‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’

‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

* * ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన జననేత జగన్
* * ఉప్పు రైతుకు గొప్ప భరోసా
* * మత్స్యకారులు, గీత కార్మికులకు కొండంత అండ
* * అధికారం చేపట్టిన ఏడాదిలో వశిష్ట వారధి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ
* * పిల్లలను బడికి పంపితే తల్లిదండ్రులకు పారితోషికం

‘‘రోడ్‌షో అంటే రెండు వేళ్లు చూపిస్తూ వడివడిగా ముందుకు వెళ్లిపోవడం కాదు.. ఎన్నికల ప్రచారమంటే చేయి ఊపుతూ సరిపెట్టడం కాదు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఒరవడికి నాంది పలికారు. నాయకుడంటే జనం మధ్యకు వెళ్లాలి.. జనం సమస్యలు తెలుసుకోవాలి.. జనం కోసం పనిచేస్తామన్న నమ్మకాన్ని కలిగించాలి..అనే రీతిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు భిన్నంగా అచ్చమైన నాయకుడిలా ఆయన జనతరంగం వెన్నంటి రాగా ముందుకు సాగారు. నరసాపురం నియోజకవర్గంలో మలివిడత పర్యటనలో రెండో రోజు గురువారం తీరగ్రామాల్లో ఆయన విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించారు. మత్స్యకారుల కష్టాలను తెలుసుకుంటూ.. గీత కార్మికులను పలుకరిస్తూ.. ఉప్పు కార్మికులకు భరోసా ఇస్తూ.. మహిళలు, విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం నింపుతూ ఆయన యాత్ర సాగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఊరూరా కలయతిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ సాగిం చిన రోడ్‌షోలకు జనం వెల్లువలా తరలివచ్చారు. మారుమూల పల్లెల్లో సైతం రోడ్లు జనంతో కిటకిటలాడాయి. వాడవాడలా పండుగ వాతావరణం నెలకొంది.

నరసాపురం/ నరసాపురం రూరల్, న్యూస్‌లైన్ : నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాగించిన పర్యటనలో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఆయన పర్యటన ఆవశ్యకతను ఉత్సాహం నింపడంతో పాటు ఇటు ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచింది. నరసాపురం మండలం సర్దుకొడప గ్రామంలోని తిరుమాని వడ్డికాసులు నివాసం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు ఎన్నికల పర్యటనను ప్రారంభించారు. తొలుత మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ రూపొందించిన కరపత్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. 

అనంతరం అదే గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ‘‘అవ్వా.. నీలాంటి వాళ్లందర్నీ ఆదుకునేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు. ‘‘బాబా నువ్వు సీఎం కావాలి.. నా లాంటి వాళ్ల కష్టాలు తీరాలి’’ అంటూ వృద్ధురాలు దీవించింది. గీత కార్మికులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నా.. రోజంతా కష్టపడితే ఎంత సంపాదిస్తారన్నా.. కుటుంబ పోషణకు అది సరిపోతుందా.. అంటూ గీత కార్మికుల యోగక్షేమాలను జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారు. గీత వృత్తిపై ఆధారపడిన తమలాంటి వారెందరో జీవనోపాధి లేక రోడ్డున పడుతున్నారని గీత కార్మికులు ఆయనకు వివరించారు. గీత కార్మికులను ఆదుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కరింశెట్టివారిపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. పింఛన్లు, రోడ్లు, మంచినీరు, కరెంటు సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బండారువారిపేటలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించిన ఆయన చర్చిలో ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. పెదమైనవానిలంకలో ఉప్పు మడులను పరిశీలించారు. 

తూర్పుతాళ్లు సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చామకూరిపాలెంలో రోడ్‌షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక నాయకుడు బొక్కా రాధాకృష్ణ నివాసానికి వెళ్లి అక్కడ పార్టీశ్రేణులతోను, ఆ ప్రాంత ప్రజలతోను మాట్లాడారు. చామకూరిపాలెం మెరకలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎల్బీచర్లలో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. జీవనోపాధి కోసం సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యాబిడ్డలు ఎంత తల్లడిల్లుతారో తనకు తెలుసునని, అటువంటి బాధాకరమైన సందర్భంలో ఆ కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. దానిలో రూ.50 వేలు వారం రోజుల్లో అందించి మిగిలిన రూ.4.50 లక్షలు ఆరు నెలల్లో అందిస్తానని ప్రకటించారు.

ఇది నాకు చాలెంజ్..
చిన్నారులు చదువుకు దూరంగా.. కుటుంబ పోషణకోసం కూలి పనులు చేస్తున్న సంఘటనలు తన హృదయాన్ని కదిలించివేస్తున్నాయని, అటువంటి వారికి ఏదో రకంగా మేలు చేయాలన్న ఆలోచన తనకు ఉందని ఆయన ప్రకటించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులకు తాను ఒక భరోసా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారిని బడికి పంపితే చాలని, వారి తల్లిదండ్రులకు నెలకు రూ.వెయ్యి చొప్పున పారితోషికాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు చేయాల్సిందల్లా పిల్లలను బడికి పంపడమేనని, వారికి సర్కారు బడుల్లోనూ ఇంగ్లిషు చదువులు చదివించి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది నిజంగా తనకు పెద్ద చాలెంజ్ అని, ఇది అమలు చేయగలిగితే స్వర్గంలో ఉన్న తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనందిస్తారని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా తన తండ్రి మాదిరిగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటానని ఆయన ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన ఏడాదిలోగా నరసాపురం - సఖినేటిపల్లి వశిష్ట వారధిని పూర్తి చేసి చూపిస్తానని ఆయన ప్రకటించడంతో ప్రజలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. 

ముందు జిల్లా నేతలు.. జనంతో జగన్
నరసాపురం నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన రోడ్‌షో సందర్భంగా జనంతో జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ట్రాక్టర్ ట్రక్కునే వేదికగా చేసుకుని జిల్లా నేతలు ప్రసంగాలు చేసి ప్రజలను ఉత్తేజితులను చేశారు. జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, మోచర్ల జోహార్‌వతి, పార్టీ నాయకులు అందే భుజంగరావు, మైల వీర్రాజు, వంగలపూడి ఏషయ్య, కావలి వెంకటరత్నంనాయుడు (నాని), డీఎస్‌ఎస్ సాయినాథ్ ప్రసాద్, పీడీ రాజు, దొంగ గోపాలకృష్ణ (గోపి), పాలంకి ప్రసాద్, పట్టా రజనీకుమారి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అందే భుజంగరావు, మరికొందరు నేతలు చిరంజీవి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడులపై ఘాటైన విమర్శలు చేశారు. సామాజిక న్యాయం చేస్తానంటూ సొం త సామాజికవర్గాన్నే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసి సొంత లాభం చూసుకున్న చిరంజీవిని జనం నమ్మే పరిస్థితిలో లేరని వారు ఎద్దేవా చేశారు. 

చేరికలతో మరింత ఊతం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం పాలకొల్లుకు చెందిన పీఆర్పీ నాయకుడు ఆకెన వీరాస్వామి (అబ్బు), ఉల్లంపర్రు మాజీ సర్పంచ్, మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు పాశర్ల తులసి, ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయకుమార్ (ఖమ్మం), కర్నూలు జిల్లా నందికొ ట్కూరుకు చెందిన పీఆర్పీ నాయకు రాలు మాదారపు రేణుకమ్మ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Share this article :

0 comments: