టణం నుంచి యాత్రను ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి చర్చి.. మసీదు.. మందిరంలో ప్రార్థనలు, పూజలు నిర్వహించి మత సామరస్యాన్ని చాటారు. తొలుత స్టేషన్‌రోడ్డులోని ఇమ్మానియేల్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా సెంటర్‌లోని ముస్లిం సోదరులతో మాట్లాడిన ఆయన ప్రార్థనలను చేసి వారి ఆశీస్సులు పొందారు. వల్లలమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

ఒక అభినందన.. మరో పరామర్శ
జగన్‌మోహన్‌రెడ్డి తన యాత్రలో మంచి పనులు చేసిన వారిని అభినందించడంతోపాటు పుట్టెడు దుఖంలో ఉన్నవారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్పును ఇచ్చారు. నరసాపురంలోని పంజా సెంటర్‌లో ఉన్న బొండమ్మ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న ఆలీని అభినందించారు. మంచి ఉద్దేశంతో పండుటాకులైన వృద్ధులకు ఆసరాగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించారు, ఇటీవల పేరుపాలెం బీచ్‌లో స్నానానికి వెళ్లి సముద్రంలో గల్లంతైన పుల్లూరి నాగ వెంకట కళ్యాణ్‌బాబు(15), పుల్లూరి మధన్‌బాబు(15) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ బాలుర కుటుంబాలు అంకంపాలెంలో ఉండటంతో అక్కడి వెళ్లి వారిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

మత్స్యారే... మెచ్చారు!
నరసాపురం నియోజకర్గంలోని ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు భరోసా ఇవ్వడంతో జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరూ సాటిరారని వారిలో నమ్మకం కలిగించారు. వేములదీవిలోని ఓ కాలువలో దిగిన చిన్నారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని మొలలోతు నీటిలో నిలిచిన ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. రోడ్‌షోలో వెళుతూ అది గమనించి కారు దిగిన జగన్‌మోహన్‌రెడ్డి వారిని పలుకరించారు. కాలువలో జాగ్రత్త.. అంటూ వారిని వారించడంతోపాటు ై‘బెబై తమ్ముళ్లు’ అంటూ ముందుకు సాగారు. పలు గ్రామాల్లో రోడ్‌షో సభల్లో మా ట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని భరోసా ఇవ్వడంతో వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

కొబ్బరిని ఒలిచి.. ధీమా ఇచ్చి
మర్రితిప్ప గ్రామంలో కొబ్బరికాయలను ఒలుస్తున్న కార్మికులను జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. ఆయన స్వయంగా ఒక కొబ్బరికాయను ఒలిచి కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కొబ్బరి దింపు, ఒలుపు కార్మికుల దుర్భరస్థితిని వివరించారు. గీత కార్మికులకు మాదిరిగానే దింపు కార్మికులకు కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పారు. గీత, కొబ్బరి దింపు కార్మికులను పూర్తిస్థాయిలో ఆదుకునేలా ప్రత్యేక ప్రణాళిను రూపొందించి వారి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని జగన్‌మోహన్‌రెడ్డి ధీమా ఇచ్చారు. 

వైఎస్‌ను స్మరిస్తూ..
జగన్‌మోహన్‌రెడ్డి యాత్రలో అడుగడుగునా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్నారు. లక్ష్మణేశ్వరం, వేములదీవి, తూర్పు బియ్యపుతిప్ప, సర్దుకొడప గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆయన ప్రారంభించారు. పీచుపాలెంసెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దర్బరేవు, మర్రితిప్ప గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పలు ప్రాంతాల్లో సాగిన రోడ్ షో సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలో వైఎస్‌ను స్మరిస్తూ తన తండ్రి మాదిరిగానే ప్రజల కోసం పనిచేస్తానని ప్రకటించారు. ఆయా గ్రామాల్లో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి పాటుపడతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని స్థానికులు సైతం తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను వివరించారు.

అడుగులో అడుగేస్తూ..
జిల్లాలో ఉప ఎన్నికలు జరగనున్న రెండు నియోజకవర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న యాత్రలో జిల్లా పార్టీ కీలక నేతలంతా అడుగులో అడుగేస్తూ ముందకు సాగుతున్నారు. బుధవారం నాటి పర్యటనలో పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాతపాటి సర్రాజు, కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహార్‌వతి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటరత్ననాయుడు(నాని), చేనేత విభాగం జిల్లా కన్వీనర్ సాయినాథ్ ప్రసాద్, ఎస్సీ సెల్ విభాగం జిల్లా కన్వీనర్ వంగలపూడి యేస్స య్య, పీడీ రాజు, అందే భుజంగరావు, గాడి నెహ్రు, వేగేశ్న కనకరాజు సూరి, మైలా వీర్రాజు, దొంగ గోపాలకృష్ణ, పాలంకి ప్రసాద్, జక్కం శెట్టి బ్రదర్స్, రామకృష్ణారెడ్డి(గుంటూరు ఆర్కే) తదితరులున్నారు. కాగా, భీమవరానికి చెందిన చర్చి ఆఫ్ క్రైస్ట్ విద్యా సంస్థల చైర్మన్, వైఎస్సార్ పార్టీ నాయకుడు మేడిది జాన్సన్ వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జాన్సన్‌ను ఎలా ఉన్నారు.. అంటూ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. 

పేదోడి గుండెల్లో గూడు కట్టుకుంటా..
నరసాపురం నియోజకవర్గంలో రోడ్ షో ముగింపు సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం తీర ప్రాంత వాసుల్లో ఆనందాన్ని, ఆలోచనను రేకెత్తించింది. ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. ‘‘నేను చనిపోయిన తరువాత నా జ్జాపకం జనం గుండెల్లో నిలిచిపోయేలా,.. నా ఫొటో, మా నాన్న ఫొటో ప్రతి పేదవాడి ఇంటిలో ఉండేలా.. సేవ చేస్తా’’ అని ఉద్వేగంగా అన్న మాటలు జనం గుండెను తట్టాయి. ఆ మాటలకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం పనిచేయడంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెబుతానని ఆయన ప్రకటించడంతో అందరిని ఆకట్టుకుంది. తీర ప్రాంత వాసులు కలలు నేరువేరుస్తానని, ఇవి కేవలం హామీలు మాత్రమే కాదని చాలెంజింగ్ చేసి చూపిస్తానని స్పష్టం చేయడంతో అందరి మన్ననలు అందుకుంది. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామని, వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, మత్స్యకార గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఏర్పాటుచేస్తామని, ప్రతి ఇంటిలోను ఒక ఇంజనీరు, మెడిసిన్ వంటి ఉన్నత విద్యను అభ్యసించేలా.. ప్రోత్సాహమిస్తానని ప్రకటించడంతో మత్సకారులు, పలు సామాజిక వర్గాల ప్రజలు కరతాళధ్వనులతో స్పందించారు.
Share this article :

0 comments: