ఆరోగ్యశ్రీపై మరో దొంగదెబ్బ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యశ్రీపై మరో దొంగదెబ్బ!

ఆరోగ్యశ్రీపై మరో దొంగదెబ్బ!

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

*ఆసుపత్రి అభివృద్ధి నిధుల వినియోగంపై ఆంక్షలు
* ఇక పైసా ఖర్చు చేయాలన్నా పడిగాపులు కాయాల్సిందే
* కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమ్మడి ఖాతాలు ప్రారంభించాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరోగ్యశ్రీపై సర్కారు మరో దొంగదెబ్బ వేసింది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాల్లో ఏమాత్రం వసతులు కల్పించకుండానే ఆరోగ్యశ్రీ నుంచి 133 జబ్బులను సర్కారీ ఆసుపత్రులకు మళ్లించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆసుపత్రి అభివృద్ధి నిధులపై కన్నేసింది. ఇకపై ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలకు వచ్చే నిధులను కలెక్టర్ల పరిధిలోనే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ ఆయా ఆస్పత్రి పరిధిలోనే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ కన్వీనర్, సూపరింటెం డెంట్ తదితరుల సభ్యుల ఆమోదంతో స్థానికంగా ఆరోగ్యశ్రీ నిధుల వినియోగం జరిగేది. 

సొసైటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నా నిధుల వినియోగానికి సంబంధించి కలెక్టర్ అనుమతులు ఉండేవి కావు. ఇప్పుడు కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్)ను ప్రారంభించి తప్పనిసరిగా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు చెందిన చీఫ్ మెడికల్ ఆడిటర్ ఆదేశాలు వెలువరించారు. దీంతో ఆరోగ్యశ్రీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు స్తంభించనున్నాయి. ఉదాహరణకు ప్రొద్దుటూరు ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగితే అందుకు సంబంధించిన నిధుల ఖర్చుకు కడప వెళ్లి కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 బోధనాసుపత్రులు, 4 రిమ్స్‌లు, 17 జిల్లా ఆస్పత్రులు, 58 ఏరియా ఆస్పత్రులకు సంబంధించిన సూపరింటెండెంట్‌లు ఇకపై కలెక్టర్ల చుట్టూ తిరిగితే తప్ప నిధులు మంజూరు కావు. 

మరోవైపు కలెక్టర్ల వద్దకు సూపరింటెండెంట్‌లు వెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కలెక్టర్లతో జాయింట్ అకౌంట్ అనేది ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడమేనని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 31 ఏరియా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఎక్స్‌రే యూనిట్లు లేవు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌లు పనిచేయడం లేదు, 14 జిల్లా ఆస్పత్రుల్లో ల్యాప్రొస్కొపిక్ పరికరాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులపై కూడా రెవెన్యూ శాఖకు లింకు పెడుతూ ఆదేశాలివ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: