ఉప ఎన్నిక ల జాప్యానికి వ్యూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నిక ల జాప్యానికి వ్యూహం

ఉప ఎన్నిక ల జాప్యానికి వ్యూహం

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012



తెరపైకి స్థానిక సంస్థల ఎన్నికలు
ఉప షెడ్యూల్ రాకముందే నోటిఫికేషన్‌కు యత్నం
ఢిల్లీ నేతల ఆదేశాలతో హడావుడిగా మంత్రులు, అధికారులతో కిరణ్ భేటీ
త్వరితంగా మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
2001 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించేందుకు అఫిడవిట్ వేయాలని సూచనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పరువుపోతుందన్న భయమో... పరాజయం తప్పదన్న బెదురో... ఉప ఎన్నికలంటేనే అధికార కాంగ్రెస్‌పార్టీ వణికిపోతోంది. దీంతో వాటిని సాధ్యమైనంత జాప్యం చేయించేందుకు ఆ పార్టీ పెద్దలు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు రాష్ట్రపతి ఎన్నికలకు ముందుగానే ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగితే ఘోర ఓటమి తప్పదని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. కొంతకాలం జాప్యమైతే సంస్థాగతమైన లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు, ఆయా నియోజకవర్గాల్లో నిధుల వరదను పారించి ప్రజలను ఆకట్టుకోవచ్చని, ఆ తరువాత ఎన్నికలు జరిగితే కొంతలో కొంతైనా గౌరవం దక్కుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇటీవల మూడురోజుల పాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే అంశంపై కేంద్ర నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం.

అయితే రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశముందని సీఈసీ చీఫ్ కమిషనర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినందున ఈ తరుణంలో నేరుగా వాటిని అడ్డుకోవడం సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందువల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పించడంద్వారా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కొంత ఆలస్యం చేయించేందుకు అవకాశముంటుందని ఢిల్లీ పెద్దలు సూచనలు చేశారని చెబుతున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే సమయంలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు పెడితే సిబ్బంది కొరత వస్తుందన్న సాకు చూపించవచ్చని, దీంతో కేంద్ర ఎన్నికల సంఘమే వాయిదా వేసుకొనే పరిస్థితి కల్పించవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని, ఆ నిధులు రాబట్టుకునేందుకే స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పుకోవచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని మంత్రుల భేటీలో సీఎం కిరణ్ చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని తాము ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నామని సమావేశానంతరం మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలకు ఆటంకం అవుతాయేమో కదా? అని ప్రశ్నించగా... ‘‘స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు ఒకేసారి జరిగేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రెండింటికీ ప్రభుత్వ సిబ్బందిని ఏర్పాటు చేయడం సాధ్యమయ్యేది కాదు. స్థానిక షెడ్యూల్ ముందే వస్తే... అవి పూర్తయ్యాకనే ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.

అందుకే ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా కేబినెట్ సమావేశంలో సీఎం కిరణ్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఉపఎన్నికల్లో పరాజయం ఎదురైతే సీఎంపై తీవ్రమైన ప్రభావం చూపగలదని కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నికల సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం వల్ల చర్చంతా మున్సిపల్ ఎన్నికలపై వెళుతుందని, తద్వారా ఉపఎన్నికల ప్రభావం ప్రభుత్వంపై పడకుండా తగ్గుముఖం పడుతుందని, అందుకోసమే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

సత్వర ఏర్పాట్లు చేయండి..

పురపాలక సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించడానికి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 2011 జనాభా లెక్కల నోటిఫికేషన్ ఎప్పటిలోగా వస్తుందో భారత జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్ నుంచి సమాధానం తెప్పించుకోవాలని సూచించారు. 2011 జనాభా లెక్కల నోటిఫికేషన్ ఆలస్యమయ్యే పక్షంలో 2001 ఆధారంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించారు. జనాభా లెక్కల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని కోరుతూ డెరైక్టర్ జనరల్‌కు ఇదివరకే లేఖ రాశామని పురపాలక శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు.

2011 జనాభా లెక్కల నోటిఫికేషన్ వచ్చిన నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని, 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాన్ని వివరించారు. మునిసిపల్ ఎన్నికలు, సహకార సంస్థలకు ఎన్నికల నిర్వహణ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రెండు నెలల్లోగా ఎన్నికలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంవల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని హైకోర్టుకు వివరించి ఎన్నికలు నిర్వహించడానికి అనుమతిపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనాభా లెక్కల సేకరణ ఆలస్యమయ్యే అవకాశాలను వివరించాలని చెప్పారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే... 14 మునిసిపల్ కార్పొరేషన్లు, 91 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే 2001 నుంచి 2011 నాటికి పట్టణ జనాభా 27 నుంచి 33 శాతానికి జనాభా పెరిగింది. తద్వారా ఎస్సీ, ఎస్టీలకు లభించే రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2001 లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే... తమకు లభించే స్థానాలను తగ్గించే కుట్ర జరుగుతోందంటూ ఆ వర్గాలు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

పీఆర్ ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపు..!

పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న 60.5 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించడం ద్వారా తక్షణమే ఎన్నికలకు వెళ్లడానికి వీలుందని అధికారవర్గాలు వివరించాయి. అయితే అప్పుడైనా 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. తాజా జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తరువాత పదేళ్ల కిందట డేటాతో ఎన్నికలకు వెళ్లడంపై ఎవరు కోర్టుకు వెళ్లినా అవి ఆగిపోకతప్పదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: