సీబీఐ తీరు, సాయిరెడ్డి అరెస్టుపై న్యాయనిపుణుల విశ్లేషణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » , » సీబీఐ తీరు, సాయిరెడ్డి అరెస్టుపై న్యాయనిపుణుల విశ్లేషణ

సీబీఐ తీరు, సాయిరెడ్డి అరెస్టుపై న్యాయనిపుణుల విశ్లేషణ

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012

అరెస్ట్ చేయటానికి ముందే రోజుల తరబడి విచారించిన సీబీఐ 
విచారణకు అన్ని విధాలా సాయిరెడ్డి సహకరించినా అరెస్ట్ 
3 నెలల్లో చార్జిషీట్ దాఖలు చేసినా.. ఆధారాల కంటే ఆరోపణలే ఎక్కువ 
టీడీపీ ఆరోపణలు, శంకర్రావు లేఖల్లో రాసిందే చార్జిషీట్‌లో పేర్కొన్న వైనం 
రూ. 16 కోట్ల లబ్ధికి ప్రతిఫలంగా రూ. 30 కోట్లు పెట్టుబడి పెట్టారంటూ వితండ వాదన 
ఎనిమిది నెలల పాటు దర్యాప్తు చేసినా... ఇంకా ఉందంటూ కప్పదాట్లు 
సీబీఐ తీరుపై ప్రత్యేక కోర్టు అసహనం.. దర్యాప్తుపై ప్రశ్నల వర్షం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు సీబీఐ ఎనిమిది నెలల కిందటే విచారణ ప్రారంభించినా ఇంకా సాగదీయటం వెనుక రాజకీయ కక్షసాధింపు కనిపిస్తోందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దానిలో భాగంగానే అరెస్ట్ చేసి మూడు నెలలు దాటిపోయినా ఆడిటర్ విజయసాయిరెడ్డిని మరింత కాలం జైలులో ఉంచేందుకు కావాలనే కాలయాపన చేస్తోందని వారు అంటున్నారు. సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి తన తీర్పులోనూ ఈ అంశాలనే ప్రస్తావించటం గమనార్హం. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు లింకు పెట్టేందుకు సీబీఐ చేయని ప్రయత్నం లేదు. పెట్టుబడిదారులు మొదలు, ఆయా కంపెనీల అధికారులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు దిగింది. పెట్టుబడులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌తో పాటు, ఆయా కంపెనీలు పూర్తి సమాచారం అందించాయి. జగతి పెట్టుబడులు పూర్తి పారదర్శకమని, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి వారికి వివరించారు. 

కేసులో దర్యాప్తు ప్రారంభించిన తరువాత సీబీఐ అధికారులు సాయిరెడ్డిని 300 గంటల పాటు విచారించారు. విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించినా కానీ అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తరువాత కూడా ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. తీరా మూడు నెలల గడువు పూర్తయ్యేలోగా చార్జిషీట్ దాఖలు చేసినా అది అసంపూర్తిగానే ఉంది. దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పటానికే సీబీఐ ఈ నాటకమాడుతోందని న్యాయనిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘దేశ ద్రోహానికి సంబంధించినదో లేదా తీవ్రవాద కార్యకలాపాల్లో అయితే దొరికిన ఆధారాలను బట్టి చార్జిషీట్‌లు దాఖలు చేస్తారు. కానీ, ఈ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణికి అద్దం పడుతోంది’ అని సీనియర్ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. అరబిందో, హెటిరో కంపెనీలు జగతి పబ్లికేషన్స్‌లో రూ. 30 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఈ రెండు అంతర్జాతీయ ఫార్మసీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 16 కోట్ల మేర రాయితీ ఇచ్చిందన్నది సీబీఐ, తెలుగుదేశం పార్టీల ఆరోపణ. దీనినే కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎనిమిది నెలల అనంతరం కూడా సీబీఐ ఈ ఆరోపణలనే చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఆధారాలు లేకుండానే ఆరోపణలతో సరిపుచ్చింది. అంతటితో ఆగకుండా తదుపరి దర్యాప్తుకు అనుమతించాలంటూ ఆ వెంటనే కోర్టులో మెమో దాఖలు చేసింది. సాయిరెడ్డిని అరెస్టు చేసిన తరువాత మూడు నెలలు, అంతకు ముందు ఐదు నెలల నుంచి సీబీఐ విచారణ సాగిస్తూ వచ్చింది. ఈ విచారణ తంతును చివరకు సీబీఐ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పెట్టుబడుల వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందా అని సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు తీరుపై ఆయన సీబీఐకి ప్రశ్నలు సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సీబీఐ వైపు నుంచి సరైన సమాధానం రాలేదు.

సీబీఐకి న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలు ఇవీ...

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా భూకేటాయింపులు, ఇతర ప్రయోజనాలు కల్పించిందని ఆరోపిస్తున్నారు... వీటికి సంబంధించిన అన్ని జీవోలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిపొందిన కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వివరాలు తెలుసుకదా. అలాంటప్పుడు సీబీఐ ఇంకా దర్యాప్తులో తేల్చేది ఏముంటుంది? వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటున్నారు ? కుట్ర ఒక్కటే అయినప్పుడు వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉందా? 

జగన్‌ను ఎన్ని చార్జిషీట్లలో నిందితునిగా చేరుస్తారు? ఇంకా ఎన్ని చార్జిషీట్లు పెడతారు? 12 లేదా 13 దాఖలు చేస్తారా? 4 లేదా 5 దాఖలు చేస్తారా? ఒకే నేరానికి ఎన్ని శిక్షలు ఉంటాయి? వేర్వేరుగా కుట్ర జరిగిందని చెప్తూ అనేక చార్జిషీట్లు దాఖలు చేయటానికి చట్టం అనుమతిస్తుందా? 

ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నప్పుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మొదటి నిందితునిగా పెడుతూ చార్జిషీట్ ఎందుకు దాఖలు చేశారు? విచారణ పూర్తయిందని ఒకవైపు చెప్తూ మరోవైపు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు? జీవోలు, పెట్టుబడిదారుల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడు ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందా? ఈ కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుంది? నిర్ణీత గడువు చెప్పగలరా? 
Share this article :

0 comments: