ముఖలింగేశ్వరుని పాదాల చెంత జగన్ ఉద్వేగ ప్రసంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముఖలింగేశ్వరుని పాదాల చెంత జగన్ ఉద్వేగ ప్రసంగం

ముఖలింగేశ్వరుని పాదాల చెంత జగన్ ఉద్వేగ ప్రసంగం

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

వెల్లువెత్తిన జనసంద్రం 
చిందులేసిన ఉత్సాహం
ముఖలింగేశ్వరుని పాదాల చెంత జగన్ ఉద్వేగ ప్రసంగం

దేవుడు ఆదేశించాడు.. అర్చకులు ఆశీర్వదించారు.. ఓ మాతృమూర్తి దిష్టి తీసింది.. ఇక అంతా జయమే అంటూ జనం నినదించారు. ఉత్సవాలప్పుడే భక్తజనం పోటెత్తే పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం కాలం కాని కాలంలో.. జాతరలు లేని సమయంలో అభిమాన జనంతో కిక్కిరిసిపోయింది. మూడో రోజు జననేత ప్రచారయాత్రకే కళ తెచ్చిన శ్రీముఖ లింగం సభ స్ఫూర్తి.. అక్కడి జనం ఆర్తి.. చివరికంటా కొనసాగింది. అభిమాన హోరులో కుట్రలు కొట్టుకుపోయాయి. బెదిరింపులే బెదిరిపోయాయి. ప్రత్యర్థులకు పట్టున్న పల్లెలూ జై కొట్టాయి. జగనన్నను చూసేందుకు ఉరకలేశాయి. మిగిలిన గ్రామాలతో కలిసి ఆయన అడుగులో అడుగేశాయి. అది రోడ్డుషో అయినా.. రోడ్డు పక్క సభ అయినా.. కనిపించిన దృశ్యం.. వినిపించిన గుండెచప్పుడు ఒక్కటే. కష్టాలు తెలిసినవాడిగా.. తమలో ఒకడిగా ఇమిడిపోతూ.. భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న నేతను చూసి ప్రతి పల్లె పరవశించిపోయింది.

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అడుగడుగునా ప్రేమాభిమానాలు పెల్లుబికాయి. ఉప్పెనై ఉరికాయి. వెల్లువై ముంచెత్తాయి. అడ్డంకులను తోసిరాజన్నాయి. ఉత్సాహం చిందులేసింది. అన్నలా ప్రేమిస్తాడని, కొడుకులా ఆదుకుంటాడని, మనవడిలా చేదోడుగా ఉంటాడనే నమ్మకంతో జనం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోసం నిరీక్షించారు. మండుటెండను సైతం లెక్క చేయలేదు. ఆయన రాగానే మంగళ హారతులతో ఎదురేగారు. ఉత్సాహంతో చిందులేశారు. డప్పు వాయిద్యాలతో నృత్యం చేస్తూ స్వాగతం పలికి ఊళ్లోకి తీసుకువెళ్లారు. చిన్నారులు కేరింతలు కొడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పతాకాలతో వెన్నంటి పరుగులు తీశారు. రాత్రి పొద్దుపోయినా చెక్కు చెదరని ఆదరణతో ఊరూ వాడా జనం అక్కున చేర్చుకున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నరసన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన ఉప ఎన్నికల ప్రచారం మూడో రోజు మంగళవారం ఆద్యంతం విజయవంతంగా సాగింది. ఉదయం నరసన్నపేటలోని పొట్నూరు రమేష్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో అడవి నారాయణవలస, నరసన్నపల్లి జంక్షన్, చిన్న కరగాం, పెద్ద కరగాం మీదుగా కంబకాయ గ్రామానికి చేరుకుంది. అక్కడ నౌపడా అప్పారావు అనే రైతుతో జగన్‌మోహన్‌రెడ్డి సంభాషించారు. ధాన్యం మద్దతు ధరను అడిగి తెలుసుకున్నారు. క్వింటాకు రూ.800 ఇస్తున్నారని, ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. జననేత స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ కూడలి వద్ద ప్రజ ల నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బైరి కాళిదాస్, నౌపడా లచ్చయ్యతోపాటు మరో 50 మంది పార్టీలో చేరారు. అనంతరం రోడ్‌షో గుండువలస, తాళ్లవలస మీదుగా కరవంజికి చేరుకుంది. అక్కడి ప్రజలు గ్రామ పొలిమేరకొచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో నృత్యం చేస్తూ గ్రామంలోకి తోడ్కొని వెళ్లారు. 

అక్కడ జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం హుస్సేన్‌పురం, గొలియాపుట్టి, జగన్నాథపురం, తమ్మయ్యపేట, ఉప్పాడపేట, తమ్మయ్యపేట కాలనీ మీదుగా జలుమూరు చేరుకున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి జలుమూరు, బుడితి మీదుగా అచ్యుతాపురం, నగరికటకం గ్రామాలకు చేరుకున్నారు. దారిపొడవునా మహిళలు మంగళ హారతులతో ఎదురేగారు. జననేతకు నుదుట కుంకుమ దిద్ది అభిమానాన్ని చాటుకున్నారు. తర్వాత శ్రీముఖలింగం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామ పొలిమేరలో వేలాదిమంది స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గ్రామంలోకి తోడ్కొని వెళ్లారు. జననేత గ్రామంలో అడుగుపెట్టగానే వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయి శివరాత్రి జాతరను తలపించాయి. శ్రీముఖలింగేశ్వరుని పాదాల చెంత జగన్‌మోహన్‌రెడ్డి అశేష జనవాహినినుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.

ఇదే వేదికపై కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు తమన్నగారి వెంకటరమణ, మండల టీడీపీ అధికార ప్రతినిధి చింతాడ వెంకటరమ ణ, ఆ పార్టీ నేతలు పంచాది వెంకటరమణ, పంచాది ధనుంజయస్వామితోపాటు 50 మం ది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీముఖలింగేశ్వరుని ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత జలుమూరు చేరుకుని అప్పటికే జనసంద్రమైన ప్రధాన కూడలి వద్ద ప్రసంగించా రు. ఈ సందర్భంగా జలుమూరు ఎంపీటీసీ మాజీ సభ్యుడు గురువిల్లి త్రినాథరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి చల్లవానిపేట చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం గోపాల పెంటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి మబగాం వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి మార్గమధ్యంలో ఉన్న మాకివలస(టీడీపీ అభ్యర్థి శిమ్మ స్వామిబాబు సొంత గ్రామం)లో అశేష జనం ఘనస్వాగతం పలికారు. ఈ అపురూప జనస్పందన అధికార కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
Share this article :

0 comments: