నంబర్ ప్లేట్ల టెండర్ల మళ్లీ రద్దు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నంబర్ ప్లేట్ల టెండర్ల మళ్లీ రద్దు?

నంబర్ ప్లేట్ల టెండర్ల మళ్లీ రద్దు?

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012


యూపీలో బయటపడ్డ ఆ సంస్థ భాగోతం
ఖరారైన టెండర్లను రద్దు చేసిన అక్కడి హైకోర్టు
టెండర్లు తెరిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవంటున్న సర్కారు
టెండర్లు రద్దు చేసి.. ఆర్టీసీకి కాంట్రాక్టు కట్టబెట్టాలని యోచన

హైదరాబాద్, న్యూస్‌లైన్ : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే ఒకసారి రద్దయిన టెండర్లు రెండోసారి కూడా రద్దు కాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు ఖరారులో ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో కళ్లు తెరిచిన మన రాష్ట్ర సర్కారు టెండర్లను రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయించింది. దేశ భద్రత ను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెడుతున్న హైసెక్యూరిటీ ప్లేట్ల రంగంలోకి నేరచరితులు ప్రవేశించడాన్ని తీవ్రంగా పరిగణించిన యూపీ హైకోర్టు.. ఖరారు చేసిన టెండర్లను రద్దు చేయడమేగాకుండా ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో పలువురు ఐఏ ఎస్ అధికారుల మెడకు ఈ కేసు చుట్టుకుంది. యూపీలో కాంట్రాక్టు దక్కించుకున్న ముంబైకి చెందిన సంస్థకు క్రిమినల్ చరిత్ర ఉండడం.. తప్పుడు ఆఫిడవిట్లను సమర్పించినట్లు అభియోగాలు నమోదు కావడంతో అక్కడి హైకోర్టు టెండర్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అదే సంస్థ మన రాష్ట్రంలో కూడా..?

యూపీలో పోటీ పడిన వివాదాస్పద సంస్థ మన రాష్ట్రంలో కూడా నంబర్‌ప్లేట్ల ప్రాజెక్టును దక్కించుకునేందుకు బరిలో నిలించింది. ఇప్పటికే సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన ఈ సంస్థ గత చరిత్ర తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నివ్వెరపోయింది. యూపీ కోర్టు తీర్పు నేపథ్యంలో చివరి నిమిషంలో ఆర్థిక బిడ్లను తెరవకుండా నిరవధికంగా వాయిదా వేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ... టెండర్లలో ఎల్-1గా నిలిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడమేగాక... న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని బెంబేలెత్తిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ఖరారుపై పునరాలోచనలో పడింది. అంతేగాకుండా యూపీలో ఆ సంస్థ దాఖలు చేసిన ధ్రువపత్రాలే ఇక్కడా సమర్పించినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో టెండర్లను రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ అంశంపై వారంరోజులుగా మల్లగుల్లాలు పడిన అధికార యంత్రాంగం టెండర్ల రద్దును అధికారికంగా ప్రకటించకున్నా... కొంతమంది బిడ్డర్లకు మాత్రం ఈ సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. మన రాష్ట్రంలో కూడా నంబర్‌ప్లేట్ల ప్రాజెక్టును ఎగరేసుకుపోయేందుకు ఈ సంస్థ తెరవెనుక పెద్ద లాబీయింగ్ నెరిపింది. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై నిబంధనలను తమకు అనుకూలంగా మలచుకోవడం గమనార్హం.

మరింత గడువు..

ఈ నెల 31లోగా కొత్త వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మరింత సమయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఆర్టీసీ వైపే మొగ్గు..

నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించలేదంటూ కొలిక్కివచ్చిన టెండర్లను ఇప్పటికే ఒకసారి సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరోసారి తాజాగా అదే పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి తలెత్తడంతో ఇకపై ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టును ధారాదత్తం చేయడంపై పునరాలోచన చేస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే ఆర్టీసీ మాత్రం కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకోవాలని చూసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. అటు వాహనదారులకు, ఇటు సంస్థకు ఉభయతారకంగా లబ్ధి చేకూర్చేలా నంబర్‌ప్లేట్ల ప్రాజెక్టును ఆర్టీసీయే సొంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.

Share this article :

0 comments: