నువ్వో లిక్కర్ డాన్‌వి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నువ్వో లిక్కర్ డాన్‌వి

నువ్వో లిక్కర్ డాన్‌వి

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

పీసీసీ చీఫ్ బొత్సపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్, శ్రీనివాసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సిగ్గు ఎగ్గు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. వారిద్దరూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిపై మండిపడ్డారు. ‘‘ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఉప ఎన్నికలు వచ్చాయనీ, అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలు అమ్ముడుబోయారనీ కడప పర్యటనలో బొత్స మాట్లాడారు. అసలు ఆయనకు సిగ్గు, ఎగ్గు ఏమైనా ఉందా... అలా మాట్లాడ్డానికి? అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేయొద్దని అసెంబ్లీ లాబీల సాక్షిగా ప్రలోభాలు పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంటే వారి పక్షాన నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేం ఓట్లేశాం. 

మా నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం రైతుల కోసం నిలబడ్డాం. మమ్మల్ని అమ్ముడుబోయామని అంటారా? అసలు లిక్కర్ మాఫియా డాన్‌వి నువ్వు... నీలాంటి వాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండటమే దౌర్భాగ్యం’’ అని నిప్పులు చెరిగారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక గత మూడేళ్లలో రైతులకు రాష్ట్రంలో ఒక భరోసా కరువైందని చెప్పారు. గిట్టుబాటు ధర లభించక వరంగల్‌లో రైతులు తాము పండించిన మిర్చి పంటనే తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు వీలుగా రూ.3,000 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని జగన్ చాలాసార్లు డిమాండ్ చేసినా సర్కారు పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. 


ముగ్గురూ దోచుకుంటున్నారు
వైఎస్‌ను మహాదొంగ అంటూ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. వాస్తవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డితో కుమ్మక్కై తెరవెనుక రాజకీయాలు చేస్తున్నది బాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స, బాబు, కిరణ్ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లో వైఎస్, జగన్‌లకు ఉన్న అపూర్వమైన ఆదరణను చూసి ఓర్వలేకనే బాబు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు క్విడ్ ప్రోకో (ఫలానికి ప్రతిఫలం) చోటు చేసుకున్నది బాబు హయాంలోనేనని విమర్శించారు. బాబుపై విచారణకు ఆదేశిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనీ, తనపై విచారణ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే ఉన్నతాధికారిని ప్రమోషన్ పేరిట బదిలీ చేయించే ఘనత బొత్సదనీ విమర్శించారు. 

వైఎస్ బొమ్మ పెట్టుకునే తాము గెలిచామనీ... ఇప్పుడు కూడా వైఎస్‌బొమ్మ పెట్టుకునే పోటీ చేస్తామనీ.... తమను విమర్శించే నాయకులకు దమ్ముంటే సోనియా బొమ్మతో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బాబు, బొత్స అందరూ కలిసి కుయుక్తులు పన్నుతున్నారనీ... ఎన్ని చేసినా ఆయన్ను ఎవరూ ఆపలేరనీ శ్రీనివాసులు చెప్పారు. ఉప ఎన్నికల్లో కుయుక్తులు పన్నే వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
Share this article :

0 comments: