'వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర'

'వైఎస్‌ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే కుట్ర'

Written By news on Monday, April 9, 2012 | 4/09/2012

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వల్లనే దళితులకు అన్యాయం జరిగిందని కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ర్పచారం వెనుక పెద్ద కుట్ర ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కొరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెఎస్‌ను దళిత వ్యతిరేకిగా రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్, రాజ్యసభ సభ్యుడు జె.డి.శీలం, లోక్‌సభ సభ్యుడు హర్షకుమార్ ప్రచారం చేయడం కాంగ్రెస్, టీడీపీ ఆడిస్తున్న నాటకంలో భాగమని ధ్వజమెత్తారు. వై.ఎస్ జీవించి ఉన్నన్నాళ్లూ ఏమీ మాట్లాడని ఈ నేతలు మరణించాక విమర్శించడం పట్ల ఆయన మండి పడ్డారు. వైఎస్‌ను నేడు విమర్శిస్తున్న ఈ నాయకులు తమ జీవితంలో ఏనాడూ పదిమంది దళితులకు కూడా సాయం చేసి ఎరుగరని శ్రీనివాసులు దుయ్యబట్టారు. 

రాజకీయాల్లోకి రాక ముందు శీలం రైల్వే శాఖలో పని చేశారని, ఆయన ఏ రోజూ దళితులకు ఉపయోగపడ లేదన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు (2004 నుంచి 2009) వరకూ ఆయనతోనే ఉండిన కొండ్రు మురళీమోహన్‌కు దళితులకు అన్యాయం జరిగిందనే విషయం గుర్తుకు రాలేదా? అని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. హర్షకుమార్ దళితుడనని చెప్పుకోవడమే తప్ప ఆ వర్గానికి చేసిందేమీ లేదన్నారు. సాధారణంగా మన సంప్రదాయంలో చనిపోయిన ఒక వ్యక్తిపై విమర్శలు చేయరని, కానీ ఇపుడు అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. దళిత వాడల్లో వైఎస్ విగ్రహాలు పెట్టుకుంటున్నారని ఈ నాయకులు అక్కసు వెళ్లగక్కడం విడ్డూరంగా ఉందని, వారి సంక్షేమానికి ఎంతో చేశారు కనుకనే వారు ఆయన్ను అభిమానిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిలో సమర్థుడైన నాయకుడిని వారు చూసుకుంటున్నారన్నారు. . ‘వై.ఎస్ మరణించాక ఆయన పథకాలన్నీ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాందీ ఆమోదించాకే ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు. ఇపుడేమో దళితులకు అన్యాయం జరిగిందని అంటున్నారు. మరి దళితులకు అన్యాయం జరగడానికి బాధ్యత సోనియాదేనని ఒప్పుకుంటారా?’ అని కొరుముట్ల ప్రశ్నించారు.

దేశంలోని ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోల్చినా, టీడీపీ తొమ్మిదేళ్ల పాలనతో బేరీజు వేసినా ఒక్క వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులకు మేలు జరిగిందనే విషయం వెల్లడవుతుందని ఆయన పేర్కొన్నారు. అసలు వై.ఎస్ మృతి చెందాక గడచిన మూడేళ్లలో ఆయన కన్నా మించి ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శీలం, మురళీమోహన్, హర్షకుమార్ వంటి వారు ఇపుడు దళితులకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందుకు వస్తున్నారంటే, అది కూడా టీడీపీ అనుకూలమైన చానెళ్లలో మాట్లాడుతున్నారంటే దీని వెనుక కుట్ర ఉందనేది స్పష్టంగా తెలిసి పోతోందని ఆయన అన్నారు. వై.ఎస్‌కు ముందు పాలించిన వారు ఎస్.సి కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చే శారు. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 1120 కోట్ల రూపాయల బకాయీలను మాఫీ చేసి 17.80 లక్షల మంది దళితులను రుణ విముక్తి చేశారని శ్రీనివాసులు తెలిపారు. 

ఇందిరప్రభ ద్వారా ఎందుకూ పనికిరాకుండా ఉండిన ద ళితుల భూములను రెండు దశల్లో అభివృద్ధి చేసి దాదాపు పది లక్షల ఎకరాలను వ్యవసాయ యోగ్యంలోకి తీసుకు వచ్చిన ఘనత వైఎస్‌దేనని ఆయన వివరించారు. వై.ఎస్ హయాంలోనో ఎస్.సి విద్యార్థులకు ఇచ్చే పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. టీడీపీ నాలుగేళ్లలోఎస్.సి పేదల ఇళ్ల స్థలాల కోసం 85 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వై.ఎస్ ప్రభుత్వం అంతకు ఆరు రెట్లు ఎక్కువగా 523 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎస్.సి సంక్షేమ హాస్టళ్లలో విద్యా ప్రమాణాలను పెంచడానికి 5000 మంది విద్యా వాలంటీర్లను నియమించిన ఘనత వై.ఎస్‌దేనన్నారు. తొమ్మిదేళ్లలో చంద్రబాబునాయుడు విద్యార్థుల మెస్ ఛార్జీలు ఒక్కసారి మాత్రమే, అది కూడా పాతిక శాతం లోపే పెంచితే వై.ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 25 శాతం, ఆ తరువాత మూడేళ్లకే మరో 40 శాత ం పెంచింది వాస్తవం కాదా? అని శ్రీనివాసులు ప్రశ్నించారు. 

టీడీ పీ అధికారంలో నుంచి దిగి పోయే చివరి ఏడాది (2004లో) ఎస్.సి సంక్షేమం కోసం 807 కోట్ల రూపాయలు కేటాయిస్తే వై.ఎస్ గద్దెనెక్కిన తొలి ఏడాదే (2004-05) 860 కోట్లు, 2007-08లో 1719 కోట్లూ కేటాయించారని ఆయన వివరించారు. దళితులు, గిరిజనుల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లాయని చెబుతున్న వారికి ఇలాంటి నిధులను ఖర్చు చేసి ఆ వర్గాల సంక్షేమానికి పాటు పడేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన ఘనత వై.ఎస్‌దేనని తెలియదా అని ఆయన నిలదీశారు. రాష్ట్ర చరిత్రలోనే 815 కోట్ల రూపాయలను ఉప ప్రణాళిక కింద నోడల్ ఏజెన్సీకి కేటాయిస్తూ 2008లో నిర్ణయం తీసుకున్నది వైఎస్సేనని ఆయన గుర్తు చేశారు. వై.ఎస్ పథకాల వల్ల నష్టం జరుగతోందని కాంగ్రెస్ నాయకులు భావిస్తే సోనియా, రాహుల్‌కు చెప్పి వాటిని రద్దు చేయించాలని శ్రీనివాసులు సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు వై.ఎస్‌పై చౌకబారు విమర్శలు మానుకుంటే మంచిదని ఆయన హితవు చెప్పారు.

జగన్‌ను అరెస్టు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు!

జగన్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించినపుడు ‘జగన్ ఏ తప్పూ చేయలేదు, ఆయనను అరెస్టు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని శ్రీనివాసులు తేల్చి చెప్పారు. ఆయనపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నవే కనుక ఒక వేళ అరెస్టు చేయడానికి సీబీఐ ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందుగా చంద్రబాబునాయుడు, బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులను చేయాలని, ఆ తరువాతే జగన్ వద్దకు రావాల్సి ఉంటుందని ఆయన మరోసారి చెప్పారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని, ఎన్నో పెండింగ్ కేసులుండగా జగన్ కేసుల్లోనే ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో 18 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెసే గెల్చుకుంటుందని అందులో ఏ మాత్రం సందేహం లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: